అదొక పాతబడిన.. తుప్పుబట్టిన ఖాళీ డొక్కు ఆయిల్ ట్యాంకర్. అట్లాంటిక్‌లో అమెరికా కోస్ట్‌గార్డ్ దానిని వెంబడించింది. విషయం తెలిసి రష్యా అప్రమత్తమైంది. దాని రక్షణ కోసం ఓ సబ్ మెరీన్‌ను, ఇతర నావికాదళ నౌకలు పంపింది. అయినా కూడా అమెరికా కనుసన్నల నుంచి అది తప్పించుకోలేకపోయింది. ఫలితంగా.. సీజ్ అయ్యింది. ప్రస్తుతం సంక్షోభం ఎదుర్కొంటున్న వెనెజువెలా తీరంలో జరిగిన ఈ నాటకీయ పరిణామాలు ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించాయి.
బెల్లా-1 ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ ట్యాంకర్. తొలినాళ్లలో వెనిజువెలా, ఆ తర్వాత ఇరాన్.. ప్రస్తుతం రష్యా ఆధీనంలో చమురు రవాణా కోసం ఉపయోగిస్తున్నారు. అయితే.. గత రెండు వారాలుగా ఇది వెనెజువెలా తీరంలో దీని డాక్‌కు అనుమతి లభించడం లేదు. ఇందుకు అమెరికా ఆంక్షలే ప్రధాన కారణం. ఆంక్షల కింద ఉన్న ఆయిల్ ట్యాంకర్లను వెనెజువెలా తీరంలో అమెరికా కోస్ట్‌గార్డ్ అడ్డుకుంటోంది. ఆ లిస్ట్‌లో బెల్లా కూడా ఉండడమే ఇందుకు ప్రధాన కారణమైంది. డిసెంబర్ 21వ తేదీన కరేబియన్ తీరంలో రష్యా జెండాతో కనిపించిన బెల్లా.. అమెరికా ఛేజ్‌తో దిశ మార్చుకుని గ్రీన్‌లాండ్ లేదంటే ఐస్‌ల్యాండ్ తీరానికి చేరొచ్చని భావించారు. అయితే అనూహ్యంగా అమెరికా కోస్ట్‌గార్డ్ దానిని సీజ్ చేసినట్లు తెలుస్తోంది.
బెల్లా ఎందుకు ప్రత్యేకం..
బెల్లా 1 అనేది 2002లో నిర్మించబడిన ఒక పెద్ద క్రూడ్ ఆయిల్ టాంకర్. ఇది గతంలో వెనిజులా, ఇరాన్‌తో పాటు మరికొన్ని దేశాల ఆయిల్ రవాణాలో ఉపయోగించబడింది. ప్రస్తుతం ఇది రష్యా జెండా కింద నడుస్తోంది. అయితే తమ ఆంక్షలకు వ్యతిరేకంగా ఇది "షాడో ఫ్లీట్"లో భాగమైందని అమెరికా ఆరోపిస్తోంది. 2024 నుంచి దీనిని నిషేధిత జాబితాలో చేర్చింది. అందుకే అమెరికా ప్రతిస్పందనకు భయపడి వెనిజులా పోర్ట్‌లు కూడా డాక్ అనుమతిని ఇవ్వలేదు.
Wall Street Journal నివేదిక ప్రకారం.. రష్యా నడిపే బ్లాక్ మార్కెట్ ఆయిల్ వాణిజ్యాన్ని అడ్డుకోవడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. అయితే మిడిల్ ఈస్ట్ రీజియన్‌లోని సంపన్న దేశాలు మాత్రం రష్యా ఆయిల్ వాణిజ్యానికి మద్దతు ఇస్తూ.. పాశ్చాత్య దేశాల ఆంక్షలకు సవాలు విసురుతున్నాయి.
షాడో ప్లీట్ అంటే..
