పాకిస్థాన్ నిఘా సంస్థ.. ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ భారత్‌లోని సైనిక రహస్యాల సేకరణకు బాలలతో గూఢచర్యానికి పాల్పడుతోందా? బాలలతో రహస్యాల సేకరణ అత్యంత సులభమైన పనేనని భావిస్తోందా? ఈ ప్రశ్నలకు పంజాబ్ పోలీసులు అవుననే సమాధానం చెబుతున్నారు. అసలు పాక్ ఎత్తుగడ ఏంటి? దాన్ని భారత్ ఎలా చిత్తుచేస్తోంది? ఈ విషయాలు తెలియాలంటే ఈ స్టోరీ చదవండి.
భారతదేశ రహస్యాల కోసం పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ ఇక్కడి బాలలతో గూఢచర్యం చేయిస్తోందనే విషయం బహిర్గతం కావడంతో.. మన బలగాలు ఉలిక్కి పడ్డాయి. తాజాగా పంజాబ్ పోలీసులు 15 ఏళ్ల వయసున్న ఓ బాలుడిని గూఢచర్య అభియోగాలపై అరెస్టు చేశారు. దాంతో.. ఆ బాలుడు ఏడాది కాలంగా పాకిస్థాన్‌కు సమాచారం అందజేస్తున్నాడనే విషయం వెలుగులోకి వచ్చింది. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాకు చెందిన సదరు బాలుడి మొబైల్ ఫోన్‌ను విశ్లేషించిన దర్యాప్తు అధికారులు విస్తుపోయే విషయాలను గుర్తించారు. మిలటరీ ఎస్టాబ్లిష్‌మెంట్ల వద్దకు ఆ బాలుడు ఎలా వెళ్లాడు? ఏయే సమాచారాన్ని సేకరించి, పాకిస్థాన్‌కు పంపాడు? అనే వివరాలను అధికారులు గుర్తించారు.
తదుపరి దర్యాప్తులో షాకింగ్ విషయాలు బయటపడ్డాయని పఠాన్‌కోట్ ఎస్పీ దల్జిందర్ సింగ్ దిలాన్ చెబుతున్నారు. ఆ బాలుడు అంబాలా వైమానిక బేస్ వద్ద పనులు నిర్వహిస్తున్న సునీల్ కుమార్ అనే కాంట్రాక్టర్ కూడా ఇదే పని చేస్తున్నట్లు చెప్పడంతో.. పోలీసులు అతణ్ని కూడా అరెస్టు చేశారు. అయితే.. జమ్మూకశ్మీర్, పంజాబ్‌లలో పలువురు బాలలతో పాకిస్థాన్ గూఢచర్యం చేయిస్తోందనే విషయం వెలుగులోకి వచ్చిందని, దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నామని అధికారులు వెల్లడించారు.
జమ్మూకశ్మీర్, పంజాబ్ పోలీసులు ఈ కేసుకు సంబంధించి మరో షాకింగ్ విషయాన్ని వెల్లడించారు. పాకిస్థాన్ ఐఎస్ఐ వర్గాలు యువతుల పేరుతో సోషల్ మీడియా ఖాతాలను ప్రారంభించి.. ఇక్కడి బాలలను హనీట్రాప్ చేస్తున్నట్లు తేలిందని చెబుతున్నారు. మైనర్ బాలురతో గూఢచర్యం చేయిస్తే.. ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో ఈ దారుణానికి ఐఎస్ఐ ఒడిగట్టి ఉంటుందని భావిస్తున్నారు. తదుపరి దర్యాప్తులో.. మరింత మంది మైనర్ల వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశాలున్నాయని చెబుతున్నారు.


