యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్.. దేశంలోనే అత్యున్నత ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్.. ఏటా వెలువడే నోటిఫికేషన్ కోసం డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు ఎందరో ఎదురుచూస్తుంటారు. లక్షలాది మంది దరఖాస్తు చేసుకుంటారు. ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ అనంతరం ఉద్యోగాలకు ఎంపికయ్యే వారి సంఖ్య వందల సంఖ్యలోనే ఉంటుంది. అయినా సివిల్స్ రాయాలని అందరికీ ఉంటుంది. ఏటా లక్షలాది మంది పోటీ పడినా లక్ష్యం చేరేది కొందరే. అందుకే సివిల్స్ ప్రత్యేకమైంది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ విడుదలైన సందర్భంగా సిలబస్‌పై పట్టు.. ప్రణాళిక.. చిత్తశుద్ధితో ముందుకు వెళ్తే విజయం సులభం అంటున్నారు ఉమ్మడి జిల్లా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు. ఒకసారి ఓడిపోయినా నిరుత్సాహ పడకుండా ప్రయత్నించాలని సూచిస్తున్నారు. భయాన్ని వీడి.. సబ్జెక్ట్‌లపై పట్టు సాధించాలని, ఇందుకు శిక్షణ కన్నా చిత్తశుద్ధి ముఖ్యమంటున్నారు. సివిల్స్‌కు ఎలా సన్నద్ధం కావాలి..? సిలబస్ ఏమిటి..? ప్రణాళిక..? తదితర సలహాలు.. సూచనలు వారి మాటల్లోనే..
ప్రామాణిక పుస్తకాలు చదవాలి
గరీమా అగ్రవాల్, ఐఏఎస్, కలెక్టర్, రాజన్నసిరిసిల్ల
సిరిసిల్ల: ప్రామాణిక పుస్తకాలు చదువుతూ.. సిలబస్‌పై పట్టు సాధించాలి. నేను 2019లో ఆల్ ఇండియా సివిల్స్‌లో 40వ ర్యాంకు సాధించాను. సివిల్స్‌కు సన్నద్ధమయ్యే వారు జనరల్ స్టడీస్(జీఎస్)ను సమగ్ర అధ్యయనం చేయాలి. జీఎస్–1, జీఎస్–2, జీఎస్–3 అంశాలను క్షుణ్ణంగా చదవాలి. నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్‌సీఆర్‌టీ) వెలువరించిన పుస్తకాలను ప్రామాణికంగా తీసుకుని చదవాలి. యూపీఎస్‌సీలో ప్రిలిమినరీ మెట్టు. అది దాటితే చాలా అంశాలు తెలుస్తాయి. మనం ఎక్కడ ఉన్నాం.
పోటీ అంశాలు ఏమిటి..? కోచింగ్ ఏమైనా తీసుకోవాలా..? అనే అనేకాంశాలు తెలుసుకుని మెయిన్స్‌కు ప్రిపేర్ కావచ్చు. మనం ఎన్ని గంటలు చదివాం అనేది ముఖ్యం కాదు.. సమగ్రంగా చదివామా లేదా.. అందులో ఉన్న అంశాలను మనం గ్రహించి గుర్తుంచుకునేలా ఉండాలి. ఏదైనా ప్రణాళికాబద్ధంగా పట్టుదలగా చదవాలి. పరీక్ష హాల్‌లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా.. సరైన సమాధానాలను నిర్దేశించుకుని, అక్షరాలను వేగంగా, అందంగా రాయడమూ ముఖ్యమే. సమయపాలన చాలా అవసరం. రైటింగ్ ప్రాక్టీస్ ఉండాలి. ఏ అంశమైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించుకోవాలి. ఒత్తిడికి లోనుకాకుండా.. మానసికంగా ఉల్లాసంగా ఉంటూ.. ప్రిపరేషన్ సాగించాలి. తొలి ప్రయత్నం విఫలమైనా.. మళ్లీ మళ్లీ ప్రయత్నిస్తూ.. పట్టుదలగా ముందుకు సాగాలి.
సానుకూల దృక్పథం అవసరం
– కోయ శ్రీహర్ష, ఐఏఎస్, కలెక్టర్, పెద్దపల్లి
సాక్షి,పెద్దపల్లి: సిలబస్‌పై అవగాహన, ప్రణాళికతో మొదటి ప్రయత్నంలోనే 6వ ర్యాంకు సాధించాను. సివిల్స్ ఎంపికలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఇలా ఒక్కో పరీక్ష ద్వారా వడపోత జరిపి ఎక్కువ అవగాహన, తెలివితేటలున్న వారిని ఎంపిక చేస్తారు. సివిల్స్‌కు సన్నద్ధం అయ్యేవాళ్లు సిలబస్‌పై పూర్తి అవగాహన పెంచుకోవాలి. మాక్‌టెస్టులు రాస్తుండాలి. గతంలో వచ్చిన పేపర్లను ప్రాక్టీస్ చేయాలి. షెడ్యూల్ ఫాలో అవుతూ, నోట్స్ మెయింటైన్ చేస్తూ, సమాజంలో జరిగే ప్రతి విషయంలో అనాలసిస్ చేయాలి. సిలబస్ పుస్తకాలు..ఆన్‌లైన్‌లో దొరికే మెటీరియల్ సిద్ధం చేసుకోవాలి.
పత్రికలు, విజేతల నోట్స్ చదవాలి. కోచింగ్ తీసుకున్నవారే ఉద్యోగాలు సాధిస్తారనేది అపోహే. కోచింగ్ గెలుపు సూత్రమేమి కాదు. సివిల్స్ క్రాక్ చేయటంలో ఆన్సర్ రైటింగ్ చాలా ముఖ్యం. రోజూ 2–3 ఆన్సర్లు రాసి, టైమ్‌లో (7–9 నిమిషాలు/ప్రశ్న) పూర్తి చేయండి. ఫీడ్‌బ్యాక్ తీసుకోండి, ఇది మార్కులు పెంచుతుంది. ఇంటర్వూ్యలో కాన్ఫిడెంట్, హంబుల్‌గా ఉండాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తూ, తెలియకపోతే ‘సార్, నాకు తెలియదు’ అని చెప్పాలి. హైదరాబాద్‌లో సైతం మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి. పట్టుదల, కన్సిస్టెన్సీతో రెగ్యులర్ ప్రాక్టీస్, స్ట్రాంగ్ బేసిక్స్, మెంటల్ స్ట్రెంత్, బ్యాలెన్స్‌డ్ లైఫ్‌తో ఎవరైనా యూపీఎస్‌సీ సాధించవచ్చు.
నిరుత్సాహ పడొద్దు
– సత్యప్రసాద్, ఐఏఎస్, కలెక్టర్, జగిత్యాల
జగిత్యాల: సివిల్స్ అంటే కొందరికి భయంగా ఉంటుంది. సునాయాసంగా చదువుకుంటూ వెళ్లాలి. 24 గంటలు చదవడం ముఖ్యం కాదు. ప్రణాళిక ఏర్పాటు చేసుకుని సాధించాలన్న కసితో ముందుకెళ్లాలి. డిగ్రీ చేసిన ప్రతి అభ్యర్థి సివిల్స్ రాసేందుకు అర్హులు. గతంలో ఓసీ 6, బీసీ 9, ఎస్సీ వారికి ఎప్పుడైనా రాసే అవకాశం ఉండేది. ప్రస్తుతం కొన్ని మార్పులు జరిగినట్లున్నాయి. ముఖ్యంగా ఎకానవిుక్స్, సైన్స్, జియోగ్రఫీ ఇలాంటివి అన్ని నోట్స్ తయారుచేసుకోవాలి. ప్రతిరోజు న్యూస్‌పేపర్స్ చదవడంతోపాటు ఇంటర్నెట్‌లో కొత్త సమాచారం తీసుకోవాలి. ప్రతి సబ్జెక్ట్‌ను చదవాలి. 32 ఏళ్ల వయస్సు వరకు ఎన్నిసార్లు అయినా రాయవచ్చు. ఉద్యోగం చేస్తూ సైతం అభ్యర్థులు సివిల్స్‌కు ప్రయత్నించొచ్చు. ఓటములు ఎదురైనా నిరాశ చెందకుండా ముందుకెళ్తే పట్టు సాధించవచ్చు. 24 గంటలు చదివితేనే ఐఏఎస్ సాధించవచ్చనే భావన ఉంటుంది. కాదు.. సబ్జెక్ట్ ప్రకారం ప్రణాళిక తయారుచేసుకుని చదివితే ఈజీగా ముందుకెళ్లొచ్చు. ఇంతకుముందే సివిల్స్‌పై అనుభవం ఉన్న వారి సలహాలు తీసుకోవాలి. సివిల్స్‌లో రైటింగ్ సైతం ఎంతో ముఖ్యం. ప్రతి ఒక్కరు నేను ఐఏఎస్ కొడతాననే ముందుకెళ్లాలి. ప్రతి విషయాన్ని నోట్ చేసుకుంటూ ముందుకెళ్లాలి. ఎస్‌సీఈఆర్టీ ఇంటర్, డిగ్రీలోని అంశాలే ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఒత్తిడికి లోను కావద్దు. తేలికగా తీసుకునే మనస్తత్వం ఉంచుకోవాలి.
