
ప్రధాని నరేంద్ర మోదీతో భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితులైన సెర్జియో గోర్
విశ్లేషణ
‘‘దౌత్యమంటే 50 శాతం ప్రోటోకాల్, 30 శాతం ఆల్కహాల్, 20 శాతం టి.ఎన్. కౌల్’’ అని మన దేశంలో చమత్కారంగా అంటూంటారు. ఒకప్పుడు విదేశాంగ కార్యదర్శిగా పనిచేసిన టీఎన్ కౌల్ పేరు తో ఆ చమత్కారం వాడుకలోకి వచ్చింది. ఆయన మాస్కో, వాషింగ్టన్ వంటి ముఖ్యమైన చోట్ల భారత రాయబారిగానూ పనిచేశారు. అయితే, ప్రపంచ వ్యాప్తంగా దౌత్యం తీరుతెన్నులు మారుతున్నాయి.
సంప్రదాయ ఉల్లంఘనల చిక్కు
ఇటీవలి కాలంలో భారతీయ దౌత్య సంప్రదాయాల్లో గణనీయమైన మార్పు అక్టోబర్ 11న కనిపించింది. మన దేశంలో అమెరికా రాయబారిగా నియమితుడైన సెర్జియో గోర్‌కు ప్రధాని నరేంద్ర మోదీ స్వాగతం పలికారు. న్యూఢిల్లీలో గోర్ నూతన బాధ్యతలకు సంబంధించి చాలా విషయాలు సంప్రదాయానికి భిన్నంగానే సాగాయి. 38 ఏళ్ల చిన్న వయసులోనే ఆయన ఇంత పెద్ద బాధ్యతల్లోకి వచ్చారు. ఆయనకు దౌత్య అనుభవం సున్నా.
ఒక రాయబారి పదవికి ఆయనకున్న శక్తిసామర్థ్యాలేమిటి అనేది అమెరికా సెనేట్ ముందు శల్యపరీక్షకు లోనుకాలేదు. అమెరికా కాంగ్రెస్‌కు నిలయమైన క్యాపిటల్ హిల్‌లో ప్రోటోకాల్ ఎలా ఉల్లంఘనకు లోనైందో, అదే మాదిరిగా భారతదేశంలో అధికార కేంద్రమైన రైజీనా హిల్‌లోనూ ఉల్లంఘనకు లోనైంది. దానికి ఎంతటి మూల్యాన్ని చెల్లించుకోవలసి వచ్చిందో మోదీ ప్రభుత్వం ఇటీవలనే తెలుసుకుంది.
రాయబారిగా నియమితులైనవారు తమ నియామక పత్రాలను రాష్ట్రపతికి సమర్పించిన తర్వాతనే, అధికారిక లాంఛనాలు అమలులోకి వస్తాయి. ఆ తతంగం పూర్తి కాకుండానే ప్రధాని తన కార్యాలయంలో గోర్‌తో సమావేశమయ్యారు. ఈ సంఘటన చోటుచేసుకోకపోయి ఉంటే, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళపై ప్రస్తుత గందరగోళానికి అవకాశం ఉండేది కాదు. మోదీ–గోర్ మధ్య సంభాషణను ఆధారంగా చేసుకుని, రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళను ఆపేస్తోందంటూ అక్టోబర్ 15న ట్రంప్ ఏకపక్షంగా ప్రకటించేశారు.
ఈ ‘సంచలన వార్త’ను ప్రకటించేందుకు గోర్ అనుమతిని ట్రంప్ కోరారు. మోదీతో తాను ఫోన్‌లో సంభాషించినపుడు, మోదీ తనతో ఆ మాట అన్నట్లు, ట్రంప్ ఎన్నడూ చెప్పలేదు. మోదీ ‘‘రష్యా నుంచి చమురు కొనబోవడం లేదని ఈ రోజు (అక్టోబర్ 15) నాకు హామీ ఇచ్చారు’’ అని మాత్రమే ట్రంప్ చెప్పారు. ఈ అంశంపై మోదీ ఆలోచనలను సరిగ్గానో లేదా తప్పుగానో అధ్యక్షుని చెవిన వేసింది గోరేనని, ట్రంప్ మీడియా సమావేశం పూర్తి వీడియో చూస్తే తేటతెల్లమవుతుంది.
శ్వేతసౌధంలో ఉన్నదే సంప్రదాయాలకు భిన్నంగా వ్యవహరించే వ్యక్తి గనక, ప్రధానికీ, గోర్‌కూ మధ్య సమావేశం ఏర్పాటు చేస్తే, అది ఊహించని పర్యవసానాలకు దారితీస్తుందని ప్రధాని సలహాదారులు గ్రహించి ఉండవలసింది. భారతదేశంలో దౌత్యం తాలూకు సంప్రదాయాల గురించి బొత్తిగా అనుభవం లేని వ్యక్తికి, నేరుగా ప్రధానితో సమావేశమయ్యే అవకాశం కల్పించకూడదు. చివరగా జరగవలసిన పని మొదట్లోనే జరిగింది.
దౌత్యవేత్తలు గట్టిగా ఉంటే...
అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ 2000వ సంవత్సరంలో భారత పర్యటనకు రావడానికి ఒక వారం ముందు, ఒక విమానం నిండా మెరైన్లు, క్లింటన్ ముందస్తు భద్రతా దళ సిబ్బంది ఆ రోజు మధ్యాహ్నం భారత్‌కు బయలుదేరుతారని క్లింటన్ పాలనా యంత్రాంగంలోనివారు వాషింగ్టన్ లోని భారతీయ రాయబార కార్యాలయానికి తెలియజేశారు. మెరైన్లు సకాలంలో భారతీయ వీసా తీసుకున్నారా అంటూ రాయబారి కార్యాలయంలో డిప్యూటీ చీఫ్ ఆఫ్ మిషన్‌గా ఉన్న టి.పి. శ్రీనివాసన్ మర్యాదపూర్వకంగానే ప్రశ్నించారు.
