భారత సంతతికి చెందిన వ్యక్తి, బెంగళూరులోని తన AI సంస్థ కోసం ఇంటర్న్స్ కావాలని ప్రకటించారు. శాన్ ఫ్రాన్సిస్కోకు చెందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్టార్టప్ సహ వ్యవస్థాపకుడు పోస్ట్ చేసిన లింక్డ్ఇన్ ప్రకటన వైరల్‌గా మారింది. 12 గంటలు పని చేయాలి, రూ. 1 లక్ష స్టైఫండ్ అంటూ , ఆయన విధించిన కొన్ని షరుతులు ఆసక్తికరంగా మారాయి.
బెంగళూరులో ఇంటర్న్స్‌గా ఎంపికైన అభ్యర్థులు 12 గంటల షిఫ్టులలో పని చేయాలి. వెంటనే విధుల్లో చేరాల్సి ఉంటుందని కూడాపేర్కొన్నాడు. ఇందుకు గాను ఎంపికైన వారికి ఇతర ప్రయోజనాలతోపాటు, నెలకు లక్ష రూపాయలు స్టైఫండ్ ఇస్తానని ప్రకటించాడు. ఇంటర్న్‌షిప్ బెంగళూరులో ఆన్-సైట్ పొజిషన్ అని, ఇంటర్న్‌లు వారానికి ఆరు రోజులు ఉదయం 11 గంటల నుండి రాత్రి 11 గంటల వరకు పని చేయాలి. పనిని బాధ్యతగా నిర్వహించాలి, తమని తాము నిరూపించుకోవాలన్న తపన, కొత్త సవాళ్లను స్వీకరించే సామర్థ్యం, కసి ఉండాలని చెప్పారు. అలాగే ఎంపికైన ఇంటర్న్‌కు భోజన భత్యం ,జిమ్ లేదా అభిరుచికి సంబంధించిన చందా, కొత్త ఉత్పత్తులను నిర్మించడంలో వ్యవస్థాపక బృందంతో నేరుగా పనిచేసే అవకాశం లభిస్తుందని చెప్పారు. అయితే ఇవన్నీ బాగానే ఉన్నా 12 గంటలు పని చేయాలనే నిబంధనపై నెటిజన్లు అభ్యంతరాలను వ్యక్తం చేశారు.
ఇది చదవండి : రైలు ఏసీ కోచ్‌లో మ్యాగీ : వీడియో వైరల్, నెటిజన్లు ఫైర్
ఉదయం 11 -రాత్రి 11 దాకా ఆఫీసులో ఉంటే జిమ్‌కెపుడు వెళ్లాలి
పోస్ట్ చేసిన కొద్దిసేపటికే దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఇంటర్న్‌ల కోసం నిర్దేశించిన పనిగంటలపై ఎక్కువ మంది స్పందించారు. ఉదయం 11– రాత్రి 11 గంటలు, పైగా 6-రోజుల పని విధానం నిబంధనలు భారతీయ స్టార్టప్ సంస్కృతిలో పెద్ద సమస్యను ప్రతిబింబిస్తుందని వ్యాఖ్యానించారు. మరోవైపు మెరుగైన ఉత్పాదకత, ఉద్యోగుల సంక్షేమం శ్రేయస్సు కోసం చాలా దేశాలు 4-రోజుల పని విధానానికి మొగ్గు చూపుతోంటే ఇది కరెక్ట్ కాదని మరికొందరు అభిప్రాయపడ్డారు. అంతేకాదు ఉదయం 11 నుంచి రాత్రి 11 దాకా ఆఫీసులో ఉంటే ఇక జిమ్‌కెపుడు వెళ్లాలి సార్ మరొకరు ప్రశ్నించడం గమనార్హం.
ఇదీ చదవండి: భారత టెకీ కష్టాలు: రూ. 70 లక్షల ఉద్యోగం పోయింది, సేవింగ్స్ కూడా!


