కృత్రిమ మేథ (ఏఐ)తో ఫ్యాక్టరీ టెక్నీషియన్లు, మెషినిస్టుల్లాంటి బ్లూకాలర్ ఉద్యోగులకు ముప్పేమీ ఉండదని, ప్రాక్టికల్ నైపుణ్యాలను వినియోగించి వారు మరింత ఆదాయం ఆర్జించేందుకు తోడ్పడే యాక్సిలరేటరుగా ఇది ఉపయోగపడుతుందని మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
ఇంటెలిజెంట్ సిస్టమ్‌లు రొటీన్ పనులను నిర్వహించడం వల్ల ప్రాక్టికల్ నైపుణ్యాలకు మరింత ప్రాధాన్యం పెరుగుతుందని, ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో ఆయన పేర్కొన్నారు. ఏఐ గురించి ఆందోళన చెందకుండా టెక్నీషియన్లు దానితో ధీమాగా కలిసి పని చేసే విధంగా మార్పులు వస్తాయని వివరించారు. దీన్ని తాము ఆచరణలో అమలు చేసి చూపిస్తున్నామని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో ఏఐ పరమైన పరిణామాలతో బ్లూకాలర్ ఉద్యోగాలు కాస్తా ఆకర్షణీయమైన గోల్డ్ కాలర్ ఉద్యోగాలుగా మారతాయని తెలిపారు.
ఇదీ చదవండి: 10 నిమిషాల్లో డెలివరీ: స్పందించిన జొమాటో సీఈఓ
మారుతున్న టెక్నాలజీ, భౌగోళిక - రాజకీయపరమైన పరిణామాలతో నూతన సంవత్సరంలో సర్వత్రా అనిశ్చితి నెలకొనవచ్చని మహీంద్రా చెప్పారు. అయితే అనిశ్చితిని శత్రువుగా పరిగణించకుండా, మన సత్తా నిరూపించుకునే అవకాశంగా భావించాలని సూచించారు. 2025లో ఎస్‌యూవీలు, వ్యవసాయ పరికరాలు, ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు, మహీంద్రా ఫైనాన్స్ తదితర వ్యాపార విభాగాల్లో గ్రూప్ గణనీయ విజయాలు సాధించిందని ఆనంద్ మహీంద్రా చెప్పారు.


