వండర్ కిడ్.. నేపాల్‌లో లిటిల్ డైరెక్టర్
పిల్లలూ... మీరు సినిమా డైరెక్టర్‌ను చూసే ఉంటారు. గుబురు గడ్డం, అక్కడక్కడా నెరిసిన జుట్టు... సెట్ మీద ‘యాక్షన్....కట్’ అంటూ అరుస్తూ, అందర్నీ కంట్రోల్ చేస్తూ హడావిడిగా ఉంటాడు. మరి సినిమా అంటే అంతా డైరెక్టర్ మీదే ఆధారపడి ఉంటుంది. అందుకే అంత పెద్ద రెస్పాన్సిబిలిటీ తీసుకోవడానికి చాలా మంది జంకుతుంటారు. కానీ, మీలాంటి ఒక పిల్లాడు పూర్తిస్థాయి కమర్షియల్ సినిమాను డైరెక్ట్ చేశాడంటే నమ్ముతారా? కలలో కూడా సాధ్యపడని ఒక అసాధ్యాన్ని తన అచంచల ప్రతిభతో సుసాధ్యం చేశాడు నేపాలీ డైరెక్టర్ సౌగత్ బిస్తా (Saugat Bista).
2014లో తన ఏడేళ్ళ వయసులో ‘లవ్ యూ బాబా’ అనే నేపాలీ చిత్రాన్ని తీశాడు బిస్తా. పలికే పదాలలో కూడా స్పష్టత ఉండని వయసులో ఎంతో నేర్పుగా, తనకు సినిమా మీదున్న ప్రేమతో, షూటింగ్ సమయంలో నటీ నటులతో చక్కగా సమన్వయం చేసుకుంటూ, బిస్తా సినిమాను నడిపించిన తీరు ప్రపంచాన్ని ఆకర్షించింది. దీంతో గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్ అతన్ని Youngest Director of a Professionally Made Feature Filmగా గుర్తించింది.

చదవండి: ఇంటర్న్స్ కావాలి, నెలకు రూ. లక్ష స్టైఫండ్ : ట్విస్ట్ ఏంటంటే
నేపాలీ చిత్రాల్లో నటించే తండ్రితోపాటు అప్పుడప్పుడు షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్ళేవాడు సౌగత్. అలా డైరెక్షన్ మీద ఆసక్తి కలిగింది. రోజూ షూటింగ్ స్పాట్ కి వెళ్తూ, అక్కడ డైరెక్టర్, యాక్టర్స్, మూవీ స్క్రిప్ట్, లైటింగ్... ఇలా అన్నీ నిశితంగా గమనించి, రాత్రి కాగానే గూగుల్‌లో మూవీ మేకింగ్‌కి సంబంధించి మరిన్ని అంశాలను స్టడీ చేసేవాడు.
అంతటితో ఆగకుండా పేరుమోసిన నేపాలీ డైరెక్టర్లయిన నవాల్ నేపాలీ, దిభ్యరాజ్ శుభేది వంటి వారి దగ్గర అసిస్టెంట్ గా చేశాడు. అప్పటికి అతని వయసు అయిదు నుండి ఆరేళ్లు మాత్రమే. తన తండ్రి రాసిన మూవీ స్క్రిప్ట్‌కి డైరెక్టర్ దొరక్కపోవడంతో అతన్ని ఒప్పించి తానే డైరెక్ట్ చేశాడు బిస్తా. లవ్ యూ బాబా ఎన్నో అంతర్జాతీయ వేదికల మీద ప్రదర్శింపబడింది.
ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!


