మీకు తెలుసా? భూమి చుట్టూ ఉపగ్రహాలు తిరిగే కక్ష్యలో బోలెడంత చెత్త పేరుకుపోయిందని?. పనిచేయని శాటిలైట్లు, రాకెట్ భాగాలు... నట్లు, బోల్టుల్లాంటివి 68 ఏళ్లుగా పోగుపడుతున్నాయని?. అర్జంటుగా తీసేయకపోతే.. కొత్తగా వచ్చి చేరే శాటిలైట్లకు ప్రమాదమని?. ఈ పని చేసేందుకు స్టార్టప్ కంపెనీ ‘కాస్మో సర్వ్’ అన్ని సిద్ధం చేసుకుని రెడీ అవుతోందని?.. అవునండి ఇది నిజం.
1957లో మొట్టమొదటి ఉపగ్రహం స్పుట్నిక్ ప్రయోగంతోనే అంతరిక్షంలో ఈ చెత్త సమస్య కూడా మొదలైంది. ఏళ్లు గడుస్తున్న కొద్దీ అంతకంతకూ పెరుగుతూ వచ్చింది కూడా. తాజా లెక్కల ప్రకారం.. భూమి చుట్టూ వేర్వేరు కక్ష్యల్లో ఇప్పుడు కొన్ని లక్షల సంఖ్యలో వస్తువులు పడి ఉన్నాయి. వీటిల్లో పనిచేయని ఉపగ్రహాలు మాత్రమే కాదు.. విడిభాగాలు, సౌరఫలకాలు, నట్లు, బోల్టుల్లాంటివి కూడా ఉన్నాయని అంచనా. అయితే ఏంటి? అంటున్నారా?..

సింపుల్.. ఇంకొన్ని ఏళ్లు గడిస్తే కొత్త ఉపగ్రహాలు తిరిగేందుకు స్థలం ఉండదు. ఒకవేళ ప్రయోగించినా.. ఇప్పటికే అక్కడ పోగుపడి ఉన్న వ్యర్థాల్లో ఏదో ఒకటి ఢీకొనే అవకాశాలు పెరుగుతాయి. అందుకే వీటిని అర్జంటుగా తొలగించాల్సిన అవసరం ఏర్పడింది. రెండు మూడు కంపెనీలు ప్రయత్నిస్తున్నాయి కానీ... మా కంపెనీ ‘కాస్మో సర్వ్’ ఒక్క దెబ్బకు రెండు పిట్టలన్నట్లు ఒక్కసారి ప్రయోగిస్తే వంద ఉపగ్రహాలను లేదంటే భాగాలను తొలగించేస్తుంది అంటున్నారు చిరంజీవి ఫణీంద్ర.
ఇస్రోలో పద్నాలుగేళ్లు పనిచేసి.. అంతరిక్ష వ్యర్థాలపై ఐక్యరాజ్య సమతి ఏర్పాటు చేసిన కమిటీలో భారత్‌కు ప్రాతినిథ్యం వహించారీ చిరంజీవి ఫణీంద్ర. అంతరిక్ష వ్యర్థాల తొలగింపు అవసరాన్ని.. అందులోని వ్యాపారాన్ని గుర్తించిన ఈ శాస్త్రవేత్త గత ఏడాది ఆగస్టులో ‘కాస్మోసర్వ్’ను ఏర్పాటు చేశారు. భూమి చుట్టూ తిరుగుతున్న వ్యర్థాలను ఒడిసిపట్టుకుని.. భూ వాతావరణంలోకి పంపేసి మండిపోయేలా చేసేందుకు అద్భుతమైన టెక్నాలజీ ఒకదాన్ని అభివృద్ధి చేశారు.
దేశంలోనే పేరెన్నికగన్న ఐఐటీ, ఐండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ ఇంజినీర్లు, శాస్త్రవేత్తలతో కూడిన బృందం ఇప్పటికే ఈ టెక్నాలజీ నమూనాలను తయారు చేసింది. అన్ని సవ్యంగా సాగితే అతి తొందరలోనే ఈ టెక్నాలజీ పనితీరును పరిశీలించే ప్రయోగమూ జరుగుతుందని చిరంజీవి ఫణీంద్ర ‘సాక్షి.కాం’తో మాట్లాడుతూ చెప్పారు. 
రొబోటిక్ చేతులు... ఓ మదర్ డిపో!
