అభిప్రాయం
రాయలసీమ ప్రాంతం దశాబ్దాలుగా సాగు, తాగునీటి కోసం ఎదురుచూస్తున్న తరుణంలో, రాయలసీమ ఎత్తిపోతల పథకం ఒక ఆశాదీపం అయ్యింది. అయితే ఇటీవల తెలంగాణ శాసనసభలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాను ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో సంప్రదింపులు జరిపి ఈ పథకాన్ని నిలిపివేయించానని ప్రకటించడం, సీమ ప్రాజెక్టులను అక్రమమైనవిగా అభివర్ణించడం తీవ్ర చర్చలకు దారితీసింది. ఈ నేపథ్యంలో, రాయలసీమ నీటి హక్కుల వెనుక ఉన్న భౌగోళిక, సాంకేతిక వాస్తవాలను నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది.
కేటాయింపులుండీ వాడుకోలేక...
రాయలసీమ దాహార్తిని తీర్చే క్రమంలో గాలేరు–నగరి, హంద్రీ –నీవా, హెచ్‌ఎల్సీ, ఎల్‌ఎల్‌సీ, ఎస్సార్‌బీసీ, గుండ్రేవుల, గండికోట, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వంటి నిర్మాణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ ప్రాజెక్టులకు కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి దాదాపు 144.7 టీఎంసీల నికర జలాల కేటాయింపులు చట్టబద్ధంగా ఉన్నాయి. అయితే, క్షేత్రస్థాయిలో పరిస్థితి అత్యంత దయ నీయంగా ఉంది. ప్రస్తుతం సీమలో అందుబాటులో ఉన్న మౌలిక సదుపాయాల సామర్థ్యం 100 టీఎంసీల కంటే తక్కువగానే ఉంది. సరైన కాల్వల వ్యవస్థ లేకపోవడం వల్ల ఏటా కేవలం 50 నుంచి 60 టీఎంసీల నీటిని మాత్రమే వినియోగించుకోగలుగుతున్నారు. అంటే, తమకు దక్కాల్సిన వాటాలో సగం కూడా వాడుకోలేక పోతున్న ఈ ప్రాంతంపై ‘జల దోపిడీ’ చేస్తున్నారనే నిందలు వేయడం అత్యంత విచారకరం.
రాయలసీమ ప్రాజెక్టులకు జీవనాధారమైన పోతిరెడ్డిపాడు, మల్యాల, ముచ్చుమర్రి వంటి మలుపులకు శ్రీశైలం రిజర్వాయర్ ప్రధాన వనరు. గతంలో శ్రీశైలం నీటి నిల్వ సామర్థ్యం 315 టీఎంసీలుగా ఉండేది. కానీ తీవ్రమైన పూడిక పేరుకుపోవడం వల్ల అది ప్రస్తుతం 200 టీఎంసీల లోపుకు పడిపోయింది. దీనికి అదనంగా, తెలుగు రాష్ట్రాల్లో నిబంధనలకు విరుద్ధంగా కేవలం విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని ఖాళీ చేయడం వల్ల జలాశయం మట్టం వేగంగా తగ్గిపోతోంది. ఒకప్పుడు నెలల తరబడి వచ్చే కృష్ణా, తుంగభద్రల ప్రవాహాలు ఇప్పుడు కేవలం కొన్ని వారాలకే పరిమితమవు తున్నాయి. పోతిరెడ్డిపాడు నుంచి నీటిని మళ్లించాలంటే శ్రీశైలంలో కనీసం 854 అడుగుల మట్టం ఉండాలి. పూడిక, విద్యుత్ అవసరాల కారణంగా ఈ మట్టం నిర్వహించడం అసాధ్యంగా మారుతోంది, ఫలితంగా వరద జలాల మీద ఆధారపడిన గాలేరు–నగరి, హంద్రీ– నీవా వంటి ప్రాజెక్టులకు గండం ఏర్పడుతోంది.
పథకం ఆవశ్యకత
వరద సమయంలో కృష్ణా నది నుంచి సుమారు 700–800 టీఎంసీల నీరు ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలోకి వృథాగా వెళ్తోంది. శ్రీశైలం నుంచి నీటిని తీసుకోవడానికి ఉన్న పరిమితులను అధిగమించేందుకు, కేవలం వారం పది రోజులు మాత్రమే లభించే వరద సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలనే లక్ష్యంతో గత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పథకానికి రూపకల్పన చేసింది. ఈ ప్రాజెక్టు ద్వారా రోజుకు 3 టీఎంసీల చొప్పున నీటిని తరలించడం సాధ్యమవుతుంది.
ముచ్చుమర్రి వంటి ఎత్తిపోతల కేంద్రాలకు అనేక సాంకేతిక పరిమితులు ఉన్నాయి. ముచ్చుమర్రి నుంచి నాలుగు రోజులు నిరంతరాయంగా నీటిని తోడితే కానీ ఒక టీఎంసీ నీరు రాదు. 40 టీఎంసీల లక్ష్యంతో నిర్మించిన హంద్రీ–నీవాకు ఇది ఏమాత్రం సరిపోదు. అలాగే మల్యాల నుంచి నీటిని తీసుకోవాలంటే కనీసం 842 అడుగుల మట్టం అవసరం. ఈ సమస్యలన్నింటికీ పరిష్కారంగానే 800 అడుగుల మట్టం నుంచే నీటిని తీసుకునేలా ‘రాయలసీమ ఎత్తిపోతల పథకా’న్ని రూపొందించారు.
తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే 800 అడుగుల కంటే తక్కువ మట్టం నుంచి నీటిని లిఫ్ట్ చేసే పథకాలను నిర్మించుకుంది. అటువంటప్పుడు, ఆంధ్రప్రదేశ్ తన చట్టబద్ధమైన వాటాను వినియోగించు కోవడానికి 800 అడుగుల వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేసు కోవడం ఏమాత్రం అక్రమం కాదు. కృష్ణా నదిలో వరద ప్రవాహం ఉండి, నీరు సముద్రంలో కలిసే సమయంలో ఆ నీటిని తీసుకోవడం వల్ల ఎవరికీ నష్టం ఉండదు. అది ఏపీ ప్రాథమిక హక్కు కూడా!
శాశ్వత పరిష్కారం
రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తయితే అది గాలేరు నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు వెన్నెముకగా మారుతుంది. పోతి రెడ్డిపాడు ద్వారా ఎస్సార్‌బీసీకి 19 టీఎంసీలు, తెలుగుగంగకు 15 టీఎంసీల కేటాయింపులు ఉన్నాయి. గత ప్రభుత్వ హయాంలో గండికోట, చిత్రావతి రిజర్వాయర్ల ముంపు సమస్యలను పరిష్కరించి, అక్కడ 35 టీఎంసీల నీటిని నిల్వ చేసే వెసులుబాటు కల్పించారు. ఈ ఎత్తిపోతల పథకాన్ని అనంతపురం జిల్లాలోని హంద్రీ–నీవాతో అనుసంధానం చేస్తే, చిత్తూరు జిల్లాలోని మదన పల్లి డివిజన్ నుంచి కుప్పం వరకు గాలేరు–నగరి నీటిని సరఫరా చేసే అద్భుత అవకాశం కలుగుతుంది. ఇది రాయలసీమ కరవు ప్రాంతాలకు శాశ్వత పరిష్కారంగా మారుతుంది.
ఈ పథకానికి అనుమతులు సాధించడం అసాధ్యమైన పని కాదు. సీడబ్ల్యూసీ నియమించిన కమిటీలు ఒక కీలకమైన సిఫార్సు చేశాయి: డ్యామ్ భద్రతకు ముప్పు ఉన్నప్పుడు లేదా పూడిక వల్ల నిల్వ సామర్థ్యం తగ్గినప్పుడు, ఆ లోటును భర్తీ చేయడానికి ఎగువన నీటి నిల్వ ఏర్పాట్లు చేసుకోవచ్చు. శ్రీశైలం సామర్థ్యం 315 టీఎంసీల నుంచి 200 టీఎంసీలకు తగ్గిపోయిన వాస్తవాన్ని ప్రభుత్వం సమర్థంగా వాదించాలి. శ్రీశైలం భద్రతను, తగ్గిపోయిన నిల్వ సామర్థ్యాన్ని సాధికారిక సంస్థల ముందు నిరూపించగలిగితే, రాయలసీమ ఎత్తిపోతల పథకంతో పాటు సిద్ధేశ్వరం అలుగు వంటి ప్రాజెక్టులకు అనుమతులు సాధించడం సులభమవుతుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు ఆంధ్రప్రదేశ్ ప్రయోజ నాలకు విఘాతం కలిగించేలా ఉన్నాయి. ఏపీ ప్రభుత్వ పెద్దలు అప్రమత్తంగా వ్యవహరించాలి. గత ప్రభుత్వం అనుమతులు లేకుండా పనులు చేసిందనే నెపంతో ప్రాజెక్టు అవసరాన్ని తక్కువ చేసి మాట్లాడటం తెలంగాణ వాదనకు ఆయుధంగా మారుతుంది. రాజకీయ విభేదాలను పక్కన పెట్టి, ఈ పథకానికి మిగిలి ఉన్న అనుమతులను తీసుకురావడానికి, పెండింగ్‌లో ఉన్న కొద్దిపాటి పనులను పూర్తి చేయడానికి ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలి.
శ్రీశైలం ఎగువ భాగం నుంచి నీటిని తీసుకోవడం సీమ ప్రజల ప్రాథమిక హక్కు అని జాతీయ వేదికలపై గట్టిగా వినిపించాలి. ‘రాయలసీమ ఎత్తిపోతల పథకం’ కేవలం ఒక ఇంజినీరింగ్ నిర్మాణం కాదు, అది సీమ రైతాంగం ఆత్మగౌరవ ప్రతీక. ఈ పథకం కార్యరూపం దాల్చితేనే వెనుకబడిన ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుంది.
మాకిరెడ్డి పురుషోత్తమ రెడ్డి
వ్యాసకర్త రాయలసీమ మేధావుల ఫోరం సమన్వయకర్త


