మధ్య వయస్కుల సంఖ్యే అధికం కావడం విశేషం
న్యూ ఇయర్ డిస్కౌంట్ ఆఫర్లు కూడా కారణమే
కొత్త తీర్మానాల ఫలితంగా పెరిగిన సబ్ర్‌స్కిప్షన్‌లు
ఆరంభ శూరత్వంగా మారకూడదంటున్న ట్రైనర్లు
నగరంలోని జిమ్స్‌లో ఆరోగ్యార్థుల సందడి
ఎప్పటి మాదిరిగానే కొత్త ఏడాది సందర్భంగా ఆరోగ్యార్థుల తీర్మానాల ఫలితంగా నగరంలోని జిమ్ సబ్‌స్క్రిప్షన్లు రికార్డు స్థాయిలో పెరిగాయి. దీంతో జిమ్ములు కసరత్తులు చేసే వారితో కళకళలాడాయి. నగరంతో పాటు దేశవ్యాప్తంగా ఇదే ట్రెండ్ ఉన్నట్లు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. దేశవ్యాప్తంగా గత యేడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో 14% జిమ్ సభ్యత్వాలు పెరిగాయని, నగరంలోనూ అదే పరిస్థితి కనిపిస్తోందని పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. ఇక గత డిసెంబర్‌తో పోలిస్తే 20–25% పెరుగుదల కనిపించినట్లు తెలుస్తోంది. న్యూ ఇయర్ తీర్మానాలతో పాటు భారీ డిస్కౌంట్ ఆఫర్లు కూడా దీనికి కారణమని స్పష్టమవుతోంది. – సాక్షి, సిటీబ్యూరో
కొత్త సంవత్సరం ఆరోగ్యార్థులతో జిమ్స్ కళకళలాడాయి. ముఖ్యంగా మధ్య వయసు్కల సందడి అధికంగా కనిపించింది. న్యూ ఇయర్ తీర్మానాల్లో భాగంగా రికార్డు స్థాయిలో కొత్త సభ్యత్వాలు నమోదుకాగా.. దీనికి న్యూ ఇయర్ డిస్కౌంట్లు, ఆఫర్లు కూడా కారణమేనని తెలుస్తోంది. అయితే ఎప్పటి మాదిరిగానే మొదటి నెలలోనో.. లేదా రెండు నెలల తర్వాతనో వదిలేస్తే.. అది ఆరంభ శూరత్వంగా మారుతుందని ట్రైనర్లు చెబుతున్నారు. ఒక్కసారిగా భారీ స్థాయిలో కసరత్తులు చేసి.. ఆ వెంటనే వదిలేయడం సరికాదని, రోజుకు కొంత సమయం అనుకుని ఆ మేరకు క్రమంగా పెంచుకుంటూ వెళితే మంచి ఫలితాలు సాధించవచ్చని ట్రైనర్లు సూచిస్తున్నారు.
తీర్మానాల ఫలం.. జిమ్‌కు బలం..
సాధారణ బరువు తగ్గించే లక్ష్యాలు మొదలుకుని.. పలు రకాల వ్యాధులకు చికిత్సగా వ్యాయామాలను సూచిస్తున్నారు నిపుణులు.. దీంతో ముందస్తు నివారణే ముఖ్యమనే ఆలోచనతో అనేక మంది జిమ్స్‌లో చేరుతున్నట్లు ట్రైనర్లు చెబుతున్నారు. నిశ్చల ఆధునిక జీవనశైలి కారణంగానే అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయనే అవగాహన అనేక మందిలో కలుగు తుండడంతో వాయిదా వేస్తూ వచి్చన వ్యాయామ కార్యాచరణను కొత్త ఏడాది సందర్భంగా అమలులోకి తీసుకొచ్చారు. జనవరి నెలలో యేటా ఈ పెరుగుదల ఉంటుందనేది ముందే తెలుసు కాబట్టి, పేరొందిన బ్రాండెడ్ జిమ్స్.. సభ్యత్వ రుసుములపై 30 నుంచి 50 శాతం వరకూ డిస్కౌంట్స్ ప్రకటించడం ఈ సారి మరింత ఊపుని అందించింది.

