‘టెండర్లలో పాల్గొనొద్దు’ శీర్షికన కర్నూలు ఎడిషన్‌లో కథనం
వాస్తవాలు జీర్ణించుకోలేక కక్షగట్టిన కూటమి నేతలు
ఎడిటర్ ఆర్. ధనంజయరెడ్డిపై ఎఫ్‌ఐఆర్ నమోదు
కర్నూలు (అర్బన్): కర్నూలు నగరపాలకసంస్థలో రూ.2 కోట్ల పనులకు సంబంధించిన టెండర్లు తమవారికే దక్కాలని, ఎవరూ టెండర్లు వేయవద్దని మంత్రి అనుచరుడు బెదిరిస్తున్నారని సాక్షిలో ప్రచురించటంతో కూటమి నేతలు కక్షగట్టారు. ఎవరూ టెండర్లు వేయవద్దని మున్సిపల్ కాంట్రాక్టర్ల వాట్సాప్ గ్రూపుల్లో పంపించిన మెస్సేజ్ సహా వాస్తవాలు ప్రచురించడాన్ని జీర్ణించుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశారు. గత నెల 30వ తేదీన సాక్షి కర్నూలు ఎడిషన్‌లో ‘టెండర్లలో పాల్గొనొద్దు’ శీర్షికన కథనం ప్రచురించినందుకు సాక్షి ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై కేసు నమోదు చేశారు.
ఉద్దేశపూర్వకంగా అధికార పార్టీకి చెందిన వారిపై తప్పుడు సమాచారాన్ని ప్రచురించారనే ఫిర్యాదు మేరకు సాక్షి ఎడిటర్, పబ్లిషర్ ఆర్.ధనంజయరెడ్డి, సాక్షి కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ రిపోర్టర్ ప్రతాప్‌పై కర్నూలు ఒకటో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. కార్పొరేషన్‌లో ముక్కు, మొహం తెలియని వ్యక్తులు, కాంట్రాక్ట్ పనిచేయనివారు, కాంట్రాక్టర్ లైసెన్స్ కూడా లేనివారు కార్పొరేషన్‌లో పెత్తనం చెలాయిస్తున్నారని పత్రికలో ప్రచురించారని బిజినేపల్లి సందీప్, చంద్ర శేఖర్‌ల ఫిర్యాదు మేరకు ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్‌లో 267/2025 యూ/సెక్షన్ 352, 353(1)(బి), 356(3) అండ్ (4), 61(1)(బి) ఆర్/డబ్ల్యూ 3(5) బీఎన్‌ఎస్ కింద ఎఫ్‌ఐఆర్ నమోదుచేశారు.
కర్నూలులో ఐదో కేసు
వాస్తవాలను ప్రజలకు తెలియజేయాలనే సదుద్దేశంతో వరుస కథనాలను ప్రచురిస్తున్న ‘సాక్షి’పై కర్నూలులో ఇప్పుడు ఐదోకేసు నమోదైంది. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన నాటి నుంచి పాలకులు వ్యవహరిస్తున్న తీరు, అనుసరిస్తున్న విధానాలను ఎప్పటికప్పుడు ఎండగడుతుండటాన్ని కూటమి నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే కూటమి నేతల ఫిర్యాదుల మేరకు పోలీసులు తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారు. ఒక ఉపాధ్యాయుడు తనను కిడ్నాప్ చేశారు మొర్రో అంటూ ప్రింట్, ఎల్రక్టానిక్ మీడియా ముందు వాపోయిన కథనాన్ని ప్రచురించిన ‘సాక్షి’పై మొదటి కేసు నమోదైంది.
‘రాయలసీమలో అనకొండ ఐపీఎస్’ శీర్షికతో ప్రచురితమైన కథనంపైన కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే దశాబ్దాల తరబడి నివాసముంటున్న నగరంలోని ఎ, బి, సి క్యాంపుల్లోని ప్రభుత్వ క్వార్టర్లను ఖాళీ చేయించాలనే ప్రభుత్వ నిర్ణయంపై ‘ఎ, బి, సి క్యాంపుల భరతం పడతాం’ శీర్షికన ప్రచురితమైన వార్తపై కూటమి నేతలు నగరంలోని పోలీస్‌స్టేషన్లలో రెండు ఎఫ్‌ఐఆర్‌లను నమోదు చేయించారు.


