అభిప్రాయం
ఆంగ్ల నూతన సంవత్సర ఆరంభ వేళ యావత్ భారతా వని సిగ్గుతో తలదించు కోవాల్సిన దృశ్యాలు దేశ వ్యాప్తంగా ఆవిష్కృతమయ్యాయి. దేశ రాజధాని ఢిల్లీ మొదలుకొని హైదరాబాద్, విజయవాడ వరకు నగరాలన్నీ ఒకే రకమైన అనాగరిక ప్రవర్తనకు వేదికలయ్యాయి. ఫుల్లుగా మద్యం సేవించిన మందుబాబులు రోడ్లపై వేసిన వీరంగం చూస్తే వెనుకబడిన దేశాల్లో కూడా ఇలాంటి వికృత చేష్టలు ఉండవేమోనన్న భావన కలుగుతుంది. పీకల దాకా తాగి తామేమి చేస్తున్నామో కనీస స్పృహ లేకుండా ఫుట్‌పాత్‌లపై పడిపోవడం, వాంతులు చేసుకోవడం, శాంతిభద్రతలు పరిరక్షించే పోలీసులతో వాగ్వాదానికి దిగడం వంటి దృశ్యాలు వీక్షకులకు తీవ్ర ఇబ్బంది కలిగించాయి.
కొత్త సంవత్సరాన్ని ఆహ్వానించడం అంటే కేవలం మద్యం, గంజాయి, ఇతర మత్తు పదార్థాల్లో మునిగి పోవడమేనా? దేశంలోని 29 రాష్ట్రాల గణాంకాలను పరిశీలిస్తే, డిసెంబర్ 31న జరిగిన మద్యం అమ్మకాల్లో తెలంగాణ ప్రథమ స్థానంలో నిలవగా, ఆంధ్రప్రదేశ్ ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది. డిసెంబర్ 30 నుంచి జనవరి 1 వరకు కేవలం మూడు రోజుల్లోనే తెలంగాణలో రూ. 1,671 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. ఇందులో గ్రేటర్ హైదరాబాద్ వాటానే అత్యధికం. ఒక నిమిషానికి తెలంగాణలో 95 బాటిళ్లు, ఆంధ్రప్రదేశ్‌లో 93 బాటిళ్ల చొప్పున అమ్ముడయ్యాయంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పెట్టుబడుల ఆకర్షణలో పోటీ పడాల్సిన రాష్ట్రాలు, మద్యం అమ్మకాల్లో పోటీ పడటం శోచనీయం.
యువత భవితవ్యం ప్రశ్నార్థకం
మద్యం అలవాటు క్రమంగా గంజాయి, ఇతర ప్రమాదకర మత్తుపదార్థాల వైపు మళ్లుతోంది. విదేశీ వికృత సంస్కృతికి అద్దం పట్టే రేవ్ పార్టీలు ఇప్పుడు నగరాల శివార్లలోని ఫామ్‌హౌస్‌లలో గుట్టుచప్పుడు కాకుండా సాగిపోతున్నాయి. పోలీసులు దాడులు చేసి కేసులు పెడుతున్నా, డ్రగ్స్ మహమ్మారిని అరికట్టడం సాధ్యం కావడం లేదు. కేవలం మద్యం తాగడానికే పరిమితం కాకుండా, యువత మాదక ద్రవ్యాల చీకటి వ్యాపారంలో కూరుకుపోతోంది. అంతర్జాతీయ ముఠాల ప్రమేయంతో సరిహద్దులు దాటి మత్తు పదార్థాలు దేశంలోకి దిగుమతి అవుతున్నాయి.