అంతరిక్ష వ్యర్థాల తొలగింపునకు కాస్మోసర్వ్ అభివృద్ధి చేసిన టెక్నాలజీ చాలా వినూత్నమైంది. ప్రధానంగా రెండు భాగాలుంటాయి. ఒకటేమో రివైవర్. గంటకు కొన్ని వేల కిలోమీటర్ల వేగంతో తిరుగుతున్న ఉపగ్రహాల దగ్గరకు వెళ్లి... నాలుగు సాఫ్ట్ రోబో చేతుల సాయంతో ఒడిసిపట్టుకుని.. భూమి వాతావరణం అంచుల్లోకి తీసుకొచ్చి వదిలివేయడం దీని పని. ఈ పని మళ్లీ మళ్లీ చేయగలదీ రివైవర్. ఇంధనం ఖర్చయిపోతే.. మళ్లీ నింపుకునేందుకు ఉపయోగించేదే ‘మదర్ క్రాఫ్ట్’. సుమారు మూడు టన్నుల బరువుండే మదర్ క్రాఫ్ట్‌లో 2500 కిలోల వరకూ ఇంధనం ఉంటుందని ఫణీంద్ర తెలిపారు. మదర్ క్రాఫ్ట్‌తోపాటు, రివైవర్‌ను ప్రయోగించిన తరువాత... ఈ వ్యవస్థ దానంతట అదే పనిచేస్తుందని చెప్పారు. ఒకదాని తరువాత ఒకటిగా రివైవర్ సుమారు వంద వరకూ ఉపగ్రహాలు/భాగాలను పట్టుకుని వాతావరణంలోకి విడుదల చేయగలదని వివరించారు.
ప్రమాదం కాదా?..
అస్సలు కాదంటారు ఫణీంద్ర. చిన్న చిన్న వస్తువులు భూ వాతావరణంలోకి ప్రవేశించిన వెంటనే అక్కడి రాపిడికి మండిపోతాయని, కొంచెం పెద్దసైజున్నవైతే.. అవి పసఫిక్ మహా సముద్రంలో మానవ సంచారం అస్సలు లేని ‘పాయింట్ నిమో’ వద్ద పడేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. అంతేకాకుండా... ఇతర మార్గాలతో పోలిస్తే తాము అభివృద్ధి చేసిన టెక్నాలజీ సాయంతో అంతరిక్ష వ్యర్థాల తొలగింపు పది రెట్లు చౌక అని చెప్పారు.
గత 68 ఏళ్లలో వివిధ దేశాలు మొత్తం 20 వేల ఉపగ్రహాలను ప్రయోగిస్తే.. రానున్న ఐదేళ్లకాలంలోనే ఇంకో యాభై వేల ఉపగ్రహాలు కక్ష్యలోకి చేరబోతున్నాయని, ఫలితంగా వ్యర్థాల తొలగింపు మరింత ముఖ్యం కానుందని ఫణీంద్ర వివరించారు. వంద ఉపగ్రహ ప్రయోగాలు జరిగితే అందులో విజయవంతమయ్యేవి 60 శాతం వరకూ మాత్రమేనని గణాంకాలు చెబుతున్నాయని, ఇలాంటి వ్యర్థాలను ప్రయోగించిన ఐదేళ్లలోపు తొలగించాలని అమెరికా ఇటీవలే చేసిన కొత్త చట్టం కారణంగా పరిస్థితి మరింత సంక్లిష్టంగా మారనుందని అన్నారు. ఇంకో లెక్క ప్రకారం 2031 నాటికల్లా అంతరిక్ష వ్యర్థాల తొలగింపు, ఇతర ఇన్-ఆర్బిట్ సర్వీసుల మార్కెట్ ఏకంగా 1430 కోట్ల డాలర్ల స్థాయికి చేరనుందని చెప్పారు.
భారతదేశ లక్ష్యాలకు అనుగుణంగా..
అంతర్జాతీయ అంతరిక్ష రంగంలో ప్రస్తుతం భారత వాటా కేవలం రెండు శాతం మాత్రమేనని, కేంద్ర ప్రభుత్వం దీన్ని ఎనిమిది శాతానికి పెంచేందుకు ప్రయత్నిస్తోందని చిరంజీవి ఫణీంద్ర తెలిపారు. అంతరిక్ష రంగానికి సంబంధించిన నిబంధనలను సడలించి, ప్రైవేట్ కంపెనీలకు చోటు కల్పించిన నేపథ్యంలో కాస్మోసర్వ్ అంతరిక్ష వ్యర్థాల తొలగింపు మార్కెట్‌లో గణనీయమైన వాటాను పొందే ప్రయత్నం చేస్తోందని తెలిపారు. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా రివైవర్‌ను అంతరిక్షంలో పరీక్షించేందుకు సిద్ధంగా ఉన్నామని.. ఇంకో రెండేళ్ల కాలంలో వ్యర్థాల తొలగింపునకు సంబంధించిన తొలి ప్రయోగం జరగవచ్చునని చెప్పారు.
:::గిళియారు గోపాలకృష్ణ మయ్యా, సీనియర్ న్యూస్ ఎడిటర్


