జనవరి 21న సుప్రీంకోర్టు తదుపరి విచారణ
సాక్షి, న్యూఢిల్లీ: మద్యం అక్రమ కేసులో బెయిల్‌కు సంబంధించి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై మాజీ ఐఏఎస్ కె.ధనంజయ రెడ్డి, పెల్లకూరు కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప దాఖలు చేసిన పిటిషన్లపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జనవరి 21వ తేదీకి వాయిదా వేసింది. ఈ పిటిషన్లు సోమవారం ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ విపుల్ ఎం. పంచోలిలతో కూడిన ధర్మాసనం ముందుకు వచ్చినప్పుడు... పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాదులు సి. ఆర్యమ సుందరం, నిరంజన్ రెడ్డి, సిద్ధార్థ దవేలు వాదనలు వినిపిస్తూ, కౌంటర్ అఫిడవిట్‌లకు సంబంధించి శనివారం రెండు రిజాయిండర్లు దాఖలు చేశామని, మరొకటి సోమవారం దాఖలు చేస్తున్నామని వివరించారు. ఇరుపక్షాల కౌంటర్లు, రిజాయిండర్లు, వాదనలను పరిగణనలోకి తీసుకున్న ధర్మాసనం కేసు తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేసింది.
కాగా ఈ కేసులో ట్రయల్ కోర్టు తదుపరి చర్యలకు తమ మధ్యంతర ఉత్తర్వులు అడ్డంకి కాదని అత్యున్నత న్యాయస్థానం ఈ సందర్భంగా స్పష్టం చేసింది.
నేపథ్యం ఇదీ...
తప్పుల తడక చార్జ్‌షిట్ నేపథ్యంలో ముగ్గురు నిందితులకు గతంలో ట్రయల్ కోర్టు ‘డిఫాల్ట్ బెయిల్’ మంజూరు చేసింది. అయితే, దాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించిన ఏపీ హైకోర్టు వారి డిఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేసింది. నవంబర్ 26లోగా ట్రయల్ కోర్టులో లొంగిపోవాలని, రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ వీరు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్లకు అనుకూలంగా నవంబర్ 26న సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.


