అభిప్రాయం
‘ప్రాంతేతరుడు మోసం చేస్తే,ప్రాంతం పొలిమేరల వరకూ తరిమి కొడతాం. ప్రాంతం వాడే మోసం చేస్తే, ప్రాంతం లోపలే పాతిపెడతాం’ అంటూ ఎలుగెత్తి చాటిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు గారి స్ఫూర్తిదాయకమైన మాటలు... రాయలసీమ సమాజం చెవుల్లో మార్మోగుతున్నాయి. అంతేకాదు, రాయలసీమ ప్రాంతంలో పుట్టి, పెరిగి, రాజకీయంగా అంచెలంచెలుగా ఎదిగి, పాలకుడిగా ఇప్పుడా ప్రాంతానికే ద్రోహం తలపెట్టిన చంద్ర బాబును ఏం చేయాలో అనే అంతర్మథనంలోనూ రాయలసీమ ఉంది.
దశాబ్దాలుగా రాయలసీమ ప్రాంతాన్ని జలగలా పట్టి పీడిస్తున్న కరవు రక్కసిని పారదోలాలనే దివంగత ప్రియతమ నేత, తన తండ్రి వైఎస్సార్ ఆశయాన్ని, ఆకాంక్షను నెరవేర్చడానికి మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ‘రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్’కు 2020 మే 5న శ్రీకారం చుట్టారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా చెన్నైకి 15 టీఎంసీల నీటితో పాటు కరవు ప్రాంతమైన రాయల సీమలో 9.6 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని లక్ష్యం నిర్దేశించుకోవడం వైఎస్ జగన్ గొప్ప ఆశయానికి నిదర్శనం.
అప్పుడే పూర్తయ్యేది!
శ్రీశైలం ప్రాజెక్ట్‌లో 800 అడుగుల నుంచి రోజుకు 3 టీఎంసీలు చొప్పున పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ దిగువన కుడి ప్రధాన కాలువలోకి నీటిని ఎత్తిపోసేలా రూ. 3,825 కోట్ల ఖర్చుతో ప్రాజెక్ట్‌కు రూపకల్పన చేశారు. మొదటి దశలో పనులు చేపట్టాలని 2023 ఆగస్టు 11న అప్పటి వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. అయితే లోకం సుభిక్షంగా ఉండేందుకు దేవతలు యజ్ఞాలు చేస్తుంటే, రాక్షసులు విఘ్నాలు కలిగించిన చందంగా... రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లకుండా నాడు ప్రతిపక్ష నాయకుడైన చంద్రబాబు నాయుడు తన మనుషుల ద్వారా ఎన్జీటీలో పిటిషన్ వేయించి, అడ్డు తగిలారు. అయితే మహాభారతంలో అర్జునుడి లక్ష్యం చెట్టుపై ఉన్న పక్షి కన్నుపై తప్ప, కొమ్మలపై కానట్టుగా... పార్థుడి లాంటి వైఎస్ జగన్ దృష్టి ప్రాజెక్ట్ పనులపై మాత్రమే ఉండింది. అందుకే చంద్రబాబు సృష్టించిన ఆటంకాలను లెక్క చేయకుండా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల్ని శరవేగంగా కొనసాగించేందుకు చర్యలు తీసుకున్నారు.
వైఎస్ జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వం 2024 ఎన్నికల తర్వాత కొనసాగి ఉంటే, ఈ పాటికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పూర్తయి, రాయలసీమంతా సస్యశ్యామలం అయ్యేది. కరవు పీడిత ప్రాంత రైతాంగం జీవన రూపురేఖలే పూర్తిగా మారిపోయేవి. కానీ రాయలసీమతో పాటు ఆంధ్రప్రదేశ్ సమాజంలో వెలుగులు నింపే వైఎస్ జగన్ పరిపాలనా దీపాన్ని... అబద్ధాలు, విష ప్రచారం ద్వారా కూటమి కొండెక్కించేసింది. తద్వారా వైఎస్ జగన్ కంటే, ఎక్కువగా తామే నష్టపోవాల్సి వస్తోందని ఆంధ్రప్రదేశ్ సమాజం ఆవేదన చెందుతోందన్నది ముమ్మాటికీ నిజం.
మాతృగడ్డకే ద్రోహమా?
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబునాయుడి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ఏర్పడటం ద్వారా... మొదటి బాధిత ప్రాంతంగా రాయలసీమ రికార్డులకెక్కింది. రాయలసీమ వాసిగా, ఆ ప్రాంతా నికి తీరని ద్రోహం చేసిన పాలకుడిగా సమాజం అతడిపై మండి పడుతోంది. రాజకీయ ప్రత్యర్థి అయిన మా నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు మాలాంటి నాయకులపై ‘చంద్రబాబు అండ్ కో’కు కోపం ఉండొచ్చు. ఒకవేళ మాపై కోపాన్ని తీర్చుకోవాలంటే అధికారాన్ని యథేచ్ఛగా వాడుకోవచ్చు. ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు మాకున్నాయి.
కానీ కరవు ప్రాంతంపై చంద్రబాబు ప్రతాపం ఎందుకో అర్థం కావడం లేదు. అధికారాన్ని తాను పుట్టిన ప్రాంతానికి ద్రోహం తలపెట్టడానికి దుర్వినియోగం చేయడం ఎంత మాత్రం క్షమార్హం కాదు. బహుశా దేశ చరిత్రలో మరే నాయకుడూ తనకు రాజకీయ, అధికార భిక్షమేసిన మాతృగడ్డకు చంద్రబాబు మాదిరిగా వెన్ను పోటు పొడిచి ఉండరంటే అతిశయోక్తి కాదు. పిల్లనిచ్చిన మామకే చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని ఇంతకాలం ఆయనపై మచ్చ ఉంది. ఇప్పుడు దానికంటే మించిన మచ్చ, అప్రతిష్ఠ చంద్రబాబుకు దక్కాయి.
నిత్యం కరవు కాటకాలతో అల్లాడుతున్న రైతాంగం జీవితాలను మార్చేందుకు, కృష్ణా నీళ్లతో బీడు భూముల్ని తడిపేందుకు భగీ రథుడిలా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి యజ్ఞం తలపెట్టగా, రాక్షసుడి మాదిరిగా చంద్రబాబు ఆటంకాలు సృష్టించారు. తన రాజకీయ శిష్యుడైన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరిన వెంటనే, తన అబ్బ సొత్తు అన్నట్టుగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పనుల్ని అర్ధంతరంగా ఆపివేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచి పనులు చేయడానికి మాత్రమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమికి అధికారం కట్టబెట్టారు. అంతే తప్ప, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కోరినట్టు నడుచుకోవడా నికి కాదని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.
కాళోజీ చెప్పినట్టు...
రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనుల నిలిపివేతతో, ఇవాళ కరవు పీడిత ప్రాంతం తీవ్రంగా నష్టపోతోంది. మళ్లీ వలసలు తప్పడం లేదు. మరోవైపు ఉపాధి హామీ పథకానికి కూడా కోరలు కట్ చేసిన పరిస్థితి. రాయలసీమ ప్రాంతంపై చంద్రబాబుకు ఎందుకంత కక్ష? గత ఎన్నికల్లో అత్యధిక ఎమ్మెల్యే స్థానాల్ని కూటమికే కట్టబెడితే, రిటర్న్ గిఫ్ట్‌గా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను లేకుండా చేస్తారా? ఇదెక్కడి అన్యాయం? ఈ దుర్మార్గానికి ఏం పేరు పెడితే సరిపోతుందో విజ్ఞులైన రాయలసీమ ప్రజలు ఆలోచించాలి.
రాయలసీమ ప్రాంతం నీళ్ల కోసం అలమటిస్తోంది. అందుకే దివంగత వైఎస్సార్ హయాంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు అప్పట్లో పెంచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 80 వేల క్యూసెక్కులకు పెంచి, రాయలసీమ ప్రాంత కరవు పారదోలడానికి పనుల్ని వేగవంతం చేశారు. ఇదీ రాయలసీమను కరవు రక్కసి నుంచి తరిమికొట్టడానికి జగన్ నిబద్ధత.
చంద్రబాబు మాత్రం... తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఏనాడూ రాయలసీమ కరవును పారదోలాలని ఆలోచించలేదు. కానీ వైఎస్ జగన్ తీర్చిదిద్దిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ను మాత్రం తన రాజకీయ శిష్యుడైన రేవంత్ రెడ్డి కోసం లిఫ్ట్ చేయ డానికి అత్యుత్సాహం ప్రదర్శించారు. అందుకే చంద్రబాబును రాయలసీమ పాలిట పీడకుడని చెప్పడం! తమ ప్రాంతానికి మిత్రులెవరో, శత్రువులెవరో ప్రజలకు రేవంత్ రెడ్డి మాటలతో స్పష్టమైంది. సొంత ప్రాంతం వాడే ద్రోహం చేస్తే, ఏం చేయాలో మహాకవి కాళోజీ మాటల్ని స్ఫూర్తిగా తీసుకుని నిర్ణయించుకోవా ల్సింది రాయలసీమ సమాజమే!
భూమన కరుణాకర రెడ్డి
వ్యాసకర్త తిరుపతి మాజీ ఎమ్మెల్యే