మరీ దారుణమైన విషయం ఏమిటంటే, స్కూల్ పిల్లలు ఇష్టంగా తినే చాక్లెట్లలో కూడా మత్తు పదార్థాలు కలిపి విక్రయిస్తున్నట్లు నిఘా వర్గాలు వెల్లడించాయి. భావి భారత పౌరులుగా ఎదగాల్సిన విద్యార్థులు పాఠశాల స్థాయిలోనే ఇలాంటి వ్యసనాలకు బానిసలైతే దేశ భవిష్యత్తు ఏమవుతుంది? తమ కష్టార్జితాన్ని పిల్లల చదువుల కోసం వెచ్చిస్తున్న తల్లిదండ్రులకు తమ బిడ్డలు మత్తులో జోగుతున్నారని తెలిస్తే వారి గుండెలు పగిలిపోవా?
మాదక ద్రవ్యాల సరఫరాను అడ్డుకోవడానికి అత్యాధునిక సాంకేతికత, సుశిక్షితులైన పోలీసు యంత్రాంగం అవసరం. కానీ అనేక రాష్ట్రాల్లో అటువంటి ప్రత్యేక నియంత్రణ వ్యవస్థలు లోపించాయి. పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాల్లో వ్యవసాయం ముసు గులో గంజాయి సాగు చేస్తూ, దేశ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేసే కుట్రలు జరుగుతున్నాయి. మానవ వనరులను నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా సాగుతున్న ఈ అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాల్సిన అవసరం ఉంది.
ప్రభుత్వాల ద్వంద్వ ప్రమాణాలు
మరోవైపు ప్రభుత్వాల ద్వంద్వ నీతి కూడా విమర్శలకు తావిస్తోంది. మాదక ద్రవ్యాల వినియో గానికి వ్యతిరేకంగా ర్యాలీలు, అవగాహన కార్యక్ర మాలు నిర్వహిస్తున్న ప్రభుత్వాలు, మద్యం అమ్మకాల ద్వారా వచ్చే ఆదాయం కోసం ఎందుకు పాకులాడు తున్నాయి? మద్యం కూడా ఒక మత్తు పదార్థమే కదా! దానివల్ల కలిగే అనర్థాల గురించి ఎందుకు ప్రచారం చేయడం లేదు? ఆదాయం కోసం ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టడం ఏ రకమైన అభివృద్ధి?
మత్తు పదార్థాల ద్వారా వచ్చే ఆదాయాన్ని రాబడిగా పరిగణించకూడదని భారత రాజ్యాంగం స్పష్టం చేస్తోంది. మద్యపానం మనిషి శారీరక, నైతిక, మేధాపరమైన పతనానికి దారితీస్తుందని మహాత్మాగాంధీ ఎప్పుడో హెచ్చరించారు. గాంధీ పుట్టిన గుజరాత్‌లో మద్యపాన నిషేధం అమలులో ఉన్నప్పటికీ, దేశంలోని మిగిలిన ప్రాంతాల్లో మద్యం ఏరులై పారుతోంది.
ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న మద్యంలో పదో వంతు భారతదేశంలోనే వినియోగం అవుతున్నట్లు ‘లాన్‌సెట్’ నివేదికలు చెబుతున్నాయి. కల్తీ సారా, గుడుంబా వంటి ప్రాణాంతక పదార్థాల వల్ల ఎంతో మంది అకాల మృత్యువాత పడుతున్నారు. మద్యం తయారీ పరిశ్రమ శీఘ్రగతిన అభివృద్ధి చెందుతోందని ‘అసోసియేషన్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ’ వెల్లడించడం దేశ ఆరోగ్య స్థితిగతులకు అద్దం పడుతోంది.
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్పందించి, మత్తు ప్రవాహాన్ని అరికట్టడానికి ఉమ్మడి కార్యాచరణను రూపొందించాలి. లేనిపక్షంలో 2047 నాటికి మనం కలలుగంటున్న ‘వికసిత్ భారత్’ కాస్తా ‘మద్యపాన భారత్’గా మారే ప్రమాదం ఉంది. అభివృద్ధి అంటే కేవలం భవనాలు, పరిశ్రమలే కాదు, ఆరోగ్యవంతమైన సమాజం కూడా అని గుర్తించాలి. మన ప్రయాణం ఏ దిశగా సాగుతోందో ప్రతి ఒక్కరూ ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు


