మాధవ్ శింగరాజు
ఇష్టమైన ప్రయాణాలకు, ఇష్టమైన మనుషుల్ని కలవటానికి సాకులు వెతుక్కోవడం బాగుంటుంది. బలంగా లేని సాకులు మనల్ని దొంగలా పట్టివ్వటం మరింత బాగుంటుంది. ‘‘స్కూల్‌కి ఎందుకు వెళ్లనంటున్నావ్ అమ్మూ బాబూ’’ అని అడిగేవారట అమ్మ, నా చిన్నప్పుడు. ‘‘నాకు తెలీదు. నువ్వే చెప్పమ్మా’’ అనేవాడినట నేను... అమ్మ ఒడిలోకి దూకేస్తూ! ‘‘దొంగ...’’ అని అమ్మ ఒకటే నవ్వట! జనవరి 16 మధ్యాహ్నం 12 గంటలకు విచారణకు హాజరు కావాలని ఈసీ నుంచి నాకు నోటీసు! బెంగాల్ వెళ్లేందుకు వెతుక్కో నక్కర్లేని ఒక సాకు దొరకటం నా 92 ఏళ్ల వయసును ఉత్సాహపరిచే సంగతే!
ఇండియా వెళ్లినప్పుడు, శాంతి నికేతన్ లో నేనుండే నా పూర్వీకుల నివాసానికి పొరుగునే ఉంటాడు నా కజిన్ శాంతాభాను సేన్ ! ఇండియా పొరుగున బంగ్లాదేశ్ ఉండటం నాకెంత సంతోషమో, శాంతాభాను నా పొరుగున ఉండటం నాకంత సంతోషం. మనసుకు నచ్చినవాళ్లు, మనం చెయ్యెత్తితే చూసి పలకరింపుగా నవ్వేంత దూరంలో ఉండటం ఎంత సంపద, ఎంత ఆరోగ్యం మనిషికి! ఈసీ అధికారులు నాకు ఇవ్వవలసిన నోటీసును, నేను అక్కడ లేనందువల్ల శాంతాభాను చేతికి అందజేసి వెళ్లారట.
85 ఏళ్లు దాటినవారు విచారణ కోసం ఈసీ ఆఫీసుకు వెళ్లనవసరం లేదనీ, ఈసీనే ఆ వయసు దాటినవారి ఇంటికి వెళ్లాలనీ నిబంధన. అలాగైతే విచారణ కోసం ఈసీ అధికారులు ప్రస్తుతం కేంబ్రిడ్జ్‌లో నేను ఉంటున్న ఇంటికి రావాలి. కొన్ని లాజిక్‌లు అంతదూరం రాలేవు. కొంత దూరం మాత్రమే వచ్చి ఆగిపోతాయి. బెంగాల్ ఓటర్ల రికార్డులలో అమ్మకు, నాకు మధ్య ఏజ్ డిఫరెన్ ్స 15 ఏళ్ల కంటే తక్కువ ఉందనీ, అదెలా సాధ్యమో లాజిక్‌కి అందటం లేదనీ ఈసీ!
బెంగాల్లో ఓటర్ల జాబితాను గట్టిగా సవరిస్తున్నారు. ఆ సవరణల్లో ఈ ‘లాజికల్ డిస్క్రిపెన్సీ’ బయట పడిందట! రెండు నెలల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు. నిజానికీ, అమ్మకూ నాకూ మధ్య 19 సంవత్సరాలకు పైగా వ్యత్యాసం ఉంది. ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్‌ను చూపిస్తే నా ఓటు ఉంటుంది. నేను బెంగాల్ వెళ్లి, ఓటేయొచ్చు. రికార్డులలో ఏది ఫీడ్ అవుతుందో, ఆ ఫీడ్ అయిందే లాజిక్కు. రికార్డులను దాటుకుని లాజిక్కులు బయటికి రాలేవు. ‘‘సేన్! మీరు లాజికల్‌గా ఆలోచించటం లేదు, పేదలు... పేదలు అంటూ ఆర్థికశాస్త్రాన్ని కారుణ్యంతో నింపి, ‘మదర్ థెరెసా ఆఫ్ ఎకనామిక్స్’లా తయారవుతున్నారు’’ అంటుంటారు నా తోటి ఎకనమిస్టులు.
ఆర్థికశాస్త్రం కఠినంగానే ఉండాలి. కానీ, ఆర్థికశాస్త్రానికి మనసెందుకు ఉండకూడదు? లాజిక్ తప్పిపోతుందనా?
‘‘నేను స్కూలుకు వెళ్లను’’ అని, ఆఖరి నిమిషంలో స్కూల్ బాక్స్‌ను పక్కన పెట్టేసి, అమ్మ ఒడిలోకి దూకేసినప్పుడు అమ్మ నన్ను తన కడుపులోకి కూడదీసుకుని నా బుగ్గపై ముద్దు పెట్టడం నాకు గుర్తుంది. స్కూలు కఠినంగా ఉంటుందని, అమ్మ కూడా కఠినంగానే ఉండాలా? పేదల విషయంలో ఆర్థికశాస్త్రం కూడా అమ్మలానే ఉండాలంటాను నేను. ఆర్థికశాస్త్రం మాత్రమే కాదు, ఓటర్ల విషయంలో ఈసీ కూడా!
ఓటర్ల జాబితాను సవరిస్తున్నప్పుడు ‘జీవించే ఉన్నారా?’ అని చూస్తున్న ఈసీ, ఎవరెక్కడ జీవిస్తూ ఉన్నా ప్రాణాలు మాత్రం ఇక్కడే కదా ఉంటాయి అన్నది కూడా ఆలోచించాలి. కేంబ్రిడ్జిలో ఉంటున్నంత మాత్రాన, బెంగాల్‌లో లేనట్లు కాదు. నాకైతే, విచారణ సాకుతో హార్వర్డ్ క్యాంపస్‌లోని ‘ఆర్నాల్డ్ ఆర్బోరెటమ్’ పూలతోటల నుంచి వీచే తీపి సువాసనలను ఓ నాలుగు రోజులు సెలవడిగి, బెంగాల్ వెళదామనే ఉంది!


