dhananjaya Reddy
-
విమర్శను సహించలేరా?
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ‘మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు రాజ్యాంగం నాలుగు వ్యవస్థలను ఏర్పాటు చేసింది. అందులో నాలుగో వ్యవస్థ (ఫోర్త్ ఎస్టేట్) పత్రికలు. వీటి భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజా జీవితంలోని వ్యక్తులు, ప్రభుత్వాలు, వ్యవస్థలు తప్పుచేస్తే ఎత్తి చూపడం, విమర్శించే హక్కు పత్రికలకు ఉంది. కానీ.. పత్రికలు వార్తలు రాస్తే కేసులు పెడతాం, జైలుకు పంపిస్తామంటే ప్రజాస్వామ్యాన్ని కాలరాయడమే. మనం రాచరిక, నియంతృత్వ వ్యవస్థలో లేం అనే విషయాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. ప్రజాస్వామ్యాన్ని, భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి’ అని జన విజ్ఞానవేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ బ్రహ్మారెడ్డి అన్నారు. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టులపై అక్రమ కేసులు పెట్టడం, సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసానికి వెళ్లి భయానక వాతావరణాన్ని సృష్టించడం వంటి పరిణామాల నేపథ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ, ప్రభుత్వాల బాధ్యత, తాజా పరిణామాలపై ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే.. మనం రాచరికాన్ని ఎంచుకోలేదు మనం ప్రజాస్వామ్య వ్యవస్థను ఎంచుకున్నాం. రాచరిక, నియంతృత్వ వ్యవస్థలను కాదు. ప్రజాస్వామ్యంలో భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. ప్రజాస్వామ్యం బతికేందుకు మనం నాలుగు వ్యవస్థలను ఎంచుకున్నాం. అందులో నాలుగో వ్యవస్థగా పత్రికలకు, భావ ప్రకటన స్వేచ్ఛకు రాజ్యాంగ నిర్మాతలు చోటు కల్పించారు. ప్రజాస్వామ్యం బతకాలంటే భావ ప్రకటన స్వేచ్ఛ బతకాలి. సమాజంలోని మంచిని ఎలా పత్రికలు తెలియజేస్తాయో.. ప్రభుత్వాలు తమ సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలని పత్రికలను ఎలా ఆశ్రయిస్తాయో.. అలాగే ప్రభుత్వాలు, ప్రజాజీవితంలోని వ్యక్తుల తప్పులను ఎత్తిచూపడం, విమర్శించడం పత్రికలకు ఉన్న హక్కు. దీన్ని కాలరాయడం ముమ్మాటికీ తప్పు. ఎడిటర్ ఇంటికి వెళ్లి అలజడి సృష్టించడం సరికాదు. తప్పును ఎత్తిచూపడం పత్రికల హక్కు తప్పును ఎత్తిచూపడం, విమర్శించడం పత్రికల హక్కు. ఇలాంటి వాటిపై అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి. తప్పొప్పులను కోర్టులు నిర్ణయిస్తాయి. అంతేకానీ.. ‘తప్పులు ఎత్తిచూపకూడదు, వార్తలు రాస్తే పోలీసులతో కేసులు పెడతాం, రిమాండ్‌కు పంపుతాం’ అంటే ఎలా? ఇది ముమ్మాటికీ తప్పే. ఈ కేసులేవీ కోర్టుల్లో నిలబడవు. అప్పుడు రిమాండ్‌కు పంపిన వ్యక్తికి పరిహారం కూడా ప్రభుత్వాలు చెల్లించాలి. ఇటీవల భావ ప్రకటన స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయి. దీనిని పౌరసంఘాలు ఖండించాలి. భావ ప్రకటన స్వేచ్ఛకు మద్దతుగా నిలవాలి. పౌర సంఘాలు ప్రశ్నించాలి.. ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లితే ప్రశ్నించడం పౌరహక్కుల నేతల బాధ్యత. కాబట్టే ప్రజాస్వామ్యానికి భంగం వాటిల్లితే కచ్చితంగా ప్రశ్నిస్తా. ప్రశ్నించకూడదు అంటే ఎలా? ఈవీఎంలపై అనుమానాలు మాకు ఉన్నాయి. ప్రజలకు ఉన్నాయి. ఈవీఎంలో పోలైన ఓట్లకు, వీవీ ప్యాట్లకు తేడాలు ఉన్నాయి. వీటిని ప్రశ్నిస్తే నివృత్తి చేసి వ్యవస్థపై నమ్మకం పెంచేలా ప్రభుత్వాలు, ఎన్నికల కమిషన్ బాధ్యతలు తీసుకోవాలి. కానీ.. ఆ పని చేయలేదు. దీంతో అనుమానాలు పెరుగుతాయి. వ్యవస్థలపై నమ్మకం పోతుంది. ఎన్నికల కమిషన్ నిష్పాక్షికంగా వ్యవహరించలేదనే అనుమానాలు ప్రజల్లో ఉంటాయి. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు. ఇలాంటి అంశాలలో పౌరసంఘాలు ప్రశ్నించాలి.పోలీసులకు అపరిమిత స్వేచ్ఛ ప్రమాదకరం ఎవరు అధికారంలో ఉంటే వారిని పోలీసులు బాస్‌లుగా భావిస్తున్నారు. ఈ క్రమంలో పోలీసులకు అపరిమితమైన స్వేచ్ఛ ఇవ్వడం అత్యంత ప్రమాదకరం. ప్రస్తుత దుష్పరిణామాలకు మద్దతు తెలపడం అంటే రాజ్యాంగ హక్కులను ఉల్లంఘించడమే. ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే నిజమైన దేశభక్తి మన ప్రజాస్వామ్యం ఇంకా బతికే ఉంది. ఇది ప్రభుత్వాలు గ్రహించాలి. తమపై విమర్శలు చేసే వ్యక్తులు, పత్రికలపై కేసులు పెడతామంటే ప్రజాస్వామ్యాన్ని తీసేసి రాచరిక, నియంతృత్వ వ్యవస్థలను పెట్టుకోవాలి. కాబట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడటమే నిజమైన దేశభక్తి. బాధ్యతగల ప్రభుత్వాలు ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి.మీడియా స్వేచ్ఛను హరించకూడదు మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ సాక్షి, హైదరాబాద్: రాజకీయపరమైన కారణాలతో మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం సమర్థనీయం కాదని ఆరి్థక, రాజకీయరంగ నిపుణుడు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కె.నాగేశ్వర్ అన్నారు. భావప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు అని, దానిని అందరూ గౌరవించాలని సూచించారు. విజయవాడలో ఏపీ పోలీసులు ‘సాక్షి’ దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి నివాసానికి సెర్చ్‌వారెంట్ లేకుండానే వెళ్లి సోదాలు జరపడంపై నాగేశ్వర్ స్పందించారు. ప్రభుత్వంలో ఎవరున్నా మీడియా కవరేజీ విషయంలో ఏమైనా భిన్నాభిప్రాయాలుంటే దాని గురించి చెప్పాలే తప్ప, కేసులు పెట్టడం సరికాదన్నారు. కేసులు పెట్టి మీడియా స్వేచ్ఛను హరించకూడదని, వార్తలపై ఏమైనా అభ్యంతరాలుంటే రిజాయిండర్, లేదా వివరణ కోరవచ్చని అన్నారు. ప్రజాస్వామ్యానికి మూలం విమర్శ కాబట్టి దానిని సరైన పద్ధతిలో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఏదైనా నేరం చేస్తే కేసులు పెట్టడం వేరని, కానీ కేవలం రాజకీయ కారణాలతో మీడియా ప్రతినిధులపై కేసులు పెట్టడం సరికాదని సూచించారు. ‘సాక్షి’ ఎడిటర్‌కు వేధింపులు అన్యాయంసీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ సాక్షి, హైదరాబాద్: ‘సాక్షి’ దినపత్రిక సంపాదకుడు ధనంజయరెడ్డిపై వేధింపులు అన్యాయమని సీనియర్ సంపాదకుడు కె.శ్రీనివాస్ వ్యాఖ్యానించారు. విజయవాడలోని ధనంజయరెడ్డి నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించిన నేపథ్యంలో.. కె.శ్రీనివాస్ పై విధంగా స్పందించారు. ఒక పత్రికా సంపాదకుడిని లక్ష్యంగా చేసుకోవడం సరైంది కాదని స్పష్టం చేశారు.నోటీసుల్లేకుండా ఎడిటర్ ఇంట్లో సోదాలా? తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ ఖండన సాక్షి, హైదరాబాద్: విజయవాడలో ‘సాక్షి‘ దినపత్రిక సంపాదకుడు ఆర్.ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు ముందస్తు నోటీసులు లేకుండా సోదాలు చేయడాన్ని తెలంగాణ స్టేట్ ఫొటో జర్నలిస్టుల అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు అసోసియేషన్ అధ్యక్షుడు ఎ.గంగాధర్, ప్రధాన కార్యదర్శి హరి ఒక ప్రకటనలో పోలీసులు తీరును గర్హించారు. -
ప్రశ్నించే గొంతు నొక్కేస్తారా?: ఆర్.ధనంజయరెడ్డి
సాక్షి, అమరావతి: ఎలాంటి నోటీసులు లేకుండా ఓ పత్రిక ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం దేశ చరిత్రలో ముందెన్నడూ జరగలేదని, ప్రశ్నించే గొంతును నొక్కేస్తారా.. అని సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డి కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇది వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే కాకుండా, ముమ్మాటికీ పత్రికా స్వేచ్ఛపై జరిగిన దాడిగానే భావిస్తున్నానని చెప్పారు. ఈ ఘటనపై దేశ వ్యాప్తంగా చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వ రాజకీయ కుట్రలో భాగంగా సోదాల పేరిట పోలీసులు వ్యవహరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ప్రెస్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేస్తామని, న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తామని స్పష్టం చేశారు. విజయవాడలోని తన నివాసంలో గురువారం పోలీసుల సోదాల ఆనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇసుక, లిక్కర్, మైనింగ్, విద్యుత్ స్కామ్‌లతో పాటు విజయవాడలో వరదలు, తిరుమలలో తొక్కిసలాట, సింహాచలంలో ప్రభుత్వ నిర్లక్ష్యం.. రైతులకు మద్దతు ధర కల్పించకపోవడం వంటి వరుస వైఫల్యాలను ఎండగడుతున్న సాక్షి గొంతునొక్కాలనే యత్నమిదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా సమస్యలను ఎలుగెత్తి చాటడంలో, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయక పోవడంపై ప్రజల మూడ్‌ను రిఫ్లెక్ట్ చేసే ప్రయత్నంలో సాక్షి తన బాధ్యతను నిర్వర్తిస్తోందని చెప్పారు. దాన్ని ఓర్వలేకనే ఇలాంటి దుర్మార్గపు చర్యలకు ఒడిగడుతున్నారని, దీనిని ఖండించకపోతే ఎవరింట్లోకైనా సరే ఇలాగే చొరబడతారన్నారు. సరైన ఆధారాలు లేకుండా ఎవరి మీదా కేసు పెట్టకూడదని సుప్రీంకోర్టు, హైకోర్టులు స్పష్టంగా చెబుతున్నప్పటికీ.. పోలీసులకు చట్టం, న్యాయం, రాజ్యాంగంపై ఏమాత్రం గౌరవం లేనట్టుగా కన్పిస్తోందని చెప్పారు. ‘ఉదయం ఉన్న ఫళంగా పది మంది పోలీసులు ఇంట్లోకి చొర బడ్డారు. ఎలాంటి నోటీసు ఇవ్వలేదు. ఒక డీఎస్పీ, సీఐలతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు లోపలికి వచ్చి, ఇల్లు సెర్చ్ చేస్తాం.. ఇది ఓపెన్ చేయండి.. అది ఓపెన్‌చేయండి.. ఇంట్లో ఉన్న వాళ్లను వాళ్లెవరు.. వీళ్లెవరు.. అంటూ ఆరాలు తీయడం దుర్మార్గం’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమన్నారంటే.. నాపై ఇప్పటికే 3–4 కేసులు పెట్టారుఇప్పటికే నాపై మూడు నాలుగు కేసులు పెట్టారు. ఒకటి సభా హక్కుల ఉల్లంఘన కేసు అన్నారు. ఒక వార్త రాస్తే గవర్నమెంట్ దగ్గర నుంచి కాటమనేని భాస్కర్ ద్వారా ప్రాసిక్యూషన్ చేయడానికి అనుమతి జారీ చేశారు. మొన్నటికి మొన్న తెలంగాణ, ఏపీ ఎడిషన్‌లో ఒకే వార్త వేర్వేరుగా రిపోర్టు అయ్యిందని మరో కేసు పెట్టారు. జర్నలిజం మౌలిక నియమాలు, ఓనమాలు తెలిసిన వారెవరికైనా ఇదేంటని తెలుసు. ఎక్కడన్నా ఒక ఘటన జరిగితే ఆ ప్రాంత రిపోర్టర్ స్పాట్ రాస్తారు. సొంత ఊళ్లో ఉన్న రిపోర్టర్‌కు మరిన్ని వివరాలు తెలుస్తాయి కాబట్టి మరింత లోతుగా ప్రజంట్ చేస్తారు. దాన్ని అడ్డం పెట్టుకొని నాపై కేసు పెట్టారు. కొంత మంది సాక్షి పాత్రికేయులపై కూడా కేసులు పెట్టారు. ఇదంతా సాక్షి గొంతునొక్కే ప్రయత్నంగా చూడాల్సి వస్తుంది. రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాలు ఎందుకొచ్చారు.. సెర్చ్ నోటీసు ఉందా? దాంట్లో నా పేరు ఏమైనా ఉందా? అని సోదాలకు వచ్చిన పోలీసు అధికారులను చాలా స్పష్టంగా అడిగాను. ‘లేదు సర్.. ఇన్ అండ్ అరౌండ్ సెర్చ్ చేస్తున్నాం.. జస్ట్ ఊరికే మీ ఇల్లు చూసేసి పోతాం’ అని చెప్పారు. కానీ వాళ్లు వ్యవహరించిన తీరు చూస్తుంటే రాజకీయ ఒత్తిళ్లతోనే సోదాల పేరిట వచ్చారని స్పష్టంగా కన్పించింది. నా కార్ నంబర్, నా ఫోన్ నంబర్లు తీసుకున్నారు. వారు స్పష్టమైన లక్ష్యం, ఉద్దేశంతోనే వచ్చినట్టుగా స్పష్టమైంది. వారు చెబుతున్న లిక్కర్ కేసులో నిందితులు నా ఇంట్లో ఎందుకు ఉంటారు? వారికి నాకు ఏమైనా సంబంధం ఉందా? ఇక్కడకు ఎందుకు వస్తారు? ఏమైనా అడిగితే పై నుంచి ప్రెజర్స్ ఉన్నాయని చెబుతున్నారు. ఇదంతా పొలిటికల్ మోటివేషన్‌తో జరుగుతోందని అర్థమవుతోంది. -
‘సాక్షి’పై కక్ష సాధింపు
సాక్షి, అమరావతి: ప్రజల గొంతుకగా నిలుస్తున్న ‘సాక్షి’పై చంద్రబాబు కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు, వేధింపులకు బరితెగిస్తోంది. