అంధుల మహిళల టి20 ప్రపంచకప్ విజేత భారత్
రాణించిన ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ కరుణ కుమారి
ఫైనల్లో నేపాల్‌పై 7 వికెట్ల తేడాతో విజయం
కొలంబో: ఈ ఏడాది అంతర్జాతీయస్థాయిలో భారత క్రికెట్ హవా నడుస్తోంది. విభాగం ఏదైనా... వేదిక ఎక్కడైనా... ప్రత్యర్థుల ఎవరైనా... అదరగొట్టే ఆటతీరుతో భారత జట్లు జయభేరి మోగిస్తున్నాయి. ఇటీవల హర్మన్‌ప్రీత్ కౌర్ సారథ్యంలోని భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను తొలిసారి సొంతం చేసుకోగా... తొలిసారి నిర్వహించిన మహిళల అంధుల టి20 ప్రపంచకప్‌లోనూ భారత జట్టు జగజ్జేతగా అవతరించింది.
ఆదివారం జరిగిన ఫైనల్లో దీపిక సారథ్యంలోని భారత జట్టు 7 వికెట్ల తేడాతో నేపాల్‌ను ఓడించి ట్రోఫీ కైవసం చేసుకుంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన నేపాల్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 114 పరుగులు చేసింది. భారత బౌలర్లలో జమున రాణి, అను కుమారి చెరో వికెట్ పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో భారత్ 12.1 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 117 పరుగులు చేసి గెలిచింది.
ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పాంగి కరుణ కుమారి (27 బంతుల్లో 42) రాణించింది. ఫూలా సరేన్ (27 బంతుల్లో 44 నాటౌట్; 4 ఫోర్లు)తో కలిసి కరుణ కుమారి మూడో వికెట్‌కు 51 పరుగులు జోడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ ప్రాంతం వంట్ల మామిడికి చెందిన 15 ఏళ్ల కరుణ ప్రస్తుతం విశాఖపట్నం అంధ బాలికల ఆశ్రమ పాఠశాలలో పదో తరగతి చదువుతోంది.
భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిచ్చిన ఈ టోర్నీలో మొత్తం ఆరు (భారత్, నేపాల్, శ్రీలంక, పాకిస్తాన్, ఆ్రస్టేలియా, అమెరికా) దేశాల జట్లు పాల్గొన్నాయి. ఈ ఏడాది భారత పురుషుల జట్టు ఆసియా కప్ టి20 టోర్నీలో, చాంపియన్స్ ట్రోఫీ వన్డే టోర్నీలో టైటిల్స్ సాధించగా... భారత మహిళల జట్టు వన్డే వరల్డ్‌కప్‌ను దక్కించుకుంది.


