ఆపరేషన్ సిందూర్ టైంలో పాకిస్థాన్ ఎంతగా దిగజారిపోయిందనే విషయం ఇప్పుడు వెలుగు చూసింది. ఈ ఉద్రిక్తతల్లో తలదూర్చాలని అమెరికాను బతిమాలిందని తెలుస్తోంది. అంతేకాదు.. ఈ చర్చల కోసం భారీ మొత్తంలో ఖర్చు చేసింది. అమెరికాకే చెందిన 'ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్' (FARA) ఇందుకు సంబంధించిన పూర్తి విషయాలు బయటపెట్టింది.
ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్, పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తపరిస్థితులు ఏర్పడ్డాయి. రెండు దేశాల మధ్య యుద్ధం తప్పదనే భావన నెలకొంది. ఇరు దేశాలు సంయమనం పాటించి కాల్పుల విరమణ పాటించాయి. అయితే ఈ అంశంలో తరుచుగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన నోటివాటం చూపించారు. వీరిద్దరి మధ్య యుద్ధం తానే ఆపానన్నారు. అధిక పన్నులు వేస్తానని హెచ్చరించడంతో రెండు దేశాలు వెనక్కి తగ్గాయన్నారు. అనంతరం పాక్‌ను అక్కున చేర్చుకొని ఆ దేశానికే అధిక ప్రాధాన్యత ఇస్తూ భారత్‌తో డిస్టెన్స్ మెయింటేన్ చేశారు.
అయితే తాజాగా ఈ విషయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం తెలిసింది. ఆపరేషన్ సిందూర్ అనంతరం అమెరికా మద్ధతు కోసం పాకిస్థాన్ తీవ్రంగా ప్రయత్నించిందని FARA నివేదిక తెలిపింది. అమెరికా తనకు మద్దతిచ్చేలా వ్యవహరించడానికి అనేక లాబీయింగ్ సంస్థలను రంగంలోకి దింపినట్లు ప్రచురించింది. ఈ లాబీయింగ్ సంస్థల ద్వారా పాక్ దౌత్యవేత్తలు, లాబీయిస్టులు.. అమెరికా చట్టసభల ప్రతినిధులతో పాటు పలు విభాగాల అధిపతులను, రక్షణశాఖ అధికారులను భేటీ అయ్యారని పేర్కొంది.
పాకిస్థాన్ లాబీయింగ్ కుదుర్చుకున్న ఏజెన్సీలో డొనాల్డ్ ట్రంప్‌కు సన్నిహితులైన జార్జ్ సోరియల్, కీత్ షిల్లర్ వంటి వారు ఉన్నారంది. అంతేకాకుండా పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ వాషింగ్టన్ పర్యటనను సైతం ఈ లాబీయింగ్ సంస్థలే ఏర్పాటు చేశాయని FARA తెలిపింది. ప్రధాన పత్రికలైన 'వాల్ స్ట్రీట్ జర్నల్', 'న్యూయార్క్ టైమ్స్' వంటి అంతర్జాతీయ పత్రికల్లో పాకిస్థాన్‌కు అనుకూలంగా కథనాలు వచ్చేలా మీడియా మేనేజ్‌మెంట్ చేసిందని పేర్కొంది.
దీనికోసం స్వల్పకాలంలో పాక్ ఐదు మిలియన్ డాలర్లు.. భారత్ కరెన్సీలో దాదాపు రూ. 45కోట్లు ఖర్చుచేసినట్లు ప్రచురించింది. దీంతో ట్రంప్, భారత్‌తో గ్యాప్‌కు పాక్ సంప్రదింపులు సైతం ఓ కారణమేనా అని కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సమయంలో భారత్ సైతం అమెరికాతో సంప్రదింపులు జరపడానికి ప్రయత్నించిందని 'ఫారిన్ ఏజెంట్స్ రిజిస్ట్రేషన్ యాక్ట్' ప్రచురించింది.