అప్పటికి వారు వీసాల కోసం కనీసం దరఖాస్తు కూడా చేసుకోలేదు. ‘‘అమెరికా మెరైన్లు వీసాలపై ప్రయాణించరు’’ అని ఫోన్ చేసిన వ్యక్తి కసురుకుంటున్న రీతిలోనే చెప్పారు. కానీ, శ్రీనివాసన్ అదరలేదు. ‘‘మెరైన్లకు వీసాలు లేకపోతే వారు భారత్ వెళ్ళడానికి ఉండదు. వారి విమానం న్యూఢిల్లీలో ల్యాండ్ అవడానికి వీలుపడదు’’ అని నిష్కర్షగా చెప్పేశారు. దాంతో అమెరికన్లు దారికి వచ్చి, ప్రయాణ నియమాలను పాటించారు.
గోర్ విషయంలో మాదిరిగానే, భారత్ ప్రోటోకాల్‌ను ఉల్లంఘించిన ఉదంతం మరోటి కూడా గుర్తుకు వస్తోంది. భారత్‌లో అమెరికా రాయబారిగా నియమితుడైన రిచర్డ్ సెలెస్ట్, 1997 నవంబర్‌లో న్యూఢిల్లీలో దిగుతూనే, అప్పటి విదేశాంగ కార్యదర్శి కె.రఘునాథ్ ఇచ్చిన ప్రైవేటు విందుకు హాజరయ్యారు. అప్పటి ప్రధాని ఐ.కె. గుజ్రాల్ అంతకు రెండు నెలల ముందు న్యూయార్క్‌లో క్లింటన్‌ను కలుసుకుని, ఆయనను భారత పర్యటనకు ఆహ్వానించారు. విదేశాంగ విధానంపై తనదైన ముద్రవేయాలని చూస్తున్న గుజ్రాల్, అప్పటికి 19 ఏళ్ళ విరామం తర్వాత, ఒక అమెరికా అధ్యక్షుడు భారతదేశానికి వస్తే, తన పేరు ప్రతిష్ఠలు ఇనుమడిస్తాయని భావించారు.
క్లింటన్ పర్యటనకు వేగంగా మార్గం సుగమం చేయవలసిందిగా సెలెస్ట్‌ను కోరారు. సెలెస్ట్ ఆ మాటలకు పడిపోలేదు. తన నియామక పత్రాలను రాష్ట్రపతికి సమర్పించి, రాజకీయ వాస్తవ పరిస్థితులను బేరీజు వేశారు. భారత పర్యటనకు అది సరైన సమయం కాదని గుట్టుచప్పుడు కాకుండా క్లింటన్‌కు సలహా ఇచ్చారు. గుజ్రాల్ ప్రభుత్వం తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటిదనే నిర్ధా్ధరణకు క్లింటన్ పాలనా యంత్రాంగం వచ్చింది. ఆ తర్వాత, ఐదు నెలలకే గుజ్రాల్ తన పదవికి రాజీనామా చేయవలసి వచ్చింది.
ఉల్లంఘనకూ ఓ లెక్కుండాలి!
భారత్‌లోగానీ, మరెక్కడైనాగానీ రాయబారులుగా నియమితులైనవారు ప్రభుత్వాధినేతలను కలుసుకోవడం అసాధారణమైన విషయం ఏమీ కాదు. కాకపోతే, ఆ దౌత్యవేత్త నమ్మకస్థుడిగా పేరు తెచ్చుకుని, ఆతిథేయ దేశం గురించి సరైన సలహా ఇవ్వగలిగిన యోగ్యత కలిగినవారై ఉంటారు. మాజీ ప్రధాని చరణ్ సింగ్ కూడా గుజ్రాల్ మాదిరిగానే తొందరపడబోయి 1979లో అభాసు పాలయ్యారు.
అప్పట్లో ఆయన మరో అగ్ర రాజ్యపు రాయబారిని సమావేశానికి పిలిచారు. కాబూల్‌పై సోవియట్ దురాక్రమణకు సంబంధించి సోవియట్ రాయబారి యులి వొరొంత్సోవ్‌కు క్లాసు పీకాలని చరణ్ సింగ్ ఉద్దేశం. తీరా, సోవియట్ రాయబారి మాటలకు చరణ్ సింగ్ ఖంగు తిన్నారు. మరి కొద్ది రోజుల్లో మళ్ళీ ప్రధాని కాబోతున్న ఇందిరా గాంధీని కలిసి మాట్లాడాననీ, మాస్కో వైఖరిని అర్థం చేసుకున్న రీతిలో ఆమె మాట్లాడారనీ వొరొంత్సోవ్ కుండబద్దలు కొట్టారు.
అవతలి పక్షం కూడా న్యాయబద్ధంగా వ్యవహరించగలదనే నమ్మకం ఉంటే, ప్రొటోకాల్‌ను అప్పుడప్పుడు ఉల్లంఘించినా ఫరవాలేదు. లేకపోతే, అది వికటించే ప్రమాదం ఉందని గ్రహించాలి.
కె.పి. నాయర్
వ్యాసకర్త వ్యూహాత్మక అంశాల విశ్లేషకుడు
(‘ద ట్రిబ్యూన్’ సౌజన్యంతో)