మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం! | AI May Almost Completely Replace IT, BPO Jobs Says Vinod Khosla | Sakshi
Sakshi News home page

మరో ఐదేళ్లలో ఆ ఉద్యోగాలన్నీ మాయం!

Feb 16 2026 4:56 PM | Updated on Feb 16 2026 5:11 PM

AI May Almost Completely Replace IT, BPO Jobs Says Vinod Khosla

ఏఐ (ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) టెక్ రంగంలోని ఉద్యోగుల్లో తీవ్ర భయాందోళనలు కలిగిస్తోంది. కొన్ని స్టార్టప్స్.. టెక్ కంపెనీలతో భాగస్వామ్యం ఏర్పాటు చేసుకుని కొత్త ఏఐ టూల్స్ లాంచ్ చేస్తున్నాయి. ఇవి మానవ ప్రమేయం లేకుండా పనులను వేగంగా చేసేస్తున్నాయి. కాబట్టి చాలా సంస్థలు ఏఐలో పెట్టుబడులు పెడుతూ.. తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. ఈ సమయంలో ప్రముఖ పారిశ్రామికవేత్త & వెంచర్ క్యాపిటలిస్ట్ 'వినోద్ ఖోస్లా' ఏఐ భవిష్యత్తుకు సంబంధించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.

ఖోస్లా అభిప్రాయం ప్రకారం.. AI అభివృద్ధి వేగంగా జరుగుతున్నందున వైట్ కాలర్ ఉద్యోగాలలో భారీ మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. ముఖ్యంగా ఐటీ సర్వీస్, బిజినెస్ ప్రాసెస్ అవుట్‌సోర్సింగ్ (BPO) రంగాలు వచ్చే ఐదు సంవత్సరాలలో దాదాపు పూర్తిగా కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడవచ్చని అన్నారు.

ప్రస్తుతం ఏఐ సాధనాలు సాధారణ డిజిటల్ సహాయకుల స్థాయి నుంచి స్వయం నియంత్రిత కలిగిన AI వర్కర్స్ స్థాయికి ఎదుగుతున్నాయి. ఇవి అనేక పనుల్లో మానవులను సైతం మించిపోయే అవకాశం ఉందని ఖోస్లా వెల్లడించారు. అకౌంట్స్, లా, మెడిసిన్స్, చిప్ డిజైన్ వంటి రంగాల్లో.. ఏఐ పురోగతి చాలా వేగంగా ఉంటుందని హెచ్చరించారు.

ఇంటర్నెట్, స్మార్ట్‌ఫోన్స్ మార్కెట్లో అడుగుపెట్టి వ్యాపార విధానాలను మార్చివేశాయి. మానవ మేధస్సుపై ప్రత్యక్ష ప్రభావం చూపించలేకపోయాయి. కానీ ఏఐ మనిషి ఆలోచనా శక్తిని అనుకరిస్తూ.. చాలా పనులను వేగంగా చేస్తోంది. కాబట్టి ఇది సాధారణ సాంకేతిక పరివర్తన కాదు, ఒక తరం మొత్తాన్ని ప్రభావితం చేసే విప్లవాత్మక మార్పు అని ఆయన అభివర్ణించారు.

ఏఐ కంపెనీ వీడిన సేఫ్టీ హెడ్
ఆంథ్రోపిక్ కంపెనీలో సేఫ్‌గార్డ్‌ రీసెర్చ్ టీమ్‌కు నాయకత్వం వహించిన మృణాంక్ శర్మ రాజీనామా చేశారు. ఆయన ఈ విషయాన్ని తన ఎక్స్ ఖాతాలో అధికారికంగా వెల్లడిస్తూ.. ప్రపంచం ప్రమాదంలో ఉందని చెబుతూ.. దీనికి కారణం కేవలం ఏఐ లేదా బయో వెపన్స్ మాత్రమే కాదు. ఒకదానితో ఒకటి ముడిపడిన అనేక సంక్షోభాల వల్ల ప్రమాదంలో ఉందని పేర్కొన్నారు. అయితే ప్రపంచాన్ని ప్రభావితం చేసే స్థాయికి మన జ్ఞానాన్ని పెంచుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. అప్పుడే మనం ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోగలం అని పేర్కొన్నారు. లేకుంటే.. తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement