డబ్బులిచ్చే ధనవంతులకు ప్రత్యేక పూజలంటూ అంతరాయం కల్గిస్తారా?
బృందావన్‌లోని బంకీ బిహారీ జీ ఆలయ నిర్వాహకులపై సుప్రీంకోర్టు ఆగ్రహం
న్యూఢిల్లీ: ఆలయాల్లో ధనవంతులిచ్చే డబ్బుల కోసం కక్కుర్తిపడి దేవుడి విశ్రాంతి వేళలోనూ ప్రత్యేక పూజలకు అనుమతించడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. దేవుడి విశ్రాంతికి అంతరాయం కల్గిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. బృందావన్‌లోని ప్రఖ్యాత బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళలతోపాటు సంప్రదాయాల్లో తీసుకువచ్చిన మార్పులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ సందర్భంగా సోమవారం ఈ మేరకు స్పందించింది.
బంకీ బిహారీ జీ ఆలయంలో దర్శన వేళల్లో మార్పులు చేశారని, దెహ్రి పూజ వంటి పలు ముఖ్యమైన మతాచారాలను నిలిపివేశారని పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది శ్యామ్ దివాన్, తన్వి దుబేలు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్యా బాగ్చి, జస్టిస్ విపుల్ ఎం పంచోలీల ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. ‘సంప్రదాయం, వేడుకల్లో దర్శన వేళలు కూడా ఒక భాగం.
భక్తుల దర్శనాల కోసం ఆలయాన్ని తెరిచి ఉంచడం ఎప్పట్నుంచో వస్తున్న సంప్రదాయం. ఆలయ వేళలను మార్చితే, లోపల జరిగే పూజలు, వేడుకల వేళలు కూడా మారుతాయి. తదనుగుణంగా దేవుడి ఉదయం మేల్కొనే వేళ, రాత్రి నిద్రించే వేళలూ మారుతాయి. ఇలా జరగరాదు. తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని, పవిత్రతను తుచ తప్పక అనుసరించాలి’అని ఈ సందర్భంగా దివాన్ వాదించారు.
సెపె్టంబర్‌లో జారీ అయిన ఆఫీసు మెమోరాండం ప్రకారం ఆలయంలో జరిగే ముఖ్యమైన పూజా సంప్రదాయాల్లో మార్పులు తెచ్చారని ఆయన తెలిపారు. ఆలయంలో దర్శన వేళలు పూర్తయ్యాక, ఒక ప్రత్యేక ప్రదేశంలో చేపట్టే దెహ్రి పూజను సైతం రద్దీని నివారించేందుకంటూ రద్దు చేస్తూ తరాలుగా వస్తున్న సంప్రదాయాన్ని పక్కనబెట్టారని పిటిషనర్లు తెలిపారు. గురు–శిష్య పరంపరలో భాగంగా గోస్వామీలు మాత్రమే ఈ పూజా కార్యక్రమాన్ని జరపాల్సి ఉంటుందన్నారు.
ఈ వాదలనపై సీజేఐ సూర్యకాంత్ మౌఖికంగా.. ‘బంకీ బిహారీ జీ ఆలయంలో మధ్యాహ్నం 12 గంటలకు ఆలయాన్ని నామమాత్రంగా మూసివేస్తున్నారు. అయితే, ఆ వెంటనే దేవుడికి ఒక్క సెకను కాలం కూడా విశ్రాంతినివ్వకుండా, ఇతర విషయాల మాదిరిగానే దేవుడిని కూడా వాడేసుకుంటున్నారు. భారీగా డబ్బు ఇవ్వజూపే ధనవంతుల కోసం ప్రత్యేక పూజలకు అనుమతిస్తున్నారు’అంటూ వ్యాఖ్యానించారు.
ఈ వ్యవహారంపై సమాధానమివ్వాలని ఆలయ నిర్వహణ కమిటీతోపాటు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. జనవరి మొదటి వారంలో తదుపరి విచారణ చేపడతామని ప్రకటించింది.
వాస్తవానికి ఈ ఆలయంలో వేడుకలు, పూజలు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ 1939 నాటి నిబంధనల ప్రకారం జరుగుతోంది. అయితే, 2025లో తీసుకువచ్చిన ఉత్తరప్రదేశ్ శ్రీ బంకీ బిహారీ జీ ఆలయ ట్రస్ట్ ఆర్డినెన్స్‌తో రాష్ట్ర ప్రభుత్వం మత సంస్థల్లో జోక్యం చేసుకునేందుకు అవకాశ మేర్పడింది.
తద్వారా అనాదిగా వస్తున్న ఆచార సంప్రదాయాలకు విఘాతం కలుగుతోందన్న వాదనలు ఉన్నాయి. దీనిపై ఈ ఏడాది ఆగస్ట్‌లో దాఖలైన పిటిషన్‌పై జోక్యం చేసుకునేందుకు అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. వ్యవహారాన్ని అలహాబాద్ హైకోర్టుకే విడిచిపెట్టింది. అదే సమయంలో, హైకోర్టు స్పష్టత ఇచ్చే వరకు ఆర్డినెన్స్‌పై స్టే విధించింది. ఆలయ రోజువారీ వ్యవహారాల పర్యవేక్షణకు అలహాబాద్ హైకోర్టు మాజీ న్యాయమూర్తి అశోక్ కుమార్ సారథ్యంలో కమిటీని నియమించింది.