ఇంట్లోనే వర్కవుట్స్..
‘ఇంట్లోనే వ్యాయామం చేయాలని, హోమ్ జిమ్స్ ఏర్పాటు చేసుకోవాలని ఆశించే వారి సంఖ్య కూడా ఈ సారి భారీగానే పెరిగింది. ఇంట్లోనే వర్కవుట్ చేసుకునేందుకు వీలైన పరికరాలను ఎంచుకునే వారు పెరగడంతో మేము ‘గెట్ ఫిట్ డేస్’ పేరిట ప్రత్యేక విభాగాన్ని ప్రారంభించాం’ అంటూ ఆన్‌లైన్ విపణి అమెజాన్ బజార్ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఈ మేరకు డిసెంబర్ నెలాఖరులో భారీగా జిమ్ ఎక్విప్‌మెంట్ అమ్ముడుపోయినట్లు వివరించారు.
మధ్య వయసువారే అధికం..
ఈ ఏడాది కొత్తగా జిమ్స్ సభ్యత్వాలు తీసుకున్నవారిలో మధ్య వయస్కులు అధికంగా ఉండడం విశేషం అని నగరంలోని ఓ జిమ్ నిర్వాహకులు త్రినేత్ర తెలిపారు. తాము అందుకున్న సభ్యత్వాల్లో దాదాపు 54 శాతం మిడిల్ ఏజ్డ్ వాళ్లవే కాగా 40 శాతం యువత, మిగిలిన వారు ఉన్నారని, యువతుల సంఖ్య కూడా భారీగానే పెరిగిందని ఆయన వివరించారు. డయాబెటిస్, బీపీ తదితర దీర్ఘకాలిక వ్యాధుల నియంత్రణ కోసం మందులపై ఆధారపడే పరిస్థితిని తగ్గించే శక్తి వ్యాయామానికి ఉందనే అవగాహన పెరగడమే దీనికి కారణమని వ్యాయామ శిక్షకుడు విజయ్ గంధం తెలిపారు.
చదవండి: కర్ణాటకలో అద్భుతం : ఇది ‘మామూలు చిరుత’ కాదు
స్లో.. స్టడీ.. విన్..
అయితే సభ్యత్వ రుసుములు చెల్లించి జిమ్‌లో, ఫిట్‌నెస్ స్టూడియోల్లో చేరినంత సులభంగా వ్యాయామాన్ని క్రమబద్ధంగా కొనసాగించడం కష్టమని ప్రముఖ సెలబ్రిటీ ట్రైనర్ కరణ్ చెబుతున్నారు. జనవరిలో పెరిగినట్టు కనిపించిన సభ్యత్వాల సంఖ్య కేవలం ఫిబ్రవరి కల్లా 20 శాతానికి అలాగే మార్చి నెల వచ్చే సరికి 35 శాతానికి పైగా తగ్గిపోతున్నట్లు పాత గణాంకాలు వెల్లడిస్తున్నాయన్నారు. కాబట్టి త్వరిత ఫలితాల కోసం ఆధారపడకుండా, సహేతుకమైన లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. కొత్తగా వ్యాయామం ప్రారంభించినప్పుడు వచ్చే ఒళ్లునొప్పులు, శారీరక సమస్యల విషయంలో గాభరా పడకుండా నిత్యం శిక్షకులు, వైద్యుల సూచనలను అనుసరిస్తూ ఫిట్‌నెస్ రొటీన్ కొనసాగించాలని, అదే విధంగా డైట్‌లోనూ తగిన మార్పులు, చేర్పులు చేసుకోవాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: రూ. 25 వేలకే అమ్మాయిలు : మంత్రి భర్త వ్యాఖ్యలు వీడియో వైరల్


