సుప్రీం కోర్టు వ్యాఖ్య
న్యూఢిల్లీ: వరకట్న భూతాన్ని సమూలంగా రూపుమాపడం తక్షణావసరం అని అత్యున్నత న్యాయస్థానం సోమవారం అభిప్రాయపడింది. అయితే వరకట్న వ్యతిరేక చట్టాలు ఆచరణలో పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాయి. పైగా తరచూ వాటి దుర్వినియోగం జరుగుతుండటం మరో ఆందోళనకర పరిణామం.
దాంతో మన దేశంలో వరకట్న దురాచారం ఇప్పటికీ నిర్ని రోధంగా కొనసాగుతూనే ఉందని న్యాయ మూర్తులు జస్టిస్ సంజయ్ కరోల్, జస్టిస్ కోటీశ్వర్ సింగ్‌ల ధర్మాసనం ఆవేదన వెలిబు చ్చింది. 24 ఏళ్లనాటి వరకట్న హత్య కేసులో ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఇద్దరు నిందితులను అలహాబాద్ హైకోర్టు నిర్దోషులుగా ప్రకటించడాన్ని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. వారికి జీవిత ఖైదు విధించడమే సరైనదని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది. ‘కేవలం కలర్ టీవీ, మోటార్ సైకిల్, రూ.25 వేలు ఇవ్వలేదని నవ వధువును కిరాతకంగా పొట్టన పెట్టుకున్నారు. అయితే నిందితుల్లో మహిళకు ఇప్పుడు 94 ఏళ్లు గనుక ఆమెకు తీర్పు అమలు కాబోదు. రెండో వ్యక్తి మాత్రం 4 వారాల్లో లొంగిపోవాలి‘ అని ఆదేశించింది.
వరకట్న దురాచారం విషయమై కేంద్ర రాష్ట్రాలకు, దిగువ కోర్టులకు ఈ సందర్భంగా పలు నిర్దేశాలు చేసింది. పెండింగ్ లో ఉన్న వరకట్న హత్యలు (సెక్షన్ 304–బి), భర్త, అత్తింటివారి హింస (398–ఏ) కేసులపై హైకోర్టులు మరింతగా దృష్టి పెట్టాలి. వరకట్నం సాంఘిక దురాచారమని మన భావితరాలకు తెలియాలి. ఆ మేరకు బాలల్లో అవగాహన కలిగేలా విద్యా ప్రణాళికల్లో కేంద్రం, రాష్ట్రాలు అవసరమైన మార్పులు చేయాలి.
చట్టం పేర్కొన్న మేరకు వరకట్న నిషేధ అధికారులను రాష్ట్రాలన్నీ తక్షణం నియమించాలి. వారికి అవసరమైన అన్ని అధికారాలు, సాధన సంపత్తి కట్టబెట్టాలి. వారిని సంప్రదించాల్సిన ఫోన్ నంబరు, మెయిల్ ఐడీలను అందరికీ తెలిసేలా విస్తృతంగా ప్రచారం చేయాలి. వరకట్న కేసులను విచారించే పోలీసు, న్యాయాధికారులకు ఇందుకు సంబంధించిందిన అంశాలపై తరచూ శిక్షణ ఇవ్వాలి‘ అని సూచించింది.


