కాఠ్మండు: గత ఏడాది సెప్టెంబర్‌లో నేపాల్‌లో ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో యువత పైకి సాయుధబలగాలను ప్రయోగించి నాటి ప్రధాని కేపీ శర్మ ఓలీ అధికార దురి్వనియోగానికి పాల్పడ్డారన్న ఆరోపణలపై విచారణ కమిషన్ త్వరలో ఆయనను విచారించనుంది. జనవరి 21వ తేదీలోగా నివేదిక సమర్పింంచాల్సి ఉండటంతో ఆలోపు నిర్ణయాత్మకమైన నేతలు, అధికారుల నుంచి కమిషన్ సభ్యులు వివరణ తీసుకోనున్నారు.
సెప్టెంబర్ 8వ తేదీన కాఠ్మండులో ప్రభుత్వ వ్యతిరేక ర్యాలీ చేపట్టిన యువతపై పోలీసులు జరిపిన కాల్పుల్లో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నేపాల్‌లో అవినీతి, వారసత్వ రాజకీయాలు, అస్తవ్యస్త పాలనతో విసిగిపోయిన జనం జెన్–జెడ్ యువతరం సారథ్యంలో ఉద్యమించడంతో చెలరేగిన హింసాత్మక ఘటనల్లో దేశవ్యాప్తంగా ఆనాడు 77 మంది చనిపోయిన విషయం తెల్సిందే.
దీంతో నేపాల్ తాత్కాలిక ప్రభుత్వం నియమించిన గౌరీ బహదూర్ కర్కీ సారథ్యంలోని విచారణ కమిషన్ దర్యాప్తు మొదలెట్టింది. కర్కీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఘటనలో స్పష్టత కోసం ఓలీకి సమన్లు జారీచేసి ప్రశ్నించే అవకాశముందని చెప్పారు. అయితే కమిషన్ ఎదుట తాను హాజరయ్యే ప్రసక్తే లేదని కేపీ శర్మ ఓలీ కరాఖండీగా చెప్పేశారు. కమిషన్ చట్టబద్ధతను, విచారణలో పారదర్శకతను ఆయన ప్రశ్నించారు.


