తొలిసారి జరుగుతున్న మహిళల అంధుల టీ20 ప్రపంచకప్‌లో సంచలనం నమోదైంది. పసికూన నేపాల్ పాకిస్తాన్‌కు దిమ్మతిరిగే షాకిచ్చింది. కొలొంబో వేదికగా నిన్న జరిగిన మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఫలితంగా 6 జట్లు (భారత్, పాకిస్తాన్, నేపాల్, శ్రీలంక, ఆస్ట్రేలియా, యూఎస్‌ఏ) పాల్గొంటున్న టోర్నీలో రెండో జట్టుగా సెమీస్‌కు అర్హత సాధించింది.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. ఓపెనర్ మెహ్రిన్ అలీ 77 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలువగా.. రెండో అత్యధిక పరుగులు ఎక్స్‌ట్రాల రూపంలో (36) వచ్చాయి. పాక్ ఇన్నింగ్స్‌లో ఆరుగురు రనౌట్లయ్యారు.
అనంతరం ఛేదనలో నేపాల్ ఓపెనర్, కెప్టెన్ బినిత పున్ చెలరేగిపోయింది. 54 బంతుల్లో 13 ఫోర్ల సాయంతో అజేయమైన 107 పరుగులు చేసింది. మరో ఓపెనర్ మన్‌కేశీ ఛౌదరీ 31 బంతుల్లో 6 ఫోర్ల సాయంతో అజేయమైన 43 పరుగులు చేసింది.
ఫలితంగా నేపాల్ 13 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా లక్ష్యాన్ని చేరుకుంది. ఈ టోర్నీలో భారత్ సెమీస్‌కు చేరిన తొలి జట్టుగా నిలిచింది. ఈ టోర్నీకి భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి.