షాడో ఫ్లీట్” (Shadow Fleet) అనేది రష్యా, ఇరాన్, వెనెజువెలా వంటి ఆంక్షలున్న ఎదుర్కొంటున్న దేశాలు ఆయిల్‌ను రహస్యంగా రవాణా చేయడానికి ఉపయోగించే ట్యాంకర్ల నెట్‌వర్క్. ఇందుకోసం పాత నౌకలను వినియోగించడం.. నకిలీ రిజిస్ట్రేషన్లు, జీపీఎస్ ట్రాకింగ్‌ను ఆఫ్ చేయడం లాంటివి చేస్తారు. షాడో ఫ్లీట్ ద్వారానే రష్యా.. చైనా, ఇండియా, టర్కీ వంటి దేశాలకు ఆయిల్ సరఫరా చేస్తోంది, ఈ నెట్‌వర్క్‌కు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ అయిన యూఏఈ, సౌదీ అరేబియాలు ఫైనాన్షియల్ ఛానెల్స్ అందిస్తున్నాయి. అయితే..
ఈ నెట్‌వర్క్ ప్రపంచ ఆయిల్ మార్కెట్‌పై గణనీయమైన ప్రభావం చూపుతోంది. దీనివల్ల చమురు ధరల స్థిరత్వం దెబ్బతింటోంది. ఆంక్షల అమలు కష్టతరమవుతోంది. వీటికి తోడు ప్రపంచ రాజకీయాల్లోనూ మార్పులు సంభవిస్తున్నాయి. 2025 నాటికి.. ఈ ఫ్లీట్‌లో 978 టాంకర్లు ఉన్నట్లు ఓ లెక్క. ఇది ప్రపంచ ఆయిల్ టాంకర్ సామర్థ్యంలో దాదాపు 19శాతం.
అంతర్జాతీయ ఆయిల్ మార్కెట్‌పై ప్రభావం ఎంతంటే..
ధరల స్థిరత్వం దెబ్బతినడం.. G7 దేశాలు రష్యా ఆయిల్‌పై ధర పరిమితి (price cap) విధించాయి. కానీ షాడో ఫ్లీట్ ద్వారా ఈ పరిమితిని తప్పించుకుని, మార్కెట్‌లో తక్కువ ధరలకు ఆయిల్ విక్రయిస్తోంది. ఫలితంగా, అధికారిక మార్కెట్ ధరలు, బ్లాక్ మార్కెట్ ధరలు మధ్య వ్యత్యాసం పెరుగుతోంది.
అయితే.. పాత, రిజిస్ట్రేషన్ లేని నౌకలు సముద్రంలో ప్రమాదకరంగా మారుతున్నాయని, పైగా పర్యావరణానికి (oil spills), సముద్ర రవాణా భద్రతకు ముప్పుగా పరిణమిస్తున్నాయని పాశ్చాత్య దేశాలు అంటున్నాయి.
సవాల్‌కు ప్రతి సవాల్
షాడో ఫ్లీట్ లిస్ట్‌లో ఉందని చెబుతున్న బెల్లా-1 ద్వారా అమెరికా ఆంక్షలను తప్పించుకుని ఆయిల్‌ను బ్లాక్ మార్కెట్‌లో విక్రయిస్తున్నారనేది అమెరికా ఆరోపణ. అందుకే రష్యా దీన్ని సవాలుగా తీసుకుని రక్షణ కల్పించింది. రక్షణ ఇవ్వడం ద్వారా వెనిజులాకు ఆర్థిక, రాజకీయ మద్దతు చూపించినట్లయ్యింది. అంతేకాదు “మా మిత్రదేశాల ఆయిల్ రవాణాను మీరు అడ్డుకోలేరు.” అనే సందేశాన్ని పంపించింది. అయితే ఈ సవాల్‌ను స్వీకరించిన అమెరికా.. దానిని విజయవంతంగా అడ్డుకున్నట్లు స్పష్టమవుతోంది. అలాగని అమెరికా షాడో ప్లీట్‌లను అడ్డుకోవడం ఇదే తొలిసారేం కాదు.
వెనెజువెలాకు చమురు ఆదాయం కోత పెట్టే ఉద్దేశంతో ట్రంప్ సర్కార్ ఈ తరహా ట్యాంకర్లను అడ్డుకోవడం మొదలుపెట్టాయి. ఈ క్రమంలో డిసెంబర్ 10వ తేదీన స్కిప్పర్, సెంచురీస్ అనే రెండు ఆయిల్ ట్యాంకర్లను సీజ్ చేశాయి. ఈ నేపథ్యంలో.. తాజా పరిణామాలు రాబోయే రోజుల్లో.. రష్యా–US మధ్య సముద్రం వేదికగా కొత్త ఉద్రిక్తతలకు దారితీయొచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.


