రెండేళ్లు గడవకుండానే రాష్ట్ర ప్రజలపై రూ.3 లక్షల కోట్ల అప్పుల భారం
సాక్షి, అమరావతి: సంక్షేమ క్యాలండర్‌కు బదులుగా చంద్రబాబు సర్కారు అప్పుల క్యాలండర్ అమలు చేస్తోంది. వారం వారం అప్పుల మోత మోగిస్తూ రాష్ట్రాన్ని రుణాంధ్రప్రదేశ్‌గా మార్చేసింది. అధికారంలోకి వస్తే సంపద సృష్టిస్తానంటూ ఎన్నికల ముందు నమ్మబలికిన చంద్రబాబు అందినకాడికి అప్పులు చేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. బడ్జెట్ బయట, లోపల.. రాజధాని.. వివిధ కార్పొరేషన్లు.. చివరకు గనులు, మద్యం ఆదాయాన్ని సైతం తాకట్టు పెట్టి అప్పులు చేస్తూ చంద్రబాబు తన రికార్డులను తానే అధిగమిస్తున్నారు. తాజాగా మంగళవారం 7.64 శాతం వడ్డీతో చంద్రబాబు ప్రభుత్వం మరో రూ.6,500 కోట్లు అప్పులు చేసింది. గత మంగళవారమే రూ.4,000 కోట్లు అప్పులు చేసిన చంద్రబాబు సర్కారు వారం తిరగక ముందే మళ్లీ అప్పు చేయడం గమనార్హం.
వారం వ్యవధిలో ఏకంగా రూ.10,500 కోట్లు అప్పులు చేయడం ద్వారా చంద్రబాబు సర్కారు రికార్డు సృష్టించింది. కేవలం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే రూ,1,01,540 కోట్లు బడ్జెట్ అప్పులు చేస్తోంది. రాష్ట్ర చరిత్రలో ఒక ఆర్థిక ఏడాదిలో రూ. లక్ష కోట్లకు పైగా బడ్జెట్ అప్పులు చేయడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆ ఘనత చంద్రబాబు ప్రభుత్వానికే దక్కుతుందని ఆర్థిక రంగ నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే బడ్జెట్‌లో రూ.90,540 కోట్లు అప్పులు చేయగా, మరో రెండు నెలల్లో మరో రూ.11,000 కోట్లు అప్పు చేసేందుకు చంద్రబాబు సర్కారు ఆర్‌బీఐకి అప్పుల క్యాలెండర్ ఇచి్చంది. ఇలా చంద్రబాబు రెండేళ్ల పాలన పూర్తి కాకుండానే బడ్జెట్ లోపల, బడ్జెట్ బయట కలిపి ఏకంగా దాదాపు రూ.3 లక్షల కోట్లు అప్పులు చేయడం గమనార్హం.
సంపద సృష్టి లేదు.. అంతా ప్రైవేట్ పరం!
చంద్రబాబు అధికారంలోకి వచి్చన నాటి నుంచి ఇప్పటి వరకు బడ్జెట్ లోపలే చేసిన అప్పులు రూ.1,72,137 కోట్లకు ఎగబాకాయి. ఇక బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్లు, రాజధాని పేరుతో మరో రూ.1,27,632 కోట్లు అప్పులు చేశారు. వివిధ కార్పొరేషన్ల పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో చంద్రబాబు ప్రభుత్వం రూ.రూ.80,245 కోట్లు అప్పులు చేసింది. మరోపక్క రాజధాని పేరుతో ప్రపంచ బ్యాంకు, జర్మనీ సంస్ధ, హడ్కో, నేషనల్ బ్యాంక్ ఫర్ ఫైనాన్సింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్‌మెంట్ (ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ), ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీపీఎఫ్‌సీఎల్), నాబార్డు నుంచి ఏకంగా రూ.47,387 కోట్లు అప్పులు చేసింది. ఇష్టానుసారంగా అప్పులు చేస్తున్నప్పటికీ సూపర్ సిక్స్‌లో ప్రధాన హామీలను సైతం అమలు చేయకుండా ఎగనామం పెట్టారు.
