తాడేపల్లి :గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ప్రజావైద్యం కోసం విశేషంగా పనిచేసిన నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అని మాజీ మంత్రి, పార్టీ నేత అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేసిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. మరి నేటి కూటమి ప్రభుత్వం అదే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను అమ్మకానికి పెట్టిందని విమర్శించారు.
మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జనం ఆగ్రహంతో ఉన్నారనే దానికి ఈరోజు(సోమవారం, డిసంబర్ 15) రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ర్యాలీలే ఉదాహరణ అని మాజీ మంత్రి, అంబటి రాంబాబు స్పష్టం చేశారు. ఇది ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదన్నారు. ప్రజల పక్షాన వైఎస్సార్‌సీపీ ప్రజాఉద్యమం చేస్తుందని, గత 18 నెలల కాలంగా వైఎస్సార్‌సీపీ అనేక ప్రజా ఉద్యమాలు చేస్తుందన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన అంబటి రాంబాబు.. ‘ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు, రైతాంగ సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కమీషన్ల కోసమే పీపీపీ మోడల్‌లోకి తీసకెళ్లారు.
ఇది దుర్మార్గమైన మోడల్.కాలేజీలను అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారు..రాష్ట్రంలో కోటి సంతకాలకు మంచి స్పందన లభించింది. నియోజకవర్గాల నుంచి జిల్లా కేంద్రాలకు.. అక్కడ నుంచి కేంద్ర కార్యాలయం వరకు ప్రజల సంతకాలు వచ్చాయి.. ప్రతీ జిల్లాలో వైఎస్సార్‌సీపీ నిరసనలకు ప్రజలు స్వచ్ఛందంగా మద్దతు ఇచ్చారు. జగన్ ప్రజావైద్యం కోసం విశేషంగా పని చేశారు. అన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒక్క పోస్టు కూడా ఖాళీ లేకుండా భర్తీ చేశారు.
ఇవాళ జీరో వెకెన్సీ సిస్టమ్ లేదు.. మందులు లేవు. జగన్ తెచ్చిన 17 మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈనెల 18న గవర్నర్ ను జగన్ కలుస్తారు. ప్రజాభిప్రాయాన్ని గవర్నర్ కి తెలియజేస్తాం. ప్రైవేట్ వాళ్లకు కాలేజీలను అప్పగించి, సిబ్బందికి మాత్రం ప్రభుత్వమే జీతాలు చెల్లిస్తుందట. దీని వెనుక పెద్ద స్కాం ఉంది. పేదవారి వైద్యాన్ని తాకట్టు పెట్టీ కిక్ బ్యాగ్స్ తీసుకోవాలని చూస్తున్నారు. మా పోరాటం ఆగదు’ అని హెచ్చరించారు.


