జెన్–జీ ఉద్యమం తర్వాత, నేపాల్ ప్రజల వైపు నుంచి చూసినపుడు, ఇటీవల ఒక ఒపీనియన్ పోల్‌లో ఏ ఒక్క నేతకూ 10 శాతానికి మించి ఓట్లు రాలేదు. అందుకే మార్చిలో జరిగే ఎన్నికలలో ఏమయేదీ అర్థం కాకుండా ఉంది.
విశ్లేషణ
జెన్–జీ అనూహ్యమైన తిరుగుబాటు ఉధృతితో నేపాల్ రాజకీయ పార్టీలు అన్నీ సంక్షోభంలో చిక్కుకున్నాయంటే అతిశ యోక్తి కాదు. పార్టీల నాయకత్వం, సిద్ధాంతాలు, జెన్–జీ రేకెత్తించిన ప్రశ్నలు, వారంటే ఇంకా కొనసాగుతున్న భయం – ఇట్లా అనేక విషయాలు ఒక్కుమ్మడిగా తుఫాను వలె కమ్ముకు రావటంతో పార్టీ అగ్రస్థాయి నాయకత్వాలు, ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి సాధారణ కార్యకర్తల వరకు ఏమి చేయాలనే స్పష్టత లేక ఉక్కిరిబిక్కిరవుతున్నారు. జెన్–జీ ఆందోళన సెప్టెంబర్ ఆరంభంలో జరిగి, మార్చిలో పార్లమెంటు ఎన్నికలకు మరో మూడు నెలలే మిగిలి ఉండగా ఇదీ పరిస్థితి.
ఒక్కో పార్టీ... ఒక్కో సమస్య
అన్నింటికన్న పెద్దది అయిన నేపాలీ కాంగ్రెస్ అధ్యక్షుడు షేర్ బహదూర్ దేవుబా తొలగిపోవాలంటూ జాతీయ కౌన్సిల్ సభ్యు లలో 54 శాతం మంది నోటీసు ఇచ్చారు. ప్రధాన కార్యదర్శి గగన్ థాపా అధ్యక్ష పదవికి నామినేషన్ వేస్తూ, దేవుబా తప్పుకోనట్లయితే పార్టీని చీల్చగలమని హెచ్చరించారు. రెండవ పెద్దది అయిన కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ (యూనిఫైడ్ ఎంఎల్) అధ్యక్షుడు, ఉద్యమ కారణంగా పదవీభ్రష్టుడైన ప్రధానమంత్రి కె.పి. ఓలీ రాజీ నామా చేయాలని పట్టుబడుతున్న అసమ్మతి వర్గం, పార్టీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి తీరాలని ఒత్తిడి చేసి ఒప్పించింది. మూడవ పెద్దది అయిన మావోయిస్ట్ సెంటర్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ప్రధాని పుష్పకమల్ దహాల్ ఉరఫ్ ప్రచండ, తనంతట తానే రాజీనామా చేసి, పార్టీని సైతం రద్దుపరచి, కొన్ని ఇతర వామ పక్షాలతో ఐక్యమై, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్‌ను ప్రారంభించారు. దానికి ఆయన సమన్వయకర్త మాత్రమే!
ఆ తర్వాతది అయిన రాష్ట్రీయ స్వతంత్ర పార్టీ (ఆర్‌ఎస్‌పీ) అధ్య క్షుడు, ప్రచండ ప్రభుత్వంలో హోంమంత్రిగా ఉండిన రాబీ లమీ ఛానే, ఒక కుంభకోణం కేసులో కోర్టు ఆదేశాలపై అరెస్టయి ఇటీవలే జైలుకు వెళ్లారు. తన పార్టీ స్తబ్ధతలో ఉంది. ప్రచండ తర్వాతి స్థానంలో ఉండి ప్రధానిగా కూడా పనిచేసి, తర్వాత నయాశక్తి పార్టీ ప్రారంభించిన జెఎన్‌యూ (ఢిల్లీ) పూర్వ విద్యార్థి, రాచరికం పతనం తర్వాత ప్రజాస్వామిక రాజ్యాంగ రచనకు ఆధ్వర్యం వహించిన డా‘‘ బాబూరాం భట్టరాయ్, తమ పార్టీని రద్దు చేసి, మరికొందరితో కలిసి ప్రగతిశీల్ లోక్ తాంత్రిక్ పార్టీని నెలకొల్పారు.
దానికి ఆయన ‘పార్టీ పేట్రన్’ మాత్రమే! రాచరికం తిరిగి రావాలి, లేదా కానిస్టిట్యూషనల్ మోనార్కీ కావాలనే హిందూవాద రాష్ట్రీయ ప్రజా తంత్ర పార్టీ (ఆర్‌పీపీ)లో నాయకత్వ సమస్యలైతే తలెత్తలేదుగానీ, జెన్–జీ ఉద్యమ కారణంగా తెలిసీ తెలియని సవాళ్లు ఏవి ఎదురు కాగలవోనన్న అయోమయం వారిని ఆవరించింది.
జెన్–జీ నేర్పిన పాఠాలేమిటి?
ఇదంతా నాయకత్వాలు, పార్టీ నిర్మాణాల పరిస్థితి కాగా, ఎన్నికల సమయానికి మరిన్ని పార్టీలు, లేదా ఇప్పటికే గల పార్టీలలో మరిన్ని చీలికలు, పునరేకీకరణలు, ఐక్య సంఘటనల ఆవిర్భావం జరిగినా ఆశ్చర్యపడనక్కర లేదు. వాస్తవానికి ఎన్నికలలో పోటీ చేయదలచుకునే పార్టీల రిజిస్ట్రేషన్ తొలి గడువు ముగిసినప్పటికీ, ఎన్నికల కమిషన్ ఆ గడువును పొడిగిస్తున్నది. ఇందుకు సంబంధించి ముఖ్యమైన విషయం, జెన్–జీ గ్రూపులు కొన్నికొన్ని కలిసి ఇప్పటికే మూడు పార్టీలను ప్రారంభించాయి. మరి రెండింటి కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. జెన్–జీలంతా కలిసి ఒకే పార్టీగా ఏర్పడక పోవటం పట్ల ప్రజలలో తగినంత నిరాశ కనిపిస్తున్నది.
ఆందోళన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అన్నింటికన్న ముఖ్య మైన విషయాలు కొన్నున్నాయి. యువతరం ఆగ్రహం, ఆందోళన రాజకీయ పార్టీలకు ఇచ్చిన షాక్ ఎంత తీవ్రమైనది? దానినిబట్టి వారు తమ సిద్ధాంతాలు, విధానాలు, వ్యక్తిగత వ్యవహరణలలోని లోపాలను చిత్తశుద్ధితో గుర్తించి సమీక్షించుకున్నారా? లేక కొంత కాలానికి అంతా సమసిపోయి పాత పద్ధతులలో వ్యవహారాలు సాగించవచ్చుననుకుంటున్నారా? ఇటువంటి ప్రశ్నలు తటస్థులైన పరిశీలకులకు తోచటం అట్లుంచి, నేపాల్ సామాజికుల నుంచి కూడా విన్న నేను, వివిధ పార్టీల నాయకులను కలిసినపుడు, ప్రశ్నలు వేసి వారి ఆలోచనలను గ్రహించేందుకు ప్రయత్నించాను.
వారి సమాధానాలను బట్టి, మిశ్రమాభిప్రాయాలు కలిగాయి. వాస్తవానికి యువతరం లేవనెత్తిన విషయాల తీవ్రత, రెండు రోజుల పాటు అగ్నిపర్వతం వలె బద్దలైన నిరసనల తీవ్రతలను బట్టి పార్టీ లలో మిశ్రమాభిప్రాయాలకు ఆస్కారం ఉండకూడదు. కానీ, కనిపించిందేమిటి? కొందరు నిజంగానే తమ వైఫల్యాలను గుర్తించారు. మావోయిస్టుల సాయుధ ఉద్యమం ఫలితంగా రాచరిక వ్యవస్థ 2008లో రద్దయి, పూర్తి స్థాయిలో ఆధునిక పార్లమెంటరీ ప్రజా స్వామ్య వ్యవస్థ, కొత్త రాజ్యాంగం ఉనికిలోకి వచ్చినప్పటి నుంచి గత 17 సంవత్సరాలుగా పరిపాలనలు సవ్యంగా సాగి ఉంటే, ఈ రోజున జెన్–జీకి గానీ, ప్రజలకు గానీ ఇంతటి అసంతృప్తికి అవ కాశం ఉండేది కాదని ఈ వర్గం అరమరికలు లేకుండా అంగీకరించింది.
అవినీతి పోవటం, సమర్థమైన పారదర్శక పాలన, సామాజిక న్యాయంతో కూడిన వేగవంతమైన అభివృద్ధి అనే మూడు తప్పని సరి అనీ, అది జరగాలన్నదే జెన్–జీ తమకు నేర్పిన పాఠమనీ ఈ వర్గం అభిప్రాయపడుతున్నది. వేర్వేరు పార్టీలకు చెందిన వేర్వేరు నాయకుల మాటలు వేరైనా, వారి నుంచి సారాంశం ఇదే!
అదే మొండి ధోరణి
ఇందుకు భిన్నమైన పరిస్థితి కూడా మరొకవైపు గమనించాను. వారు, 2008 నుంచి అభివృద్ధి తగినంత చేశామని లెక్కలు చెప్తు న్నారు. ఆ లెక్కలు నిజమే అయినా సమస్య ఏమంటే, 2008 తర్వాత ప్రజల ఆకాంక్షలకు, చదువులూ, నైపుణ్యాలూ గణనీయంగా పెరుగు తున్న యువతరం అవసరాలకు, నిజాయితీగా పరిపాలిస్తే సాధించ గలిగిన వాటికి పొంతన కుదరటం లేదు.
ఇది చాలదన్నట్లు మావోయిస్టులు, ఇతర కమ్యూనిస్టులు సహా అన్ని పార్టీల విచ్చలవిడి అవి నీతి! ఈ రెండవ వర్గం ప్రచారం, జెన్–జీ ఆందోళన వెనుక విదేశీ ఎన్జీఓలు ఉన్నాయని! తమకు గల పార్టీ యంత్రాంగం, డబ్బు బలంతో తిరిగి అధికారానికి రాగలమన్నది వీరి నమ్మకం. ఆందోళ నల వల్ల అధికారం కోల్పోయిన మాజీ ప్రధాని ఓలీ ఈ ధోరణికి ప్రతినిధి కావటం విశేషం. ఆయన నేర రికార్డు గల వ్యక్తి ఆధ్వర్యాన ప్రైవేట్ సైన్యం ఒకటి తయారు చేసి పెట్టుకున్నారు.
ప్రజల వైపు నుంచి చూసినపుడు, ఇటీవల జరిగిన ఒక ఒపీనియన్ పోల్‌లో ఏ ఒక్క నాయకునికీ 10 శాతానికి మించిన ఓట్లు రాలేదు. మార్చి ఎన్నికలలో ఏమయేదీ ఎవరికీ అర్థం కాకుండా ఉంది. 2008 నుంచి 17 సంవత్సరాలలో 14 ప్రభుత్వాలు మారిన తీవ్ర అస్థిరతల రికార్డు ఇప్పటికే ఉండగా, రాగల కాలంలో ఏమి జరగవచ్చునో ఊహించటం కూడా కష్టమే.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


