ఇబ్బందులు పడుతున్న రైతులు..
ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని చెప్పి తీవ్ర జాప్యం
ముద్రించినవే కొన్ని.. వాటిల్లో అన్నీ తప్పుల తడకలు
అందుకే ఇప్పటివరకు జారీచేయని రెవెన్యూ శాఖ
పాస్ పుస్తకాలు లేక అనేకచోట్ల నిలిచిపోయిన భూ లావాదేవీలు
కొత్తవి ఎప్పుడు వస్తాయో తెలీదంటున్న అధికారులు
సాక్షి, అమరావతి: చంద్రబాబు ప్రభుత్వం కక్ష సాధింపులకు రైతులు విలవిల్లాడుతున్నారు. గత ప్రభుత్వంపై అక్కసుతో రైతులకు పట్టాదారు పాస్ పుస్తకాల జారీని నిలిపివేయడంతో గ్రామాల్లో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. వాటిపై అప్పటి సీఎం జగన్ ఫొటో ఉందనే కారణంతో ఏడాదిగా పాస్ పుస్తకాల జారీని నిలిపివేసింది.
గత ప్రభుత్వంఇచ్చిన లక్షలాది పట్టాదార్ పుస్తకాలను వెనక్కి తీసు కుని కొత్తవి ఇస్తామని చెప్పినా ఇప్పటివరకూ ఆ పని చేయలేకపోయింది. పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకు రుణాలు తీసుకునేందుకు రైతులు ఇబ్బందులుపడుతున్నారు. ఎందుకంటే.. భూమి ఉందని నిరూపించుకునే ఏకైక ఆధారం ఈ పాస్ పుస్తకమే.
జగన్ హయాంలో క్యూఆర్ కోడ్‌తో జారీ..
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలోని ఎనిమిది వేల గ్రామాల్లో భూముల రీసర్వేను పూర్తిచేసి సంబంధిత రైతులకు క్యూఆర్ కోడ్‌తో రైతులకు పాస్ పుస్తకాలు అందజేసింది. ప్రతీ రైతుకి ఆధార్ నంబర్ తరహాలో ఒక యూనిక్ ఐడీని కేటాయించింది.
రికార్డుల్లోగానీ, భూమిపైగానీ ఎటువంటి ట్యాంపరింగ్‌కు అవకాశం లేకుండా భూవివాదాలకు శాశ్వతంగా చరమగీతం పాడేలా చర్యలు తీసుకుంది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ సర్వే విజయవంతం కావడంతో కేంద్ర ప్రభుత్వం రూ.600 కోట్ల రాయితీ కూడా ప్రకటించింది. అయితే, వైఎస్ జగన్ హయాంలో జరిగిన భూ సంస్కరణలను వ్యతిరేకించి అభాండాలు మోపిన చంద్రబాబు ప్రభుత్వం ఆ రాయితీ సొమ్ము ఇటీవలే స్వీకరించడం విశేషం.
వెనక్కి తీసుకుని కొత్తవి ఇవ్వలేదు..
మరోవైపు.. గత ప్రభుత్వం చేసిన రీసర్వేపై చంద్రబాబు బ్యాచ్ అభాండాలు మోపినా దానిని కొనసాగించక తప్పలేదు. పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫొటో ఉందనే కారణంతో ఎనిమిది వేల గ్రామాల్లో సర్వే పూర్తయినా భూములకు సంబంధించిన పుస్తకాలను రైతులకు పంచలేదు. పంచిన వాటిని కూడా వీఆర్‌ఓల ద్వారా వెనక్కి తీసుకుంది.
వాటి స్థానంలో ప్రభుత్వ రాజముద్రతో కొత్తవి ఇస్తామని ప్రకటించి ఏడాది దాటిపోయింది. ఇందుకోసం రూ.15 కోట్లతో టెండర్ పిలిచింది. చెన్నైకి చెందిన కంపెనీకి టెండరు ఖరారుచేసి పనులు అప్పగించింది. అయితే, ఈ ముద్రణలో చాలా లోపాలు చోటుచేసుకున్నాయి. తొలి విడతలో కొన్ని పుస్తకాలు ముద్రించగా వాటిలో అన్నీ తప్పుల తడకలేనని అధికారులు వాపోతున్నారు.
పేర్లు, సర్వే నంబర్లు వంటివన్నీ మారిపోవడంతో అధికారులు అవాక్కయ్యారు. వాటిని పంచకుండా ఇంకా ముద్రణ పూర్తికాలేదని చెబుతున్నారు. రైతులు తమకు పాస్ పుస్తకాలు ఇవ్వాలని పదేపదే అడుగుతున్నా వారిని రేపు, మాపు అంటూ చంద్రబాబు ప్రభుత్వం తిప్పుతూనే ఉంది. తహశీల్దార్లు కూడా పాస్ పుస్తకాలు ఎప్పుడు వస్తాయో తమకు తెలీదని చేతులెత్తేస్తున్నారు.
ఉన్నతాధికారులు కూడా దీనిపై సరిగ్గా సమాధానం చెప్పకుండా త్వరలో ప్రింటింగ్ పూర్తవుతుందని చెప్పి తప్పించుకుంటున్నారు. ఇటీవలే రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పాస్ పుస్తకాల ముద్రణకు పిలిచిన టెండర్లలో ఏర్పడిన సమస్యవల్ల ఇబ్బంది ఏర్పడిందని చావు కబురు చల్లగా చెప్పారు. అంటే.. ఇప్పట్లో పాస్ పుస్తకాలు వచ్చే అవకాశం లేదు.
రైతుల అగచాట్లు..
పాస్ పుస్తకాలు లేకపోవడంతో బ్యాంకులు రుణాలు మంజూరు చేయడంలేదు. రీసర్వే పూర్తయిన గ్రామాల్లో సర్వే నంబర్ల స్థానంలో ఎల్‌పీఎం నంబర్లు కేటాయించారు. ఈ నంబర్లు ఉన్న పాస్ పుస్తకాలు లేకపోవడంతో భూముల అమ్మకాలు కూడా జరగడంలేదు. రెవెన్యూ రికార్డుల్లో పేరు ఉన్నా పాస్ పుస్తకాలు లేవనే భయంతో కొనుగోలుదారులు వెనకడుగు వేస్తున్నారు.
పాస్ పుస్తకం కోసం దరఖాస్తు చేస్తే అడంగల్‌లో పేరు మారుతుంది తప్ప పుస్తకం రావడంలేదు. మరోవైపు.. రీ సర్వే జరగని గ్రామాల్లోనూ పాస్ పుస్తకాల జారీ కావడంలేదు. దీంతో.. రైతులు అష్టకష్టాలు పడుతున్నారు. రాజకీయ కక్ష సాధింపుల కోసం చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఇబ్బందులకు గురిచేయడంపై గ్రామాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది.