పోనీ తీసుకున్న అప్పులతో ఆస్తుల కల్పన చేపట్టారా? అంటే అదీ లేదు. పైగా వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో 17 మెడికల్ కాలేజీలకు శ్రీకారం చుట్టి విలువైన సంపద సృష్టిస్తే .. ఇప్పుడు వాటిని చంద్రబాబు సర్కారు ప్రైవేట్‌పరం చేస్తోంది. గత ప్రభుత్వ హయాంలో సృష్టించిన సంపదను సైతం చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో పెడుతోంది. వైఎస్సార్ సీపీ హయాంలో విచ్చలవిడిగా అప్పులు చేస్తున్నారని, రాష్ట్రం శ్రీలంకలా అయిపోతోందని దుష్ప్రచారం చేసిన ఎల్లో మీడియా.. ఇప్పుడు చంద్రబాబు సర్కారు వారం వారం ఇష్టారాజ్యంగా అప్పులతో దేశంలోనే రికార్డులు సృష్టిస్తున్నా నోరు మెదపకపోవటం గమనార్హం.
బాబు సర్కారు బడ్జెట్ అప్పులు..
2024-25 మార్చి వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పులు రూ.81,597 కోట్లు
2025-26 నవంబర్ వరకు కాగ్ గణాంకాల మేరకు అప్పులు రూ.77,040 కోట్లు
డిసెంబర్ 2వ తేదీ (ఆర్‌బీఐ) రూ.3,000 కోట్లు
డిసెంబర్ 30వ తేదీ (ఆర్‌బీఐ) రూ.4,000 కోట్లు
జనవరి 6వ తేదీ (ఆర్‌బీఐ) రూ.6,500 కోట్లు
మొత్తం రూ.1,72,137కోట్లు

బడ్జెట్ బయట వివిధ కార్పొరేషన్ల ద్వారా అప్పులు..
పౌరసరఫరాల సంస్థ రూ.7,000 కోట్లు
మార్క్‌ఫెడ్ రూ.19,900 కోట్లు
ఏపీఎండీసీ రూ.9,000 కోట్లు
ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.6,710 కోట్లు
బ్యాంకుల నుంచి విద్యుత్ సంస్ధల అప్పులు రూ.1150 కోట్లు
ఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ రూ.1,000 కోట్లు
ఏపీ జలజీవన్ మిషన్ కార్పొరేషన్ రూ.10,000 కోట్లు
ఏపీఐఐసీ ద్వారా రూ.8,500 కోట్లు
ఏపీసీపీడీసీఎల్, ఏపీఎస్‌పీడీసీఎల్ ద్వారా రూ.5,473 కోట్లు
నాబార్డు నుంచి డిస్కమ్స్ రూ.3,762 కోట్లు
ఎస్‌బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ రూ.2,000 కోట్లు
ఆంధ్రప్రదేశ్ బెవరేజెస్ కార్పొరేషన్ (బాండ్లు) రూ.5,750 కోట్లు
మొత్తం రూ.80,245 కోట్లు
అమరావతి అప్పులు
ప్రపంచ బ్యాంకు, ఏసియన్ డెవలప్‌మెంట్ బ్యాంకు రూ.15,000 కోట్లు
హడ్కో రూ.11,000 కోట్లు
జర్మనీకి చెందిన కేఎఫ్‌డబ్యూ సంస్థ రూ.5,000 కోట్లు
ఎన్‌ఏబీఎఫ్‌ఐడీ నుంచి రూ.7,500 కోట్లు
ఏపీపీఎఫ్‌సీఎల్ నుంచి రూ.1,500 కోట్లు
నాబార్డు నుంచి రూ.7,387 కోట్లు
మొత్తం రూ.47,387 కోట్లు


