ముంబై: బీజేపీ నేతలు, ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మధ్య మరోసారి మాటల యుద్ధం నడిచింది. ఇటీవల మహారాష్ట్ర బీజేపీ నేత నవనీత్ రాణా చేసిన వ్యాఖ్యలకు హైదరాబాద్ ఎంపీ అసుదుద్దీన్ ఒవైసీ కౌంటరిచ్చారు. కుటుంబంలో పిల్లల్ని కనడం అనే అంశంపై ఇరు నేతల మధ్య విమర్శలపర్వం కొనసాగింది. మీకు నచ్చిన విధంగా పిల్లల్ని కనండి. మిమ్మల్ని ఎవరు ఆపుతున్నారు అని ఒవైసీ తాజాగా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
అంతకుముందు బీజేపీ నేత, మాజీ ఎంపీ నవనీత్ కౌర్ ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ..‘కొంతమంది అధికంగా సంతానాన్ని ఉత్పత్తి చేస్తూ హిందుస్థాన్‌ని పాకిస్థాన్‌లా మార్చాలని ప్రయత్నిస్తున్నారు. దానిని అడ్డుకోవాలంటే హిందువులు సైతం తప్పనిసరిగా ముగ్గురు, నలుగురు పిల్లలని కనాలి. నేను అందరు హిందువులకు ఇదే విజ్ఞప్తి చేస్తున్నాను. వీళ్లంతా నలుగురు భార్యలు,19 మంది పిల్లలు అని బహిరంగంగా చెప్పుకుంటారు. వారంతా మౌలానానా, మరోకరా అనేది నాకు తెలియదు. కానీ వారంతా అధికమంది పిల్లలను కనడం ద్వారా హిందుస్థాన్‌ని పాకిస్థాన్‌లా మార్చాలనుకుంటున్నారు. కనుక మనం కూడా ఒక్కరితో సంతృప్తి చెందకూడదు. తప్పనిసరిగా ఎక్కువ మంది పిల్లలని కనాలి" అని ఆమె అన్నారు. దీంతో, ఆమె వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి.
తాజాగా ఆమె వ్యాఖ్యలపై ఎంపీ అసుదుద్దీన్ స్పందించారు. ఈ క్రమంలో అసద్ మాట్లాడుతూ.. ఆమె వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటరిస్తూ మాట్లాడారు. "మహారాష్ట్రలో ఇద్దరికంటే ఎక్కువ మంది పిల్లలుంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హులు కాదు. ఇదివరకూ ఈ నియమం తెలంగాణలో కూడా ఉండేది కాని ఇప్పుడు రద్దు చేశారు. నాకు ఇప్పుడు ఆరుగురు పిల్లలున్నారు. మీరు కూడా నలుగురిని కనండి మిమ్మల్ని ఎవరు అడ్డుకున్నారు" అని వ్యాఖ్యలు చేశారు. దీంతో, ఇరువురు నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది.


