తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలకు అలర్ట్‌ | IMD Says Heavy Rain Forecast To Telangana Many Districts | Sakshi
Sakshi News home page

తెలంగాణకు భారీ వర్ష సూచన.. నేడు ఈ జిల్లాలకు అలర్ట్‌

Feb 23 2026 8:57 AM | Updated on Feb 23 2026 9:46 AM

IMD Says Heavy Rain Forecast To Telangana Many Districts

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన బలమైన అల్పపీడనం, దానికి అనుబంధంగా ఉన్న ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో​ పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. మరో రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎల్లో అలర్ట్‌ జారీ చేశారు.

ఉత్తర తెలంగాణ ప్రాంతాల్లో, ఆదిలాబాద్ జిల్లాలో ఆదివారం అర్ధరాత్రి పలుచోట్ల వర్షం కురిసింది. పలుచోట్ల ఈదురుగాలులతో కూడిన వర్షం కురవడంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. ఇదే సమయంలో నిజామాబాద్ జిల్లా, కామారెడ్డి జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో కూడా రాత్రి వర్షం కురిసింది. రానున్న రెండు రోజుల పాటు తెలంగాణలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది. ముఖ్యంగా ఉత్తర, మధ్య తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు.

సోమవారం భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, యాదాద్రి, రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్, నాగర్ కర్నూల్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని, మంగళవారం కూడా వీటి ప్రభావం కొనసాగుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఇక హైదరాబాద్ నగరంలో ఆకాశం మేఘావృతమై ఉంటుందని, సాయంత్రం లేదా రాత్రి వేళల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement