చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
ఆర్థిక క్రమశిక్షణ, స్థిరత్వంపై తీవ్ర ఆందోళన
అప్పులు తప్ప అభివృద్ధి లేదు.. ఏడాదిలోనే భారీగా అప్పులు
చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వెచ్చించ లేదు
రోజు వారీ ఖర్చులకూ అప్పులతో పెరిగిన వడ్డీ భారం
ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు మించి రెవెన్యూ, ద్రవ్య లోటు
రెవెన్యూ లోటు ఏకంగా 3.75%.. ద్రవ్యలోటు 5.05 శాతం
2024–25 ఒక్క ఏడాదిలోనే రూ.81,071 కోట్ల అప్పులు
2024–25 మార్చి నాటికి బడ్జెట్ అప్పు రూ.5.67 లక్షల కోట్లు
అంతకుముందు ఆర్థిక ఏడాది కన్నా అప్పులు 16.68% పెరుగుదల
బడ్జెట్ వెలుపల అప్పులను వెల్లడించని రాష్ట్ర ప్రభుత్వం
2024–25 ఆర్థిక, ద్రవ్య వినియోగ అకౌంట్స్‌పై కాగ్ నివేదికను అసెంబ్లీకి సమర్పించిన సర్కారు
సాక్షి, అమరావతి : చంద్రబాబు ఏడాది పాలనలో ప్రస్తుత అభివృద్ధి దేవుడెరుగు, భవిష్యత్ అభివృద్ధిని కూడా శూన్యం చేశారని, ఆర్థిక క్రమ శిక్షణ, ఆర్థిక స్థిరత్వం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) నివేదిక పేర్కొంది. భవిష్యత్ అభివృద్ధికి చోటు లేకుండా ఏడాదిలోనే భారీగా అప్పులు చేశారని తూర్పారపట్టింది. 2024–25 ఆర్థిక ఏడాది ఆర్థిక, ద్రవ్య వినియోగ అకౌంట్స్‌పై కాగ్ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీకి సమర్పించింది. అప్పులు తప్ప అభివృద్ధి లేదని, చేసిన అప్పులను ఆస్తుల కల్పనకు వినియోగించలేదని కాగ్ నివేదిక స్పష్టం చేసింది.
అప్పు చేయకుండా రోజు గడవడం లేదని, రోజువారీ ఖర్చులకు అప్పులు చేశారని, దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని ఎండగట్టింది. ద్రవ్య జవాబుదారీ బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) నిబంధనలను తొలి ఏడాదిలోనే చంద్రబాబు సర్కారు తుంగలో తొక్కిందని, నిబంధనలకు మించి రెవెన్యూ లోటు, ద్రవ్యలోటు పెరిగి పోయిందని ఎత్తి చూపింది.
భారీగా అప్పు చేసినప్పటికీ మూల ధన వ్యయం తగ్గిపోయిందని, ఇది రుణ స్థిరత్వాన్ని మరింత దిగజార్చడంతో పాటు భవిష్యత్ అభివృద్ధికి ఆర్థిక అవకాశాన్ని తీవ్రంగా పరిమితం చేసిందని కాగ్ పేర్కొంది. అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 2024–25 ఆర్థిక ఏడాదిలో మూల ధన వ్యయం 12 శాతం తగ్గిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తగ్గిన ప్రాధాన్యతను సూచిస్తోందని వెల్లడించింది.
రోజువారీ అవసరాలకూ అప్పులే ఆధారం
» మూల ధన వ్యయం నుంచి రెవెన్యూ వ్యయం వైపు నిరంతరం మార్పు ఉందని, ఆఖరుకు రోజువారీ అవసరాలకు కూడా అప్పులపై ఆధార పడటం పెరిగిందని, ఇది ఆర్థిక క్రమ శిక్షణ, దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వంపై తీవ్రమైన ఆందోళన కలిగిస్తోందని కాగ్ వ్యాఖ్యానించింది.
» 2024–25లో చేసిన అప్పులు అంతకు ముందు ఆర్థిక ఏడాదితో పోల్చితే 16.68 శాతం పెరిగినట్లు కాగ్ పేర్కొంది. ఇది అప్పులపై ఆధారపడటం పెరగడాన్ని ప్రతిబింబిస్తోందని తెలిపింది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే అప్పుల శాతం పెరిగినప్పటికీ, మూల ధన వ్యయం అంతకు ముందు ఏడాదితో పోల్చితే 12 శాతం తగ్గిపోయిందని, ఇది దీర్ఘకాలిక ఆస్తుల సృష్టిపై తీవ్ర ప్రభావం చూపుతోందని చెప్పింది.
» 2024–25లో ప్రభుత్వ రెవెన్యూ లోటు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు జీఎస్‌డీపీలతో 2.7 శాతం ఉండాల్సి ఉండగా, 3.75 శాతానికి పెరిగిందని, అలాగే ప్రభుత్వ ద్రవ్య లోటు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు జీఎస్‌డీపీలో 4 శాతం ఉండాల్సి ఉండగా.. 5.05 శాతానికి పెరిగిందని పేర్కొంది.
» 2024–25లో మొత్తం అప్పు రూ.81,071 కోట్లు చేసినట్లు కాగ్ తెలిపింది. దీంతో వడ్డీ భారం గణనీయంగా పెరిగిందని స్పష్టం చేసింది. 2024–25 మార్చి నాటికి బడ్జెట్ అప్పులు రూ.5.67లక్షల కోట్లకు పెరిగాయని పేర్కొంది.
» రాష్ట్ర ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వడం ద్వారా మార్కెట్, ఆర్థిక సంస్థలు, వివిధ కార్పొరేషన్లు, సహకార సంఘాల ద్వారా నేరుగా అప్పులు చేస్తోందని కాగ్ పేర్కొంది. ఆ సంస్థలు రుణాలు చెల్లించడంలో విఫలమైన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వమే అసలు, వడ్డీ చెల్లించాల్సి వస్తుందని చెప్పింది. ఈ అప్పులు రాష్ట్ర బడ్జెట్ వెలుపల అప్పులుగా అంచనా వేసినట్లు తెలిపింది.
» ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదిత ఆఫ్–బడ్జెట్ అప్పులు మొత్తంతో పాటు వాటిని ఎక్కడి నుంచి తీసుకుంటున్నారనే విషయాన్ని వెల్లడించలేదని కాగ్ ఎత్తి చూపింది. అయితే 2024–25లో ఎటువంటి ఆఫ్–బడ్జెట్ బాధ్యతలను పొందలేదని, కేవలం 2025 మార్చి 31 నాటికి రూ.27,241 కోట్లు బకాయి ఉందని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి, ఆర్థిక మంత్రిత్వ శాఖకు తెలియజేసిందని పేర్కొంది.
» 2024–25లో వోచర్ల పరిశీలన ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌ను రూపొందించి, ఆఫ్ బడ్జెట్ రుణాల కారణంగా సహాయం, గ్రాంట్ల కోసం రూ.7,240.57 కోట్ల మొత్తాన్ని ఖర్చు చేసిందని, అయితే దీన్ని నిర్ధారించాలని తాము రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినట్లు కాగ్ నివేదికలో పేర్కొంది.

నిబంధనలు తప్పుగా వర్గీకరింపు
రాష్ట్ర ఆర్థిక అంశాలపై చట్టబద్ధమైన నిబంధనలను తప్పుగా వర్గీకరించడం, పాటించకపోవడంతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపిందని కాగ్ పేర్కొంది. రెవెన్యూ వ్యయం రూ.3,375.60 కోట్లు తక్కువగా, మూలధన వ్యయం రూ.2,648.92 కోట్లు అధికంగా, నగదు నిల్వ రూ.95.70 కోట్లు తక్కువగా అంచనా వేసినట్లు స్పష్టం చేసింది. పారదర్శకత, జవాబుదారీతనం లేకుండా నిబంధనలను, షరతులను పాటించకుండా 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.5,005.31 కోట్ల రుణాలను హడ్కోకు, రాష్ట్ర ఆర్థిక సర్వీసు కార్పొరేషన్‌కు పంపిణీ చేసినట్లు కాగ్ తప్పు పట్టింది.


