నేపాల్‌ను అల్లకల్లోలపరచి, యావత్ ప్రపంచాన్ని ఆశ్చర్యచకితం చేసిన జెన్–జీ అగ్నిపర్వతం ఇప్పటికీ నిప్పులు చిమ్ము తూనే ఉంది. సెప్టెంబర్ తిరుగుబాటుతో పాత ప్రభుత్వం కూలిపోగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వాన్నీ, మార్చిలో జరగ నున్న పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవు తున్న రాజకీయ పార్టీలు అన్నింటినీ భయపెడుతూనే ఉంది. మావోయిస్టు పార్టీలు మొదలుకొని రాచరికపు అనుకూల మిత వాద పార్టీల వరకు అన్నీ సిద్ధాంతాల మార్పిడి, నాయకత్వాల మార్పిడి, చీలికలు, పునరేకీకరణల మార్గంలో సతమతమవు తున్నాయి. అది ‘ఉద్యమం’ కాదు!
జెన్–జీ తిరుగుబాటుకూ, ఎన్నికల తేదీ అయిన మార్చి 5కీ మధ్యకాలపు పరిస్థితి ఇది. నవంబర్ చివరలో సుమారు పన్నెండు రోజులపాటు నేపాల్‌లో గడిపి జెన్–జీ ఉద్యమకారులు, అన్ని ప్రధాన రాజకీయ పార్టీల నాయకులతో పాటు, సామాన్య ప్రజలతో కలిసి మాట్లాడిన మీదట నాకు కనిపించిన పరిస్థితి ఇది. వాస్తవానికి జెన్–జీ యువతరం బయటి ప్రపంచం అనుకుంటున్నట్లు, సాంప్ర దాయికమైన అర్థంలో ఉద్యమమేమీ సాగించలేదు. అక్కడ రాజవంశాల ఫ్యూడల్ పాలన, పేదరికం, ప్రజాస్వామ్య రాహిత్యాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు కొన్ని దశాబ్దాలుగా ఉన్నాయి.
ఫలితంగా ఏర్పడిన ఒక మోస్తరు ప్రజాస్వామ్య ప్రభుత్వాలుగానీ, వాటి వైఫ ల్యంతో సాయుధ పోరాటం సాగించి అధికారానికి వచ్చిన మావో యిస్టులు, ఇతర కమ్యూనిస్టులు గానీ దేశ సమస్యలను పరిష్కరించ లేకపోయారు. అది చాలదన్నట్లు స్వయంగా అవినీతి, అసమర్థ పాలన, నత్తనడక అభివృద్ధితో యువతరంతో పాటు మొత్తం సమాజం తీవ్ర అసంతృప్తికి గురవుతూ వచ్చింది. మావోయిస్టు పోరాటం వల్ల రాచరిక వ్యవస్థ అన్నదే ఇక లేకుండా 2008లో రద్దయి ఆధునిక పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అవతరించిన తర్వాత యువతరం, సమాజం కొత్త ప్రభుత్వాల నుంచి చాలా ఆశించాయి. ముఖ్యంగా వేర్వేరు కమ్యూనిస్టు పార్టీల ఉమ్మడి బలమే సగా నికి పైగా ఉండిన స్థితిలో! అయినప్పటికీ, ప్రజలు ఎంతగానో ఆశించిన ఈ చివరి రాజకీయ శక్తులు మూడింట రెండు వంతుల కాలం పాలించి కూడా నిరాశ పరచటం ఎండుగడ్డిపై నిప్పురవ్వ అయింది.
రాచరిక వ్యవస్థల కాలం నుంచి క్రమక్రమంగా అగ్నిపర్వతం వలె మారుతూ వచ్చిన సమాజం, కమ్యూనిస్టుల పాలనా కాలంలో మరింత లావాను కూర్చుకుని మరుగుతూ పోయింది. ఇక ఆ అగ్ని పర్వతం పేలి లావాను ఎగజిమ్మడానికి కావలసింది ఏదో ఉద్యమం కాదు. ఆ లావా కదలికలు అకస్మాత్తుగా ఒక స్థాయికి చేరటం మాత్రమే. సెప్టెంబర్‌లో సోషల్ మీడియా నిషేధంతో జరిగింది సరిగా అదే. చదువులు, నైపుణ్యాలు ఉన్నా స్థానికంగా తీవ్ర నిరు ద్యోగ సమస్యను ఎదుర్కొంటూ రోజుకు రెండు వేల మంది వరకు ఉద్యోగాన్వేషణలో విదేశాలకు వెళుతున్న యువకులు అక్కడినుంచి తమ కుటుంబాలకు డబ్బు పంపేందుకు, స్థానికంగా కూడా సెల్ ఫోన్ ఆధారంగా వివిధ వృత్తులు చేసుకుంటున్నవారిలో ఒక్కసారిగా ఆగ్రహం కట్టలు తెంచుకుంది.
మౌలికమైన మార్పు కోసం...
