
ఇన్ బాక్స్
ఎలాంటి నోటీసులూ ఇవ్వకుండా ఏకంగా ఒక ప్రముఖ పత్రికా ఎడిటర్ ఇంట్లోకి పోలీసులు దౌర్జన్యంగా చొరబడి సోదాలు చేయడం ఒకప్పటి హిట్లర్ నాజీల పాలనను ప్రజల కళ్లకు కట్టింది. ప్రజాభిప్రాయాన్ని నాణేనికి రెండో పక్క ప్రతిబింబించే ప్రధాన పత్రిక ‘సాక్షి’ ఎడిటర్ ఆర్.ధనంజయ రెడ్డిపై ఇప్పటికే మూడు, నాలుగు కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం, తాజా ఘటన ద్వారా ఏకంగా ఆయన నైతిక స్థైర్యాన్నే దెబ్బతీసే ప్రయత్నం చేసింది. ‘సాక్షి’పై వీలైనప్పుడల్లా విషం కక్కే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనలోని పోలీ సులు నాటి నాజీ సేనలను గుర్తు చేశారు. నాజీల పాలనలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందన్న విషయాన్ని ఒకసారి గుర్తుచేసుకుంటే...
ప్రజాభిప్రాయాన్ని నియంత్రించే సాధనాలుగా...
అడాల్ప్ హిట్లర్ నాజీ పాలనలో (1933–1945), ప్రెస్ స్వాతంత్య్రాన్ని పూర్తిగా అణచివేశారు. ప్రజాభిప్రాయాన్ని నియంత్రించడానికి పత్రికలను ప్రచార పరికరంగా ఉపయోగించారు. ప్రభుత్వ నిర్దేశాలను అనుసరించి అన్ని మీడియా, పత్రికలు, రేడియో లకు కఠిన నియంత్రణలు విధించారు. జర్మనీలోని అన్ని మీడియా సంస్థలు ప్రభుత్వ పార్టీకి అనుకూలంగా ఉండాల్సిందే. నాజీ ప్రభుత్వాన్ని ప్రోత్సహించడానికి, నిరసనలు నెమ్మదింపచేయడానికి మీడియానే సాధనంగా వినియోగించారు. నాజీలకు నిరసనలు తెలిపే పత్రికలను మూసివేశారు. వ్యతిరేక వార్తలను ప్రచురించడాన్ని పూర్తిగా నిషేధించారు. యూదులపై ద్వేషాన్ని ప్రేరేపించడానికి, ప్రజల మనస్సులో హిట్లర్, నాజీ పార్టీకి అనుకూల భావనను పెంపొందించేందుకు పత్రికలు పనిచేసేవి.
ప్రతి పత్రికనూ జర్మనీ ప్రచార, ప్రజల బోధన మంత్రిత్వ శాఖ (రీచ్ మినిస్ట్రీ ఆఫ్ పబ్లిక్ ఎన్‌లైట్‌మెంట్ అండ్ ప్రాపగాండా) పరిధిలోకి తీసుకొచ్చారు. దీనిని జోసెఫ్ గోబెల్స్ (తప్పుడు ప్రచారానికి ప్రస్తుత నానుడి) నాయకత్వం వహించారు. స్వతంత్రంగా పనిచేసే పత్రికలు, విపక్ష పత్రికలను నిషేధించారు లేదా బలవంతంగా మూసివేశారు. నాజీ పార్టీ ఆమోదించిన సమాచారం మాత్రమే ప్రచురితం కావాలి. ఒక జర్నలిస్ట్ చట్టబద్ధంగా పని చేయాలంటే, రీచ్ ప్రెస్ చాంబర్‌లో సభ్యత్వం తప్పనిసరి.
కమ్యూనిస్టు, సోషలిస్టు, యూదు, లిబరల్ పత్రికలు తొలుత నిషేధానికి గురయ్యాయి. హిట్లర్ లేదా నాజీ పార్టీపై చేసే ఏవైనా విమర్శలను దేశద్రోహం లేదా రాజద్రోహంగా పరిగణించేవారు.
పత్రికల నుంచి రేడియో, సినిమాలు, పిల్లల పుస్తకాల వరకు కూడా నాజీ ప్రచారంతో నిండిపోయేవి.
చదవండి: ఇప్పటికైనా బౌద్ధాన్ని అర్థం చేసుకున్నామా?
భావ ప్రకటనా స్వేచ్ఛ రద్దయ్యింది. జర్నలిస్ట్ ఎవరైనా ఉన్నారంటే నాజీ ప్రభుత్వానికి సహకరించాలి. లేదంటే జైలుకు పోవాలి. లేదంటే ప్రాణాలే పోగొట్టుకోవాలి.
జర్నలిస్టులు నిరంతరం భయంతో నిఘా నీడన బ్రతకాల్సి వచ్చేది. ఒక మాటలో చెప్పాలంటే, నాజీ పాలన పత్రికలను ప్రజాభిప్రాయం ప్రతిబింబించడానికి మాధ్యమాలుగా కాకుండా, తమకు అనుకూలంగా ప్రజాభిప్రాయాన్ని మలిచే శక్తిమంతమైన ఆయుధంగా మార్చింది.
– ఎన్. భాస్కర్ ప్రసాద్, విజయవాడ