ప్రాక్టీస్‌తోనే అవగాహన
– శివమారుతి రెడ్డి, ఐపీఎస్, గ్రేహౌండ్స్ ఏఎస్పీ, ఒడిశా
కోరుట్ల: సివిల్స్ సాధించడానికి సిలబస్‌పై పూర్తి పట్టు సాధించడం కీలకం. మాది కోరుట్ల మండలం అయిలాపూర్. రెండేళ్ల క్రితం సివిల్స్‌కు ఎంపికయ్యాను. 132వ ర్యాంకు సాధించి ప్రస్తుతం ఒడిశా గ్రేహౌండ్స్ విభాగంలో అడిషనల్ ఎస్పీగా కొనసాగుతున్నా. సివిల్స్‌లో సిలబస్‌ను చిన్న చిన్న లక్ష్యాలుగా విభజించుకుని ఒక్కో అంశాన్ని పూర్తిస్థాయిలో ఆకళింపు చేసుకోవాలి. ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవాలి. డెవలప్‌మెంట్స్‌పై దృష్టి సారించాలి. మాక్ టెస్టులను ప్రాక్టీస్ చేయాలి. ప్రిలిమ్స్‌లో చక్కని ఫలితం సాధిస్తే మెయిన్స్ పెద్ద కష్టం కాదు. ఆప్షనల్స్‌లో ప్రతీ అంశంపై పట్టు సాధించడం అవసరం. మెయిన్స్‌లో గత పరీక్షల ప్రశ్నాపత్రాలను పరిశీలించాలి. అంతకుముందు సివిల్స్ టాపర్లుగా నిలిచిన వారి కాపీలను స్టడీ చేసి నోట్స్ సొంతంగా తయారు చేయాలి. ఇంటర్వూ్యలో మన కాన్ఫిడెన్స్ లెవల్స్‌ను పరిశీలిస్తారు. చదివేటప్పుడు పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రిపేర్ కావడం కీలకం.
సామర్థ్యంపై నమ్మకం ఉండాలి
– అనుదీప్ దురిశెట్టి, ఐఏఎస్, కలెక్టర్ ఖమ్మం
మెట్‌పల్లి: సివిల్స్ సుదీర్ఘ ప్ర యాణం. కఠినమైన వడపోత ప్రక్రియ. ఇందులో ఓటమికి కుంగి పోవద్దు. మీ సామర్థ్యంపై నమ్మకం ఉంచి సాధిస్తానన్న పట్టుదల ఉండాలి. నేను సివి ల్స్‌కు నాలుగుసార్లు హాజరయ్యాను. రెండోసారి ఐఆర్‌ఎస్‌కు ఎంపికయ్యా. ఉద్యోగం చేసూ్తనే మరోసారి సివిల్స్‌కు ప్రిపేరయ్యాను. 2018 ఫలితాల్లో జాతీయస్థాయిలో మొదటి ర్యాంకు పొందాను. సివిల్స్‌లో విజేతగా నిలవాలంటే మొదట సిలబస్‌పై పట్టు సాధించాలి. ప్రధానంగా ఎన్సీఈఆర్టీ పుస్తకాలు చదివి హిస్టరీ, ఎకనావిుక్స్, సైన్స్, జియోగ్రఫీ సబ్జెక్టుల్లో విలువైన ప్రాథమిక సమాచారాన్ని సేకరించుకోవాలి. కరెంట్ అఫైర్స్‌పై పట్టు సంపాదించాలి. ఇంటర్‌నెట్ ద్వారా సమాచారాన్ని సేకరించడం, సబ్జెక్టు నిష్ణాతుల నుంచి సందేహాలను నివృత్తి చేసుకోవడం ముఖ్యం. మెడిటేషన్, యోగా సాధన చేస్తే క్రమశిక్షణాయుత ప్రిపరేషన్ సాగించడానికి అవకాశముంటుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం మనకు ఉండాలి.