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తుండటంతో కక్షకట్టి పోలీసులను ఉసిగొలిపి బెదిరింపులకు దిగుతోంది. రాజ్యాంగాన్ని కాలరాస్తూ, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగిస్తూ ఎమర్జెన్సీ నాటి దురాగతాలకు పాల్పడుతోంది. ఏకంగా సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి విజయవాడ నివాసంలో గురువారం సోదాల పేరుతో బెదిరింపు చర్యలకు పాల్పడటం ప్రభుత్వ కుట్రకు పరాకాష్టగా నిలుస్తోంది. కనీసం సెర్చ్ వారంట్ కూడా లేకుండా, నోటీసు కూడా ఇవ్వకుండా గురువారం ఉదయం 9 గంటలకే విజయవాడ ఏసీపీ దామోదర్‌తోపాటు పలువురు పోలీసు అధికారులు సాక్షి ఎడిటర్ నివాసంలోకి ప్రవేశించి సోదాల పేరుతో హల్చల్ చేశారు. అసలు పోలీసులు ఎందుకు వచ్చారని ఆయన ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వలేదు. తన నివాసంలో సోదాలు చేసేందుకు సెర్చ్ వారంట్ చూపించాలని అడిగితే పట్టించుకోకుండా అన్ని గదుల్లో తనిఖీలు కొనసాగించడం గమనార్హం. ఏ కేసులో సోదాలు చేస్తున్నారు.. ఏం కావాలని ఎడిటర్ ధనంజయ రెడ్డి ఎంతగా అడిగినా ఏసీపీ దామోదర్ కనీస సమాధానం కూడా ఇవ్వలేదు. సమాచారం తెలిసిన పాత్రికేయ సంఘాల ప్రతినిధులు, పాత్రికేయులు హుటాహుటిన ఆయన నివాసానికి చేరుకున్నారు. కానీ వారిని పోలీసులు లోపలికి అనుమతించలేదు. ఇంటి తలుపులు వేసి.. ధనంజయ రెడ్డిని ఎవరూ కలవకుండా అడ్డుకున్నారు. ధనంజయ రెడ్డికి ఏమాత్రం సంబంధం లేని అంశాలపై ప్రశ్నించారు. ఇంట్లో ఎవరెవరు ఉంటారు... మీరు ఎప్పుడు వచ్చారు.. అంటూ ప్రశ్నలు వేయడం గమనార్హం. ఎందుకు అలా ప్రశ్నిస్తున్నారని అడిగితే సమాధానం మాత్రం చెప్ప లేదు. తమను లోపలికి అనుమతించాలని పాత్రికేయులు ఎంతగా కోరినా పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక వైఖరి, దౌర్జన్యపూరిత తీరుకు నిరసనగా పాత్రికేయులు అక్కడే ఆందోళన చేపట్టారు.సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్లుఉదయం 11 గంటల సమయంలో తాము సోదాలు చేసినట్టు ఓ కాగితంపై రాసి సంతకం చేయాలని ధనంజయ రెడ్డికి చెప్పారు. సిట్ దర్యాప్తు చేస్తున్న మద్యం కేసులో నిందితులు ఉన్నారేమోనని తెలుసుకునేందుకు తాము సెర్చ్ వారంట్‌తో వచ్చి సోదాలు నిర్వహించినట్టు పేర్కొనడం గమనార్హం. దీనిపై ఎడిటర్ ధనంజయ రెడ్డి అభ్యంతరం తెలిపారు. అసలు మద్యం కేసులో నిందితులు తన నివాసంలో ఎందుకు ఉంటారని ఆయన పోలీసులను నిలదీశారు. కొంత కాలం నుంచి హైదరాబాద్‌లో ఉంటున్న తాను బుధవారం రాత్రే విజయవాడ వచ్చానని తెలిపారు. కేవలం సాక్షి పత్రికను బెదిరించేందుకే ఎడిటర్ నివాసంలో సోదాల పేరుతో హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు సెర్చ్ వారంట్ ఇవ్వకుండానే ఇచ్చినట్టు.. అనంతరమే సోదాలు నిర్వహించినట్టు ఎలా రాస్తారని.. తాను ఎందుకు సంతకం చేయాలని ఆయన ప్రశ్నించారు. తన న్యాయవాదితో సంప్రదించిన తర్వాతే సంతకం చేస్తానన్నారు. దాంతో న్యాయవాది మనోహర్ రెడ్డిని పోలీసులు లోపలికి అనుమతించారు. పోలీసుల తీరును న్యాయవాది మనోహర్ రెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. ఏదైనా సరే నిబంధనల ప్రకారం చేయాలని, పోలీసులు ఇష్టారాజ్యంగా చేయడానికి వీల్లేదని న్యాయస్థానాలు స్పష్టం చేస్తూ ఇచ్చిన తీర్పులను ఆయన ఉదహరించారు. వ్యక్తి స్వేచ్ఛే అత్యున్నతమైందన్న న్యాయస్థానాల తీర్పులను కూడా ఖాతరు చేయరా అని పోలీసులను నిలదీశారు. కాసేపు తర్జనభర్జనల అనంతరం పోలీసులు సెర్చ్ వారంట్‌ను అప్పటికప్పుడు పెన్‌తో రాసి ఇచ్చి.. తాము సోదాలు చేసినట్టు పంచనామా నివేదికను సమర్పించి వెళ్లిపోయారు. దాదాపు మూడు గంటలపాటు పోలీసులు సోదాల పేరుతో సాక్షి ఎడిటర్ నివాసంలో హల్చల్ చేశారు. కేవలం సాక్షి గొంతు నొక్కేందుకే ఇలా బెదిరింపులకు పాల్పడినట్టు స్పష్టమవుతోంది. -
'సాక్షి'పై కూటమి సర్కార్ అక్కసు.. జర్నలిస్టుల నిరసన
ఏపీలో కూటమి ప్రభుత్వం, పోలీసుల తీరుపై పాత్రికేయులు, జర్నలిస్టు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రతికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్న చంద్రబాబు సర్కారు వైఖరిని తీవ్రంగా తప్పుబట్టాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ రెండు తెలుగు రాష్ట్రాల్లో జర్నలిస్టులు ఆందోళనలు చేపట్టారు. ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా సాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసులు సోదాలు చేయడాన్ని పాత్రికేయ సంఘాలు ఖండించాయి. సాక్షి మీడియాపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని హితవు పలికాయి.హైదరాబాద్ సాక్షి ప్రధాన కార్యాలయంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని జిల్లాల్లో పాత్రికేయులు నిరసన వ్యక్తం చేశారు. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటికి పోలీసులు వెళ్లడాన్ని నిరసిస్తూ విశాఖపట్నంలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు. కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తుందంటూ నినదించారు. తర్వాత జిల్లా కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పించారు. కూటమి ప్రభుత్వ తీరుపై గవర్నర్ కు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కృష్ణాజిల్లాలోనూ జర్నలిస్టులు ఎస్పీకి వినతి పత్రం ఇచ్చారు. సాక్షి పత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంట్లో పోలీసుల అక్రమ సోదాలను ఎన్టీఆర్ జిల్లా నందిగామ జర్నలిస్టులు ఖండించారు. ప్రభుత్వ , పోలీసుల తీరును నిరసిస్తూ నందిగామ ఆర్డీవోకు వినతిపత్రం సమర్పించారు. కర్నూలు కలెక్టరేట్ ఎదుట ధర్నాకర్నూలు కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు సంఘాలు ధర్నా చేపట్టాయి. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు మానుకొవాలని డిమాండ్ చేశాయి. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులపై వేధింపులకు పాల్పడటం సరికాదని సూచించాయి. కలెక్టరేట్ ఎదుట ఉన్న గాంధీ విగ్రహానికి జర్నలిస్టు సంఘాల నేతలు వినతిపత్రం అందజేశారు.గాంధీ విగ్రహానికి వినతిపత్రంసాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డిపై పోలీసులు కక్ష్య సాధింపు చర్యలకు దిగడంపై తిరుపతి జర్నలిస్ట్ సంఘాలు, ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో నిరసన తెలిపాయి. ప్రభుత్వం చేస్తున్న కక్ష్య సాధింపు చర్యలకు నిరసనగా గాంధీ విగ్రహానికి వినతిపత్రం అందించాయి.నల్ల రిబ్బన్లు ధరించి నిరసనసాక్షి దినపత్రిక ఎడిటర్ ధనంజయరెడ్డిపై కూటమి ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలను నిరసిస్తూ కలెక్టరేట్ ఎదుట నల్ల రిబ్బన్లు ధరించి జర్నలిస్టులు నిరసన చేపట్టారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో డిఆర్వో వెంకట్రావ్ కు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో.. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి ఇంటికి ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పోలీసులు వెళ్లడాన్ని నిరసిస్తూ సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జర్నలిస్ట్ యూనియన్ నాయకులు నిరసన తెలిపారు. కలెక్టర్ వల్లూరి క్రాంతికి వినతి పత్రం సమర్పించారు.పెద్దపల్లి జిల్లాలో.. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి పట్ల ఏపీ పోలీసులు వ్యవహరించిన తీరుకు నిరసనగా గోదావరిఖని బస్టాండ్ రాజీవ్ రహదారిపై సాక్షి దినపత్రిక, టీవీ ఛానల్ ప్రతినిధులు నల్ల బ్యాడ్జీలు ధరించి రాస్తారోకో చేశారు. దీంతో రాజీవ్ రహదారిపై రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఏపీలో పత్రిక స్వేచ్ఛ ఉందా?సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డి నివాసంలో పోలీసుల సోదాలను వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత వైవీ సుబ్బారెడ్డి ఖండించారు. ఢిల్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సాక్షాత్తు పత్రికా సంపాదకులను టార్గెట్ చేయడం శోచనీయమని, ఇది పత్రికా స్వేచ్ఛపై దాడి చేయడమేనని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పత్రిక స్వేచ్ఛ ఉందా అని ప్రశ్నించారు. పత్రికా స్వేచ్ఛను కాపాడటానికి కోర్టులను ఆశ్రయిస్తామని చెప్పారు. చదవండి: పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు.. ‘సాక్షి’పై ఏపీ సర్కార్ కక్ష సాధింపు -
దుర్మార్గం.. అక్రమం
సాక్షి, నెట్వర్క్: ‘ఒక సంఘటనను యథాతథంగా వాస్తవాలతో ప్రచురించడం తప్పా? నిజాలు రాస్తే గొంతు నొక్కేస్తారా? హత్యను హత్య అని చెప్పినందుకు ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డి, మరో ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా కేసు పెట్టించడం దుర్మార్గం. ఇది ముమ్మాటికీ స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమే. ఏపీ, తెలంగాణ ఎడిషన్లలో ఒక వార్త ఒకేలా లేదని చెబుతూ కేసు పెట్టడం హాస్యాస్పదం. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా కేసు పెట్టడం అంటే ముమ్మాటికీ కక్ష సాధింపే. తక్షణమే ఆ కేసును ఎత్తివేయాలి’ అని రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టు సంఘాల నేతలు, జర్నలిస్టులు శుక్రవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రాల్లో, పట్టణాల్లో ధర్నాలు, నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉన్నతాధికారులకు వినతి పత్రాలు అందజేశారు. విజయవాడలో ఏపీయూడబ్ల్యూజే, చిన్న, మధ్య తరహా పత్రికల సంఘం (సామ్నా) ఆధ్వర్యంలో కలెక్టరేట్లో డీఆర్వో ఎం.లక్ష్మీ నరసింహంను కలిసి వినతి పత్రం అందజేశారు. అనంతరం డీఆర్వో కార్యాలయం ఎదుట బైఠాయించారు. మచిలీపట్నంలో జిల్లా కలెక్టర్ డీకే బాలాజీకి వినతిపత్రం అందజేశారు. బాపట్లలో నిరసన తెలిపి కలెక్టర్ వెంకట మురళికి వినతి పత్రం సమర్పించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోనూ నిరసన చేపట్టారు. మార్కాపురం ప్రెస్‌క్లబ్ నుంచి సబ్‌కలెక్టర్ కార్యాలయం వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో శుక్రవారం జర్నలిస్టులు నెల్లూరులో కొవ్వొత్తులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ర్యాలీ నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా ఏఎస్పీ సుబ్బరాజుకు వినతిపత్రం అందజేశారు. కొవ్వూరు, ఆలమూరు, కొత్తపేట, రావులపాలెంలో కూడా జర్నలిస్టులు నిరసన తెలిపారు. ‘సీమ’ వ్యాప్తంగా కదం తొక్కిన జర్నలిస్టులుసాక్షి పత్రిక ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డితో పాటు ఆరుగురు పాత్రికేయులపై అక్రమ కేసు నమోదును నిరసిస్తూ రాయలసీమ వ్యాప్తంగా జర్నలిస్టులు కదం తొక్కారు. అనంతపురంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన తెలిపారు. అనంతరం ర్యాలీగా వెళ్లి అనంతపురం రేంజ్ డీఐజీ డాక్టర్ షిమోషికి వినతి పత్రం అందజేశారు. కళ్యాణదుర్గం, పుట్టపర్తి, చిలమత్తూరు, పెనుకొండలో నిరసన తెలిపారు. కర్నూల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్, ఇతర జర్నలిస్టు సంఘాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్య వేదిక ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. గంగాధరనెల్లూరు, తవణంపల్లె, పలమనేరులో ఆందోళనలు చేపట్టారు. చిత్తూరులో గాంధీ విగ్రహం నుంచి ఆర్డీవో కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. కడపలో డీఆర్వో విశ్వేశ్వరనాయుడుకు వినతిపత్రం సమర్పించారు. ఉత్తరాంధ్రలో నిరసనలువిశాఖలోని జీవీఎంసీ గాంధీ పార్కులో శుక్రవారం జర్నలిస్టులు నిరసన తెలిపారు. జర్నలిస్టులను కేసుల పేరుతో అణిచి వేయాలని చూస్తే ఉద్యమం తీవ్రతరం అవుతుందని హెచ్చరించారు. శ్రీకాకుళంలోని ఏడురోడ్ల కూడలిలో జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు ధర్నా నిర్వహించి, మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ సేతు మాధవన్, పార్వతీపురం ఐటీడీఎ పీవో, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాత్సవకు వినతిపత్రాలు అందజేశారు. తప్పుడు కేసు ఎత్తివేయాలి సాక్షి ఎడిటర్, ఆరుగురు జర్నలిస్టులపై అక్రమంగా పెట్టిన కేసును ఎత్తివేయాలని ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఐవీ సుబ్బారావు, చందు జనార్ధన్, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర నేత కోన సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం వారు ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ రాష్ట్ర శాఖ కూడా సాక్షిపై కేసును తీవ్రంగా తప్పుపట్టింది. సాక్షి ఎడిటర్, ఇతర జర్నలిస్టులపై కేసు పెట్టడాన్ని సామ్నా రాష్ట్ర అధ్యక్షుడు నల్లి ధర్మారావు, ప్రధాన కార్యదర్శి రమణారెడ్డిలు కేసును తీవ్రంగా ఖండించారు. ఆంధ్రప్రదేశ్ బ్రాడ్కాస్ట్ జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి మదన్, ఏపీ స్మాల్ అండ్ మీడియం పేపర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్రావు, కార్యదర్శి శ్రీనివాసరావు, ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు తదితరులు ప్రభుత్వ తీరును వేర్వేరు ప్రకటనల్లో తప్పుపట్టారు. -
మిషన్ ఉద్దానం..!
సిక్కోలు కోనసీమగా పచ్చని కొబ్బరి చెట్లతో పేరుతెచ్చుకున్న ఉద్దానం ప్రాంతాన్ని ఇప్పుడు కిడ్నీ రోగాలు వణికిస్తున్నాయి. రోగాలకు మూలకారణాలపై పరిశోధనలు మాటెలా ఉన్నా ప్రజలలో ధైర్యాన్ని నింపలేకపోతున్నాయి. అసలు వ్యాధికి కారణమేమిటో కనుక్కునేలోగా అనేక ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ప్రజల్లో మనోధైర్యం నింపాలంటే ఏమి చేయాలి? అదే మిషన్ ఉద్దానం! జిల్లా కలెక్టర్ కె.ధనంజయరెడ్డి ప్రత్యేక దృష్టితో దీనికి నాంది పలికారు. వైద్య, సామాజిక, ఆర్థిక కోణాల్లో సమస్యను పరిశీలించి ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి తనదైన శైలిలో కృషి చేస్తున్నారు. ఇప్పటికే ఉద్దానంలోని ఏడు మండలాల్లో మండలానికి ఒక్కటి చొప్పున అవగాహన సమావేశాలనూ నిర్వహించారు. మరోవైపు వైద్యం, తాగునీటి సౌకర్యాలను పెంచేందుకు ప్రతిపాదనలపై కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘సాక్షి’కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన పలు అంశాలను వెల్లడించారు. – సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం సాక్షి: మీ ‘మిషన్ ఉద్దానం’ లక్ష్యాలేమిటి? కలెక్టర్: కిడ్నీ రోగ లక్షణాలు ఉన్నాయా లేదా అనేది తేలితే వైద్యం ఏ స్థాయిలో అందించాలనేదీ నిర్ణయమవుతుంది. ఇందుకు తొలుత ఉద్దానంలో పెద్ద ఎత్తున మెడికల్ మాస్ స్క్రీనింగ్ టెస్టులు చేయాలి. అలా గుర్తించినవారికి ఉచితంగా మందులు, డయాలసిస్ సౌకర్యం కల్పించాలి. తాగునీటి వల్లే ఈ రోగాలు వస్తున్నాయనే వాదనలు ఉన్న నేపథ్యంలో ముందు ఇంటింటికీ శుద్ధజలం అందించాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ప్రజల్లో అవగాహన కల్పించడం మరో ఎత్తు. సాక్షి: మిషన్ విజయవంతమవ్వాలంటే మౌలికంగా ఉన్న సమస్యల పరిష్కారానికి ఏం చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టర్: కిడ్నీ రోగాలపై ప్రజల్లో ఇప్పటికీ తగిన అవగాహన లేదు. రోగం వచ్చినా తగిన వైద్యం పొందితే కోలుకుంటామన్న మనోధైర్యం కూడా చాలామందిలో ఉండట్లేదు. ఒకవిధమైన భయాందోళనలు నెలకొన్నాయి. ఈ సమస్యను ఇప్పటివరకూ వైద్యపరంగానే చూస్తున్నాం. సామాజిక, ఆర్థిక కోణాల్లోనూ చూడాలి. ప్రజలను చైతన్యం చేసి ఈ మహమ్మారి నుంచి బయటపడటానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్నీ చూపించాలి. ఈ ప్రక్రియ పక్కాగా జరిగితే ముందడుగు వేసినట్లే. సాక్షి: రోగం గుర్తించడానికి అవసరమైన వైద్య పరీక్షలు సక్రమంగా నిర్వహించడానికి ఏం చేస్తారు? కలెక్టర్: వైద్య పరీక్షలు చేయించుకోవాలనే అవగాహన కూడా చాలామంది ఉద్దానం ప్రజల్లో లేదు. భయంతో పెయిన్ కిల్లర్స్ తీసుకొని రోగాన్ని పెంచుకుంటున్నారు. కొంతమందైతే రోగం బాగా ఎక్కువయ్యేవరకూ వైద్యానికి వెళ్లట్లేదు. ఈ నేపథ్యంలో అసలు ఈ కిడ్నీ రోగాలపై ప్రజల్లో అవగాహన తీసుకురావడానికే ప్రథమ ప్రాధాన్యం ఇస్తున్నాం. ఇందుకోసం వైద్యాఆరోగ్య శాఖనే గాకుండా స్త్రీశిశు సంక్షేమ శాఖ, డీఆర్డీఏ శాఖల సిబ్బందితో పాటు స్థానిక వైద్యులు, స్వచ్చంద సంస్థలు, ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేస్తున్నాం. ఇలా అన్నివర్గాలనూ ఈ మిషన్‌లో పాలుపంచుకునేలా చేసేందుకే ముందుగా మండల స్థాయిలో అవగాహన సదస్సులు నిర్వహించాం. సాక్షి: క్షేత్రస్థాయిలో ప్రచార కార్యక్రమాలు జరుగుతున్నాయా? కలెక్టర్: క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు, సాధికారమిత్రలతో మండల స్థాయిలోని అన్ని శాఖల అధికారులకూ ముందుగా అవగాహన కల్పించాం. వారైతే ప్రజలకు చేరువగా వెళ్లి చైతన్యం చేయగలరు. ఈ విషయంలో మీడియా కూడా తన వంతు సహకారం అందిస్తోంది. అన్ని వర్గాల అనుభవాలను, సూచనలను పరిగణనలోకి తీసుకుంటున్నాం. ఉద్దానం ప్రాంతంలో 730 ఆవాసాలు ఉన్నాయి. గ్రామపంచాయతీలైతే 160 నుంచి 170 వరకూ ఉన్నాయి. ప్రతి గ్రామానికీ ఒక కమిటీని ఏర్పాటు చేశాం. ఈనెల 11వ తేదీ నుంచి డిసెంబరు 31వ తేదీ వరకూ ప్రతి గ్రామంలోనూ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. సాక్షి : ప్రచార కార్యక్రమంలో ప్రధాన లక్ష్యమేమిటి? కలెక్టర్: కిడ్నీ రోగాలకు కారణాలేమిటి? వైద్య పరీక్షలు ఎలా చేయించుకోవాలి? ఆహారం, పరిసరాల పరిశుభ్రత తదితర విషయాల్లో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ప్రత్యేకంగా కరపత్రాలను రూపొందించాం. వాటిని కమిటీ సభ్యులు ప్రతి ఇంటికీ వెళ్లి అందజేస్తారు. తర్వాత గ్రామసభలో ప్రజలకు అవగాహన కల్పిస్తారు. అలాగే పాఠశాలల్లో కూడా విద్యార్థులకు ఈ కరపత్రాలు అందజేయాలని డీఈవో, ఎంఈవోలకు ఆదేశాలిచ్చాం. వాస్తవానికి కిడ్నీ రోగుల్లో క్రియాటిన్ లెవల్ ప్రాథమిక దశలో ఉన్నప్పుడు మందులు వాడితే సరిపోతుంది. సాక్షి: వైద్య పరీక్షలు సక్రమంగా జరగట్లేదు కదా? కలెక్టర్: జబ్బు బయటపడితే ఏదో జరిగిపోతుందనే భయం ఉద్దానం ప్రజల్లో ఎక్కువగా ఉంది. ముఖ్యంగా యువతలో. ముందు ఆ భయం పోగొట్టాలి. వారికి భరోసా కల్పించాలి. ప్రజలు వైద్య పరీక్షలకు ముందుకొస్తే సమస్య పరిష్కార దిశగా ముందడుగు పడినట్లే! క్రియాటిన్ లెవల్ వగైరా వైద్య పరీక్షలు నిర్వహించడానికి ఉద్దానంలోని ఆరు సామాజిక ఆరోగ్య కేంద్రాల (సీహెచ్‌సీ)లో సౌకర్యాలు ఉన్నాయి. అలాగే 17 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కూడా సెమీ ఆటో ఎనలైజర్లు ఏర్పాటు చేయించడానికి ప్రయత్నిస్తున్నాం. ఒక్కో దానికి రూ.1.50 లక్షల ఖర్చవుతోంది. అంటే ఏ కారణమైనా పీహెచ్‌సీకి వచ్చిన ప్రతి ఒక్కరికీ క్రియాటిన్ లెవల్ పరీక్ష చేయాలని వైద్యాధికారులకు చెప్పాం. ఎవరిలోనైనా రోగ లక్షణాలు కనిపిస్తే వెంటనే సీహెచ్‌సీకి వెళ్లాలని వారికి సూచించాలని ఆదేశించాం. సాక్షి: ఉచిత మందుల పంపిణీ మాటేమిటి? కలెక్టరు: కిడ్నీమార్పిడి చేసుకున్నవారికి విశాఖపట్నంలోని కేజీహెచ్‌లో మాత్రమే ఉచితంగా మందులు ఇస్తున్నారు. ఇది వ్యయప్రయాసలతో కూడినది. అలాగాకుండా శ్రీకాకుళం రిమ్స్‌లో నెఫ్రాలజిస్టు అందుబాటులో ఉన్నందున ఇక్కడే మందులు ఇచ్చేలా ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి కోరాం. ఇప్పటికే ఉద్దానంలోని అన్ని ఆసుపత్రుల్లో ఉచితంగా మందులు ఇవ్వడానికి ఏడాదికి రూ.6.5 కోట్ల బడ్జెట్‌తో ఏర్పాట్లు చేశాం. సాక్షి: ఆహారపు అలవాట్లు మార్పు కోసం ప్రచారం చేస్తున్నారా? కలెక్టర్: కిడ్నీ రోగానికి గురైనవారెవ్వరైనా మద్యం, గుట్కా, మాంసాహారానికి దూరంగా ఉండాలి. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలి. దీనిపై అవగాహన కల్పిస్తున్నాం. అలాగే ఆర్వో ప్లాంట్ల ద్వారా శుద్ధిజలం అందించడానికి ఏర్పాట్లు చేసినా మూడో వంతు ప్రజలు మాత్రమే ఇప్పటివరకూ కార్డులు తీసుకున్నారు. 20 లీటర్లు నీటిని రూ.2కు సరఫరా చేస్తున్నారు. అలాగాకుండా తొలి నెల ఉచితంగా కార్డు ఇచ్చేలా డీఆర్డీఏ అధికారులకు బాధ్యత అప్పగించాం. ఇలా అన్ని కోణాల్లో సమష్టిగా మిషన్‌ను విజయవంతం చేస్తే కిడ్నీ మహమ్మారిపై పోరాటంలో ముందడుగు వేసినట్లే! సాక్షి: డయాలసిస్ సౌకర్యాలు మెరుగుపరుస్తారా? కలెక్టర్: సోంపేట, పలాసలోనూ ఉన్న డయాలసిస్ కేంద్రాలకు తాకిడి ఎక్కువగా ఉంది. అక్కడ నాలుగైదు మిషన్లు పెంచేందుకు ప్రతిపాదనలు ప్రభుత్వానికి పంపించాం. కవిటి, హరిపురం ఆసుపత్రుల్లో కూడా పెట్టాలనే డిమాండు ఉంది. -
తేడాచేస్తే ఉద్యోగాలు పోతాయ్!
ఓటుహక్కు ప్రజాస్వామ్యానికే కాదు పౌరులకూ ఊపిరి! ఇది పోతే ఊపిరి ఆగినంతగా భావిస్తారు! అలాంటిది జిల్లాలో లక్ష ఓట్లు ఒకేసారి తొలగించేసరికి అర్హుల్లో అలజడి మొదలైంది! వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సహా విపక్షాలన్నీ గొంతెత్తాయి. దీనిపై జిల్లా కలెక్టరు కె.ధనంజయరెడ్డి సానుకూలంగా స్పందించారు. అర్హులందరికీ ఓటుహక్కు కల్పించే బాధ్యత తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ అప్పగించిన బాధ్యతను సక్రమంగా నిర్వహించకపోతే ఉద్యోగాలు పోతాయ్ అని హెచ్చరించారు. ‘సాక్షి’కి ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వూ్యలో జిల్లాకు సంబంధించిన అనేక సమస్యల పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకుంటారో ఆయన వివరించారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం : జిల్లావ్యాప్తంగా లక్షకు పైగా ఓట్లను తొలగించారు. వారిలో చాలామంది అర్హులవీ రాజకీయ కారణాలతో గల్లంతు చేసేశారని విపక్షాల నుంచి వస్తున్న విమర్శలపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? కలెక్టరు: ఈ సమస్యపై వైఎస్సార్సీపీ, వామపక్ష పార్టీల నాయకులు నన్ను కలిశారు. ఈ ఫిర్యాదుల పరిశీలన బాధ్యత ఆర్డీవోకి అప్పగించాం. వలస వెళ్లినవారి, వయస్సు తక్కువగా ఉన్నవారి పేర్లు ఉన్నాయా? మరణించినవారి ఓట్లను తొలగించలేదా? రెండు చోట్ల ఓట్లు నమోదై ఉన్నాయా? అనే కోణంలో పరిశీలించి వాటిని తొలగించే క్రమంలో పొరపాట్లు జరిగి ఉండొచ్చు. రాజకీయ కారణాలతో ఎవ్వరైనా సిబ్బంది ఉద్దేశపూర్వకంగా ఓట్లను తొలగించినట్లు రుజువైతే కఠిన చర్యలు తీసుకుంటాం. ఎలక్షన్ కమిషన్ పర్యవేక్షణలో జరిగే ఈ ఓట్ల ప్రక్రియకు సంబంధించి ఎవ్వరైనా అలక్ష్యం వహించడానికి వీల్లేదు. సాక్షి: ఒక్క శ్రీకాకుళం నగరంలోనే 28 వేలు, పలాసలో 20 వేల మంది ఓట్లు తీసేశారు. వాటిలో అర్హులవీ ఎలా తప్పించారో వైఎస్సార్సీపీ నాయకులు ఫిర్యాదు చేశారు కదా? కలెక్టరు: శ్రీకాకుళం నగరంలో జనాభాతో పోల్చితే ఓటర్ల శాతం సాధారణం (65–70 శాతం) కన్నా ఎక్కువగా (80 శాతం) ఉంది. ఈసారి ఎలక్షన్ కమిషన్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలెక్టో రోల్స్ (ఐఆర్‌ఈఆర్) పట్టణాల్లో ప్రత్యేక పరిశీలన కార్యక్రమం నిర్వహించింది. శ్రీకాకుళంలో పోలింగ్ స్టేషన్లు శాస్త్రీయంగా లేవు. దీంతో ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధి ప్రాంతానికి సరిహద్దులిచ్చి నగరీలక్ష్య పేరుతో మ్యాప్‌ను తయారుచేశారు. ఈ ప్రకారం సామీప్య పోలింగ్ స్టేషన్ పరిధిలోకి ఓటర్లను మార్పులు చేర్పులు చేశారు. దీంతో సుమారు 32 వేల ఓట్లు ఒక పోలింగ్ స్టేషన్ పరిధి నుంచి మరో పోలింగ్ స్టేషన్ పరిధిలోకి మారిపోయాయి. తొలగించిన 27 వేల ఓట్లలో అర్హులు ఎవ్వరున్నా వారి ఓటుహక్కు కోల్పోకుండా చూసే బాధ్యత మాది. ఫిర్యాదులొచ్చిన ఏరియాలో సిబ్బందిని ఇంటింటికీ పంపిస్తున్నాం. అక్కడే అర్హుల వివరాలతో ఫారం–6 పూర్తిచేయిస్తారు. సాక్షి: సిబ్బందిలో కొంతమంది రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు లొంగి ఓటర్ల నమోదు ప్రక్రియలో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వస్తున్నాయి? కలెక్టరు: ఎలక్షన్ కమిషన్ నియమనిబంధనలను లోబడి పనిచేయకుంటే వీఆర్వో నుంచి డీఎల్వో వరకూ ఏ స్థాయిలో ఉద్యోగులైనా తేడా చేస్తే ఉద్యోగాలు పోగొట్టుకోవాల్సి ఉంటుంది. ఫారం–6 వివరాలు మరోసారి చెక్ చేయిస్తాం. అవసరమైతే క్రాస్‌చెక్ కూడా చేయిస్తాం. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటుహక్కు కల్పిస్తాం. ఏప్రిల్ నెల నుంచి ఈఆర్వో నెట్ పేరుతో కొత్త సాఫ్ట్వేర్ వస్తోంది. డబుల్ ఎంట్రీ ఓట్లను గుర్తించి ఓటరు ఎక్కడైతే తన ఓటు ఉండాలని కోరుకుంటారో అక్కడే ఓటు ఉంచి రెండోది తొలగిస్తాం. సాక్షి: ప్రస్తుతం జిల్లాలో ఏ ఏటీఎం చూసినా నగదు ఉండట్లేదు. రెండు నెలలుగా తీవ్రతరమైన ఈ సమస్యకు పరిష్కార చర్యలేమైనా ఉన్నాయా? కలెక్టరు: నగదుకొరత జిల్లాలో ఎక్కువగా ఉన్నమాట వాస్తవం. బ్యాంకులకు క్యాష్ వచ్చినా విశాఖ నగరంలోనే ఎక్కువగా సర్దేస్తున్నారు. వచ్చే నెలలో ఆ సమస్య తలెత్తకుండా జిల్లాకు నిష్పత్తి ప్రకారం నగదు ఇవ్వాలని ఆర్బీఐకి కోరాం. ఈనెలాఖరులోగా పింఛన్లు, వేతనదారులకు సరిపడా నగదు సిద్ధం చేసుకోవాలని బ్యాంకర్లకు సూచించాం. సాక్షి: జిల్లాలో సాగునీరు సమస్య తీర్చడంలో జలసిరి పథకం ఎంతవరకూ ఉపయోగపడుతుంది? కలెక్టరు: ఈ పథకం కింద ఒక్కో బోర్వెల్కు ఈపీడీసీఎల్ రూ.3 లక్షల వరకూ ఖర్చు చేస్తోంది. బోరుబావి తవ్వకం, సబ్మెర్సిబుల్ పంప్, సోలారు విద్యుత్తు వ్యవస్థను ఏర్పాటు చేయడానికి మొత్తం రూ.3 లక్షల ఖర్చు అవుతుంది. దీనిలో జనరల్, బీసీ కేటగిరి రైతులు రూ.25 వేలు, ఎస్సీ, ఎస్టీ రైతులు రూ.6 వేలు మాత్రమే భరిస్తే సరిపోతుంది. సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడేలా ఒకేచోట రెండున్నర ఎకరాలలోపు భూమి ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే జిల్లాలో ఎక్కువ చిన్న కమతాలే ఉన్న దృష్ట్యా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి ఈ షరతును కాస్త సడలించేలా కృషి చేశాను. మూడు ఎకరాలలోపు అదీ ఒకేచోట గాకుండా వేర్వేరు చోట్ల ఉన్నా రైతులకు లబ్ధి కలుగుతుంది. జిల్లాలో 9 వేల బోర్‌వెల్స్ లక్ష్యంగా నిర్దేశించుకున్నాం. మార్చి నెలాఖరులోగా 3 వేలు క్లియర్ చేస్తాం. సాక్షి: వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2 పనులు నిర్దేశించిన గడువులోగా పూర్తయ్యే అవకాశం కనిపించట్లేదు? కలెక్టరు: 87 ప్యాకేజీ పనులు ఆలస్యమైనా ఇప్పుడు అవీ వేగవంతమయ్యాయి. మిగిలిన వంతెనలు తదితర 25 నిర్మాణాలను మార్చిలోగా పూర్తి చేయాలని గడువు నిర్దేశించాం. ఒకవేళ ఆలస్యమైనా మే, జూన్ నెలల్లో తొలకరి వర్షాలతో వంశధార నదిలో నీరు వచ్చే సమయానికి పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. 88 ప్యాకేజీలో కొత్తూరు–సీతంపేట రోడ్డులో ఒక్కచోట కటింగ్‌కు సంబంధించిన కోర్టు కేసు కూడా త్వరలోనే క్లియర్ అయిపోయే అవకాశం ఉంది. హిరమండలం జలాశయానికి సంబంధించిని మూడు పెండింగ్ పనుల్లో గార్లపాడు, తులగాం వద్ద దాదాపుగా పూర్తికావచ్చాయి. స్పిల్‌వే, హెడ్‌రెగ్యులేటర్ పనులు కూడా వేగవంతంగా జరుగుతున్నాయి. ఏదేమైనా జూన్ నాటికి జలాశయంలో 8 టీఎంసీల నీరు నింపడానికి కృషి చేస్తున్నాం. నిబంధనల ప్రకారం కొత్త డ్యామ్‌లో తొలి సంవత్సరం 40 శాతం (8 టీఎంసీలు), రెండో సంవత్సరం 80 శాతం (16 టీఎంసీలు), మూడో సంవత్సరానికి శత శాతం (19 టీఎంసీలు) నింపాలి. సాక్షి: నేరడిబ్యారేజీ నిర్మాణం పూర్తిగాకుండా 19 టీఎంసీలు జలాశయానికి తీసుకురావడం సాధ్యమేనా? కలెక్టరు: నేరడి బ్యారేజీకి సంబంధించి దాదాపు రూ.460 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించడానికి డిటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) సిద్ధమైంది. కానీ వంశధార ట్రిబ్యునల్ తీర్పుపై ఒడిశా ప్రభుత్వం మళ్లీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏమైనా తీర్పు మనకు అనుకూలంగా వచ్చే అవకాశం ఉంది. సాక్షి: కానీ వంశధార నిర్వాసితుల సమస్యల పరిష్కారం ఇంకా కొలిక్కిరాలేదు? కలెక్టరు: నిర్వాసితుల కాలనీల్లో తాగునీరు, రోడ్లు, విద్యుత్తు, డ్రైనేజీలు వంటి మౌలిక వసతుల కల్పన ఇప్పటికే పూర్తి చేశాం. సామాజిక భవనాలు, అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాల భవనాల నిర్మాణపనులు ఇప్పటికే పూర్తయ్యాయి. మిగిలిన మెట్టూరు బిట్–2, 3ల్లోని లోతట్టు ప్రాంతం పూడ్చివేత పనులకూ ఆమోదం తెలిపాం. పరిహారం విషయానికొస్తే యూత్ ప్యాకేజీ అందని కుటుంబాలకు హౌసింగ్ స్కీమ్ కింద ఇప్పటికే 1300 వరకూ ఇళ్లు మంజూరుచేశాం. వారం పది రోజుల్లో మరో ఏడొందల వరకూ మంజూరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం. అలాగే ఉపాధి హామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) కింద జాబ్‌కార్డులు ఇచ్చాం. ఒకవేళ పనిప్రాంతాలు దూరంగా ఉంటే రవాణా సౌకర్యం కల్పిస్తాం. సాక్షి: నిర్వాసితుల కాలనీలున్న చోట్ల ప్రత్యేక గ్రామ పంచాయతీల ఏర్పాటు, ఓటుహక్కు కల్పన విషయాల్లో నెలకొన్న గందరగోళాన్ని ఎలా చక్కదిద్దుతారు? కలెక్టరు: నిర్వాసిత కాలనీలున్న గ్రామ పంచాయతీల్లో విలీనం చేసేందుకు డీనోటిఫై చేశాం. ఇక ఓట్ల విషయానికొస్తే డిసెంబరులో డ్రాఫ్ట్ ప్రచురించే సమయానికి ఆయా గ్రామాల్లో ఉన్నట్లే ఓట్లు ఉంటాయి. అయితే కొత్త గ్రామపంచాయతీ పరిధిలోకి ఓట్లను తీసుకొచ్చే విషయాన్ని చీఫ్ ఎలక్షన్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. అందరికీ ఓటుహక్కు కల్పిస్తాం. సాక్షి: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాల లక్ష్యం సాధించడానికి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి కదా? కలెక్టరు: వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం అక్టోబరులోగా శతశాతం పూర్తి చేయాలనేది మా లక్ష్యం. కానీ దీన్ని మార్చి నెలకు కుదించేసరికి ఒత్తిడి పెంచక తప్పలేదు. వారం రోజులు పింఛన్లు ఆపినా తర్వాత ఇచ్చేశారు. ఈసారి ప్రజలను గాకుండా గ్రామ సర్పంచులను బాధ్యులను చేస్తున్నాం. నిర్లక్ష్యం వహిస్తే చెక్ పవర్ రద్దు చేస్తామని, నిధులు నిలిపేస్తామని కూడా హెచ్చరించాల్సి వస్తోంది. -
అవే సమస్యల ని‘వేదన’!
సాక్షి ప్రతినిధి–శ్రీకాకుళం: వ్యవసాయానికి సాగునీరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు వరకూ.. ఉపాధి కల్పన నుంచి పరిశ్రమల స్థాపన వరకూ.. పింఛను నుంచి రేషన్‌కార్డు వరకూ ఇలా ప్రతి అంశంలోనూ ప్రభుత్వం ఈ మూడున్నరేళ్ల కాలంలో చేసిందేమైనా ఉందా? అంటే ప్రజలు మాత్రం పెదవి విరుస్తున్నారు. ముఖ్యమంత్రే సిక్కోలు జిల్లాలో పది సార్లు పర్యటించినా క్షేత్రస్థాయిలో ప్రజల సమస్యలు మాత్రం గుదిబండలా అలాగే ఉన్నాయి. గత ఎన్నికల సమయంలో, ఆ తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు అనేక హామీలు ఇచ్చినా అవేవీ కార్యరూపం దాల్చ లేదు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగే గురువారం నుంచి రెండ్రోజుల పాటు ఆయన జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర రాజధానిలో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. దీనికి జిల్లా కలెక్టరు కె.ధనంజయరెడ్డి కూడా హాజరవుతున్నారు. జిల్లాలో సాగునీటి పెండింగ్ ప్రాజెక్టుల సహా వ్యవసాయ, వ్యవసాయానుబంధ, పారిశ్రామిక, సేవా రంగాల తీరుపై నివేదికను సమర్పించనున్నారు. జిల్లా కలెక్టరు నివేదిక ప్రకారం జిల్లా గత ఆర్థిక సంవత్సరం (2016–17)లో వ్యవసాయ రంగం 12.8 శాతం, పారిశ్రామిక రంగం 9.28 శాతం, సేవారంగంలో 10.10 శాతం వృద్ధి సాధించింది. కానీ ఇదంతా నివేదికలో చూపించడానికే తప్ప ఆచరణలో ఆ స్థాయి వృద్ధి కనిపించలేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా తలసరి ఆదాయం రూ.94,118 మాత్రమే. కానీ రాష్ట్ర తలసరి ఆదాయం రూ.1,22,376 ఉంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 14.44 శాతం వృద్ధి సాధించడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని జిల్లా కలెక్టరు ధనంజయ్‌రెడ్డి ‘సాక్షి’కి చెప్పారు. తొలిరోజు వ్యవసాయం, వ్యవసాయాధార పరిశ్రమల పరిస్థితి, సాగునీటి పెండింగ్ ప్రాజెక్టులు, బడ్జెట్ కేటాయింపుల అవసరంపై కాన్ఫరెన్స్‌లో ప్రస్తావించనున్నట్లు తెలిపారు. జీడిపప్పు పరిశ్రమలో అనుసరిస్తున్న సంప్రదాయ పద్ధతులకు బదులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఫుడ్‌ప్రాసెసింగ్ విధానాన్ని పరిచయం చేయాల్సి ఉందన్నారు. మేజర్, మైనర్ ఇరిగేషన్లో పెండింగ్ ప్రాజెక్టుల గురించి ఈ సమావేశంలో ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఉద్దానం సహా గ్రామీణ ప్రాంతాలకు తాగునీరు అందించడానికి సంబంధించిన ప్రతిపాదనలను కూడా ప్రస్తావించనున్నట్లు తెలిపారు. కొవ్వాడ అణుపార్కు, భావనపాడు పోర్టు భూసేకరణకు సంబంధించిన వివాదాలను కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానన్నారు. శ్రీకాకుళంలోని ఏకైక ప్రభుత్వ బోధనాసుపత్రి రిమ్స్‌లో ఎంబీబీఎస్ సీట్లు వంద నుంచి 150కి పెంపు, అలాగే పీజీ వైద్య విద్య సీట్ల పెంపునకు సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన విషయమై ప్రస్తావించనున్నట్లు చెప్పారు. ఉద్దానంలోని కిడ్నీ రోగులకు ఉచితంగా మందుల సరఫరా ప్రతిపాదనను కూడా సాధ్యమైనంత సత్వరమే ఆచరణలోకి తీసుకొచ్చే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకొస్తామన్నారు. -
వేరుశనగ రక్షణకు రెయిన్‌గన్స్
-అవసరమైతే విద్యుత్ వేళల్లో మార్పు -రాష్ట్ర వ్యవసాయ సంచాలకులు: ధనంజయరెడ్డి భాకరాపేట రాష్ట్ర వ్యాఫ్తంగా నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులు నుండి వేరుశనగ పంటను కాపాడటానికి రాష్ట్రవ్యాప్తంగా 13వేల 300 రెయిన్‌గన్స్‌ను వినియోగిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయు సంచాలకులు ధనంజయరెడ్డి తెలిపారు. బుధవారం చిత్తూరు జిల్లా చిన్నగొట్టిగల్లులో వేరుశనగ పంటకు అందిస్తున్న తడిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ వర్షాభావ పరిస్థితులు కారణంగా ఎండి పోతున్న పంటకు తడిని అందించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రూ. 160 కోట్లతో రెయిన్ గన్లను అందిస్తున్నామన్నారు. ఎక్కడా తడి లేక పంట రాలేదన్నది వినపడకూడదని సీఎం చెప్పినట్లు తెలిపారు. జూన్ మొదటి వారంలో వేసిన వేరుశనగ 50 శాతం పంట మాత్రం చేతికి వస్తుందన్నారు. ఎకరాకు 20 వేల లీటర్లు నీటితో వేరుశనగ చేనును తడపవచ్చునన్నారు. ఇందుకు అయ్యే ఖర్చులో 50 శాతం ప్రభుత్వం భరిస్తుందన్నారు. ముందుగా రైతు పెట్టుకుంటే వారి ఖాతాలకు వారంలో నగదు వేస్తామన్నారు. చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లా ప్యాఫిలి మండలంలో అత్యధికంగా పంట ఎండిపోయిందన్నారు. కరెంటు వేళల్లో కూడా మార్పులు చేయడానికి ప్రభుత్వం చోరవ తీసుకుందన్నారు. మధ్యాహ్నం సమయంలో కరెంటు ఇస్తే రెయిన్ తో నీటీని వదలితే ఎక్కువ శాతం గాలిలో కలిసి పోతుందని, ఉదయం వేళల్లోనే కరెంటు సరఫరా చేసి వేరుశనగ రైతులును ఆదుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రాష్ర్ట వ్యాప్తంగా తెగుళ్ళు, సస్యరక్షణ చర్యలు చేపట్టేందుకు ప్రత్యేక టీమ్‌లు సందర్శించి చర్యలు తీసుకుంటున్నాయన్నారు. రైతులుకు వ్యవసాయబావులు దగ్గర నీటీ వసతి లేకుండా అయిల్ఇంజిన్లు సైతం సరఫరా చేసి, పైపులు, రెయిన్ గన్స్, స్పింక్లర్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. నీటీ వసతి లేక, వర్షాభావం వల్ల వేరుశనగ పంట ఎండిపోతే ఇన్సూరెన్సు చేయించుకున్నవారికి వారంలో బీమా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. ఇన్సూరెన్సు లేకపోతే ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామన్నారు. సమావేశంలో వ్యవసాయశాఖ జాయింట్ డెరైక్టర్ విజయ్‌కుమార్, పీడీ శివనారాయణ పాల్గొన్నారు.