అయితే ఇదంతా సాంప్రదాయికమైన దృష్టి. నేపాల్‌లో జెన్–జీ ప్రస్తుత స్థితిని, దాని పాత్రను సంప్రదాయానికి భిన్నమైన రీతిలో అర్థం చేసుకోవటం అవసరం. యథాతథంగా జెన్–జీ అనే మాట 18–30 సంవత్సరాల వయసు వారికి వర్తించేది. కానీ వారి అసంతృప్తి మొత్తం సమాజానిది. ఇతర చోట్ల సాధారణంగా జరిగే యువ తరం ఉద్యమాలకు ఇది భిన్నమైన స్థితి. అదే విధంగా, నేపాల్ జెన్ –జీ డిమాండ్లు తమ నిరుద్యోగానికే పరిమితమై లేవు. తమ కుటుంబాలు, సమాజం, దేశం ఎదుర్కొంటున్న సమస్యలన్నింటి మధ్య పరస్పర సంబంధం ఉందనే గుర్తింపు వారిలో ఉంది. వామపక్షాలు సైతం భిన్నం కాకపోవటం వారిని మరింత నిరాశకు గురి చేస్తున్నది. ఈ అవాంఛనీయ లక్షణాలు లేని పార్టీలు, ప్రభుత్వాలు, పరిపాలన, కొత్త వ్యవస్థ కావాలన్నది జెన్–జీ లక్ష్యం. మరొక విధంగా చెప్పా లంటే, వారు మౌలికంగా కోరుతున్నది వ్యవస్థాగతమైన మార్పు!
ఉద్యమానంతర అయోమయం
అదే సమయంలో జెన్–జీకి సంబంధించి కొన్ని అయోమయాలు, ప్రశ్నార్థకాలు కూడా ఉన్నాయి. వారి నిరసనలు కేవలం రెండు రోజులలోనే ఉద్భవించటం, పరాకాష్ఠకు చేరటం కూడా కాకుండా కనీసం కొద్దికాలం పాటు సాగి ఉండినా పరస్పర ఏకీభా వాలతో రెండు మూడు ఐక్య వేదికలు ఏర్పడి ఉండేవి. అట్లా సాగనందువల్ల ఆ తక్షణ ఉధృతిలో దేశవ్యాప్తంగా ఎక్కడికక్కడ లెక్కలేనన్ని జెన్–జీ బృందాలు ఉనికిలోకి వచ్చాయి. రకరకాల భావజాలాలు గలవి, ఏ భావజాలం లేనివి, వేర్వేరు పెద్దాచిన్నా పార్టీలకు అనుకూ లమైనవి, దేనికీ కానివి, ప్రాంతీయమైనవి, మతాలు, కులాలు, వ్యక్తుల పరంగా ఏర్పడినవి, సమష్టి ప్రయోజనాలవి, వ్యక్తిగతంగా ఆలోచించేవి – ఇట్లా పలు విధానలైనవి తేలికగా వందకు పైగాఉంటాయి. ఇపుడు ఎన్నికలు సమీపిస్తుండగా కొన్ని బృందాలు వేర్వేరు పార్టీలతో చేరుతున్నాయి. తిరిగి రాచరికాన్ని కోరే రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీలతోనే 34 బృందాలు ఉన్నాయంటే పరిస్థితిని ఊహించవచ్చు. కొన్ని బృందాలు ఒకటై మూడు కొత్త పార్టీలు కూడా స్థాపించాయి. ఎన్నికల నాటికి ఇంకా ఏమి జరిగేదీ చెప్పలేని స్థితి.
మరొకవైపు ‘జెన్–జీ వాతావరణం’ అనదగ్గది ఒకటి స్పష్టంగా ఏర్పడి ఉంది. సుశీలా కర్కీ ప్రధానిగా ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వం నుంచి, ఆ యా పార్టీల వరకు ఎక్కడ ఏ తప్పు చేస్తు న్నట్లు కనిపించినా జెన్–జీ గ్రూపులు వెంటనే విరుచుకుపడు తున్నాయి. ఈ బృందాలు విశాల వేదికగా, ఒకే కొత్త పార్టీగా ఏర్పడి ఉంటే ఎన్నికలలో గెలిచితీరేవన్నది విస్తృతంగా గల అభిప్రాయం. అటువంటి పార్టీ ఏర్పడలేదు. ఈ బృందాలు కొత్త ఓటర్లనైతే లక్షల సంఖ్యలో చేర్పించాయి. ప్రస్తుత పార్టీలన్నీ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన స్థితిలో, జెన్–జీ ఐక్య రాజకీయ వేదిక ఏర్పడక పోవటం ప్రజలకు విచారకరంగా తోస్తున్నది. అంతిమంగా కొత్త ప్రభుత్వం ఏది ఏర్పడినా, ‘జెన్–జీ వాతా వరణం’ కొనసాగి ఆ ప్రభుత్వంపై నిఘా వేసి అదుపు చేయగలదనే ఆశాభావం అయితే వారిలో కనిపిస్తున్నది.

టంకశాల అశోక్: వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు


