ప్రపంచ దేశాలన్నీ జనవరి ఒకటిన 2026 కొత్త ఏడాదికి స్వాగతం పలికితే ఒక దేశం మాత్రం ఇంకా 2018 సంవత్సరంలోనే కొనసాగుతోంది! అదే ఆఫ్రికా దేశమైన ఇథియోపియా. ఒక దేశం ఇంకా భూతకాలంలోనే ఉండటమేంటని ఆశ్చర్యపోతున్నారా? ప్రపంచవ్యాప్తంగా గ్రెగేరియన్ కేలండర్ విస్తృతంగా వాడకంలో ఉండగా ఇథియోపియా మాత్రం శతాబ్దాల నాటి సౌర కేలండర్ ‘గీజ్’ను అనుసరిస్తుండటమే ఈ మిస్టరీకి కారణం.
ప్రాచీన ఈజిప్టు కాప్టిక్ కేలండర్ ఆధారంగా ఇథియోపియా కేలండర్ (Ethiopia Calendar) అయిన గీజ్ రూపొందింది. గ్రెగేరియన్ కేలండర్‌తో పోలిస్తే గీజ్ కేలండర్ 7–8 ఏళ్లు వెనుకబడి ఉంటుంది. ఏసుక్రీస్తు జన్మ సంవత్సర లెక్కల్లో తేడాల వల్ల ఈ అంతరం ఏర్పడింది. గ్రెగేరియన్ కేలండర్‌ను యూరొప్ 1582లో వాడుకలోకి తెచ్చుకొనేటప్పుడు దియోనిసియస్ ఎక్సిగస్ అనే సాధువు ఏసుక్రీస్తు పుట్టుక గురించి వేసిన లెక్కలపై ఆధారపడింది. ఈ లెక్కల ప్రకారం అది తొలి సంవత్సరం అయింది. కానీ అదే సమయంలో ఇథియోపియా, ఈజిప్టులోని చర్చీలు మాత్రం అలెగ్జాండ్రియన్ క్రైస్తవ లెక్కలను అనుసరించాయి.
వాటి ప్రకారం క్రీస్తు పుట్టుక కొన్నేళ్ల తర్వాత జరిగింది. అందుకే ప్రపంచ దేశాలతో పోలిస్తే ఇథియోపియా ఇంకా 2018లోనే కొనసాగుతోంది. పైగా గీజ్ కేలండర్‌లో 12కు బదులు 13 నెలలు ఉంటాయి. 30 రోజుల చొప్పున 12 నెలలతోపాటు 13వ నెలలో ఐదు రోజులు (లీప్ ఇయర్‌లో ఆరు రోజులు) ఉంటాయి. పైగా ఇథియోపియా నూతన సంవత్సరం (New Year) మిగతా దేశాల్లోలాగా జనవరితో ప్రారంభం కాదు.. అది సెపె్టంబర్ నెలతో మొదలవుతుంది. ఈ లెక్కన మనకు 2025 సెప్టెంబర్ నాటికి ఇథియోపియా 2018 సెపె్టంబర్‌లో నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిందన్నమాట.
– సాక్షి, సెంట్రల్ డెస్క్
చదవండి: బంగారం పేపర్లతో భగవద్గీత!


