IND vs SA: కెప్టెన్‌ వైభవ్‌ సూపర్‌ హిట్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌ | Vaibhav Aaron Tons India won By 233 Runs Clean Sweep Vs SA U19 | Sakshi
Sakshi News home page

IND vs SA: కెప్టెన్‌ వైభవ్‌ సూపర్‌ హిట్‌.. సిరీస్‌ క్లీన్‌స్వీప్‌

Jan 7 2026 8:00 PM | Updated on Jan 7 2026 9:11 PM

Vaibhav Aaron Tons India won By 233 Runs Clean Sweep Vs SA U19

భారత అండర్‌-19 క్రికెట్‌ జట్టు కెప్టెన్‌గా అరంగేట్రంలోనే వైభవ్‌ సూర్యవంశీ అదరగొట్టాడు. అతడి సారథ్యంలోని యువ భారత్‌ సౌతాఫ్రికాను తమ స్వదేశంలోనే మట్టికరిపించింది. మూడు యూత్‌ వన్డేల సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్‌ చేసి సఫారీ గడ్డపై జయభేరి మోగించింది.

తొలిసారి సారథిగా
బెనోని వేదికగా మూడో యూత్‌ వన్డేలో ఏకంగా 233 పరుగుల తేడాతో సౌతాఫ్రికా అండర్‌-19 జట్టును చిత్తు చేసి విజయాన్ని పరిపూర్ణం చేసుకుంది. ఆయుశ్‌ మాత్రే (Ayush Mhatre) గైర్హాజరీ నేపథ్యంలో వైభవ్‌ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) తొలిసారి భారత యువ జట్టు పగ్గాలు చేపట్టాడు.

సౌతాఫ్రికాతో యూత్‌ వన్డే సిరీస్‌లో భాగంగా బ్యాటర్‌గా, సారథిగా వైభవ్‌ రాణించాడు. తొలి రెండు వన్డేల్లో గెలిచి ఇప్పటికే సిరీస్‌ సొంతం చేసుకున్న భారత్‌.. బుధవారం నాటి నామమాత్రపు మూడో వన్డేలోనూ అదరగొట్టింది. టాస్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన వైభవ్‌ సేన నిర్ణీత 50 ఓవర్లలో 393 పరుగుల భారీ స్కోరు సాధించింది.

శతక్కొట్టిన ఆరోన్‌, వైభవ్‌
ఓపెనర్లు ఆరోన్‌ జార్జ్‌ (106 బంతుల్లో 118), వైభవ్‌ సూర్యవంశీ (74 బంతుల్లో 127) శతక్కొట్టగా.. మిగిలిన వారు నామమాత్రపు స్కోర్లకే పరిమితమయ్యారు. ఇక 63 బంతుల్లోనే సెంచరీ చేసిన వైభవ్‌.. యూత్‌ వన్డేల్లో అత్యంత పిన్న వయసులో (14 ఏళ్ల తొమ్మిది నెలలు) ఈ ఘనత సాధించిన కెప్టెన్‌గా చరిత్రకెక్కాడు.

కిషన్‌ కుమార్‌ సింగ్‌ దెబ్బకు
సౌతాఫ్రికా బౌలర్లలో టాండో సోనీ మూడు వికెట్లు తీయగా.. జేసన్‌ రోవెల్స్‌ రెండు, మైకేల్‌ క్రుయిస్‌కాంప్‌ ఒక వికెట్‌ దక్కించుకున్నారు. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ప్రొటిస్‌ యువ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. లెఫ్టార్మ్‌ పేసర్‌ కిషన్‌ కుమార్‌ సింగ్‌ దెబ్బకు టాపార్డర్‌ కకావికలమైంది.

ఓపెనర్లు జెరిచ్‌ వాన్‌ షాల్విక్‌ (1), అద్నాన్‌ లగడెయిన్‌ (9) ఇలా వచ్చి అలా వెళ్లగా.. వన్‌డౌన్‌లో వచ్చిన లెతాబో ఫహ్లమ్‌హొలక డకౌట్‌ అయ్యాడు. ఈ ముగ్గురిని అవుట్‌ చేసి కిషన్‌ శుభారంభం అందించగా.. మిగతా బౌలర్లు దానిని కొనసాగించారు.

వైభవ్‌ సూర్యవంశీ బౌలింగ్‌లో
ఇక ప్రొటిస్‌ బ్యాటర్లలో కెప్టెన్‌ ముహమద్‌ బుల్‌బులియా (4) కూడా తీవ్రంగా నిరాశపరచగా.. జేసన్‌ రోవెల్స్‌ 19 పరుగులు చేయగలిగాడు. డేనియల్‌ బోస్మాన్‌ (40), పాల్‌ జేమ్స్‌ (41), కోర్నె బోతా (36 నాటౌట్‌) మాత్రమే చెప్పుకోదగ్గ ప్రదర్శన చేశారు. మిగిలిన వారిలో మైకేల్‌ (1), జేజే బాసన్‌ (1) తేలిపోగా.. వైభవ్‌ సూర్యవంశీ బౌలింగ్‌లో ఆఖరి వికెట్‌గా టాండో సోనీ (6) వెనుదిరగడంతో భారత్‌ గెలుపు ఖరారైంది.

భారత బౌలర్లలో కిషన్‌ కుమార్‌ మూడు, మొహమెద్‌ ఇనాన్‌ రెండు వికెట్లతో సత్తా చాటగా.. హెనిల్‌ పటేల్‌, కనిష్క్‌ చౌహాన్‌, ఉద్ధవ్‌ మోహన్‌, ఆర్‌ఎస్‌ అంబరీశ్‌, లెఫ్టార్మ్‌ స్పిన్‌ బౌలింగ్‌ చేయగల వైభవ్‌ సూర్యవంశీ తలా ఒక వికెట్‌​ తీశారు. బ్యాటర్‌గా, కెప్టెన్‌గా రాణించిన వైభవ్‌ సూర్యవంశీకి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌, ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌ అవార్డులు లభించాయి. 

చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement