దీర్ఘకాలంగా సుప్తావస్థలో ఉన్న ఇథియోపియా ఉత్తర ప్రాంతంలోని హేలీ గబ్బి అగ్నిపర్వతం అసాధారణ రీతిలో బద్దలైన ఘటన అనూహ్యంగా ఆందోళనలోకి నెట్టింది. పేలుడుతో అత్యంత భారీగా రేగిన ధూళి మేఘాలు ఎర్ర సముద్రం మీదుగా యెమన్, ఒమన్ సహా చివరకు పాకిస్తాన్ ఉత్తర ప్రాంతం నుంచి భారతదేశం వైపు కమ్ముకొస్తూ ఉండడం మన ఆందోళనకు కారణం. ఎదుట ఉన్నదేదీ కనిపించనివ్వని ఆ భారీ దుమ్ము ధూళి ఏకంగా కొన్ని వందల కిలో మీటర్లు ప్రయాణించి వివిధ ఖండాలకు విస్తరించింది. ఇప్పటికే భారత్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సహా అనేక దేశాల విమాన ప్రయాణ సర్వీసులకు చిక్కులు తెచ్చింది.
ఏం జరిగింది?
ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు ఈశాన్యాన 800 కి.మీల దూరంలో అఫార్ ప్రాంతంలో ఉందీ హేలీ గబ్బి అగ్నిపర్వతం. ముఖ్యంగా భూ ఉపరితలంపై కదిలే పెద్ద శిలల పొరల మీద ఉంది. తూర్పు ఆఫ్రికన్ రిఫ్ట్ జోన్ కిందకొచ్చే ఆ ప్రాంతంలో అటు ఆఫ్రికన్, ఇటు అరేబియన్ భూ ఫలకాలు ఘర్షించుకుంటూ, ఏటా 0.4 నుంచి 0.6 అంగుళాల మేర పరస్పర వ్యతిరేక దిశలో కదులుతుంటాయి. 12 వేల ఏళ్ళుగా గమ్మునున్నట్టు తోచిన సదరు వాల్కనో ఈ నవంబర్ 23న విస్ఫోటనం చెంది, అనేక గంటలు నిప్పులు విరజిమ్మింది. ఆ ఘటనలో ఎవరూ మరణించలేదు కానీ, ఆ ప్రాంత ప్రజలు, జీవజాలంపై సుదీర్ఘ ప్రభావం ఉండనుంది.
ముందస్తు హెచ్చరికలు లేవా?
ఇథియోపియాలో దాదాపు 50 అగ్నిపర్వతాలున్నాయి. వాటిలో అనేకం కొన్ని వేల ఏళ్ళుగా నిద్రాణంగా ఉన్నాయి. నిజానికి, ఈ జూలైలోనే దగ్గరలోని ఎర్తా ఆలె అగ్నిపర్వతం బద్దలైంది. భూగర్భంలో 30 కిలోమీటర్ల కింద అంతశ్శిలాద్రవం చొచ్చుకుపో యింది. భూగర్భ కదలికలతో హేలీ గబ్బి సైతం విస్ఫోటనం చెందే ప్రమాదం ఉందని సూచనలు అందాయి. గత ఆదివారం అదే జరిగింది.
భారీ శబ్దంతో అగ్నిపర్వతం పేలినప్పుడు 14 కి.మీ.ల మేర ఆకాశంలోకి ధూళి మేఘాలు విస్తరించాయి. పర్వతాలంత ఎత్తున గగన భాగాన్ని కప్పేసిన ఆ బూడిద పర్యాటక ప్రాంతాలైన చుట్టుపక్కలి పర్వతప్రాంత గ్రామాలను చుట్టేసింది. దట్టమైన పొగ, గాఢాంధకారంతో గాలి పీల్చడానికైనా లేదు. తాజా ఘటనను బట్టి ఆ అగ్ని పర్వత ప్రాంతం గురించి లోతైన అధ్యయనం జర గనే లేదనీ, ఆ లోటు పూరించాల్సి ఉందనీ తేలింది.
ఎంత కష్టం... ఎంత నష్టం...
అగ్నిపర్వత భస్మ మేఘాల్లో కరకైన కణాలుంటాయి. లక్షల టన్నుల ఆ కణాలు లోపలికి చొచ్చుకుపోయి విమానాల ఇంజన్లను చెడగొడతాయి. విమానయానం ప్రమాదకరమవుతుంది. 1982లో బ్రిటీష్ ఎయిర్‌వేస్ విమానం ఇలానే భస్మ మేఘం గుండా వెళ్ళి 4 ఇంజన్లూ ఆగిపోయాయి. కష్టపడి పావుగంటలో పైలట్లు 3 ఇంజన్లను పునరుద్ధరించేసరికి జనం బతికిపోయారు.
మునుపు 2010లో ఐస్‌ల్యాండ్‌లో ఓ అగ్నిపర్వతం కొద్ది నెలలు నిరంతరం విస్ఫోటనం చెంది, 11 కి.మీ.ల మేర బూడిదను విరజిమ్మింది. బ్రిటన్, ఇతర యూరోపియన్ దేశాలను ఈ భస్మ మేఘాలు తాకాయి. బ్రిటన్ 6 రోజులు వైమానిక మార్గాన్ని మూసేయాల్సి వచ్చింది. 95 వేల విమా నాలు రద్దయ్యాయి. యూరప్‌లో అనేక దేశాలు గగన తలాన్ని మూసేశాయి. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత అతి పెద్ద వైమానిక షట్‌డౌన్ అదే! రోజూ 12 లక్షల మంది ప్రయాణికులు చిక్కుకుపోయారు. బ్రిటన్ 145 కోట్ల డాలర్లు నష్టపోయింది.
గతిని మార్చేసిన గతం...
అగ్నిపర్వత విస్ఫోటనాలంటే ఆషామాషీ కాదు. అవి మానవాళి చరిత్రనే మార్చేసిన ఘట్టాలున్నాయి. 1783 నాటి లకీ విస్ఫోటనంతో యూరప్‌లో వాన రాకడే మారింది. ఫ్రాన్స్‌లో ఆకలి మంటలు రేగి, ఫ్రెంచ్ విప్లవానికి దారి తీసింది. ఆ తర్వాత మూడు దశాబ్దాలకు ఇండొనేసియాలోని తంబోరాలో విస్ఫో టనం యూరప్‌లో ఎడతెగని వానలు సహా కొన్నేళ్ళు ప్రపంచ పర్యావరణాన్నే మార్చేసింది. వర్షంతో చిత్తడిగా మారిన నేల వల్లే వాటర్‌లూ యుద్ధంలో నెపోలియన్ ఓటమి పాలయ్యారట.
ఏమైనా, ఇప్పుడు హేలీ గబ్బి దెబ్బకు ఆఫ్రికాలోని అతి పెద్ద వైమానిక కేంద్రాల్లో ఒకటైన ఇథియో పియా సహా అనేక ఖండాల్లో విమాన సర్వీసులు ఇరుకున పడ్డాయి. 4 వేల కి.మీ.ల దూరంలో ఉన్న రాజస్థాన్, మహారాష్ట్ర, ఢిల్లీ, హరియాణా, పంజాబ్‌లకు ఈ ధూమం విస్తరించింది. విమాన సర్వీసులు అనేకం రద్దయ్యాయి. కొద్ది రోజుల్లో ఈ ధూళి తగ్గినా, ఆ మేఘాల్లోని హానికారక వాయువులతో జాగ్రత్త పడక తప్పదు.


