ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమివ్వనున్న టీ20 ప్రపంచకప్ కోసం 16 మంది సభ్యుల పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టును ఇవాళ (జనవరి 4) ప్రకటించారు. ఈ జట్టుకు కెప్టెన్‌గా సల్మాన్ అఘా ఎంపికయ్యాడు. అతనికి డిప్యూటీని (వైస్ కెప్టెన్) ప్రకటించలేదు.
ఫామ్‌లేమితో సతమతమవుతున్న స్టార్ బ్యాటర్ బాబర్ ఆజమ్ ఎట్టకేలకు ప్రపంచకప్ జట్టులో చోటు దక్కించుకున్నాడు. స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది సైతం ఈ జట్టులో చోటు దక్కించుకున్నప్పటికీ, అతని ఫిట్‌నెస్‌పై ఆనిశ్చితి నెలకొంది. షాహీన్‌కు బ్యాకప్‌గా మరో పేసర్ హరీస్ రౌఫ్ ఎంపికయ్యాడు. షాహీన్ తాజాగా బిగ్‌బాష్ లీగ్‌లో ఆడుతూ మోకాలి గాయం బారిన పడ్డ విషయం తెలిసిందే.
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్ రీఎంట్రీ ఇవ్వగా.. వికెట్‌కీపర్ బ్యాటర్ మొహమ్మద్ రిజ్వాన్‌కు ఈ జట్టులో చోటు దక్కలేదు. రిజ్వాన్ స్థానంలో ఉస్మాన్ ఖాన్ ప్రధాన వికెట్‌కీపర్‌గా ఎంపికయ్యాడు. మెయిన్ స్క్వాడ్‌ను శ్రీలంకతో టీ20 సిరీస్ తర్వాత (జనవరి 11) ప్రకటిస్తారు.
టీ20 ప్రపంచకప్ కోసం పాకిస్తాన్ ప్రొవిజనల్ జట్టు
- సల్మాన్ అలీ ఆఘా (కెప్టెన్)
- బాబర్ ఆజమ్
- షాహీన్ అఫ్రిది (ఫిట్‌నెస్ అనిశ్చితి)
- ఉస్మాన్ ఖాన్ (వికెట్ కీపర్)
- షాదాబ్ ఖాన్
- మొహమ్మద్ నవాజ్
- ఫహీమ్ అష్రఫ్
- హారిస్ రౌఫ్ (షాహీన్‌కు ప్రత్యామ్నాయం)
- ఫకర్ జమాన్
- మొహమ్మద్ వసీం జూనియర్
- నసీం షా
- అబ్దుల్ సమద్
- సాహిబ్‌జాదా ఫర్హాన్
- సైమ్ అయూబ్
- సల్మాన్ మీర్జా
- అబ్రార్ అహ్మద్
కాగా, టీ20 ప్రపంచకప్‌లో పాకిస్తాన్ గ్రూప్-ఏ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఈ గ్రూప్‌లోనే టీమిండియా కూడా ఉంది. ఇతర జట్లుగా యూఎస్‌ఏ, నమీబియా, నెదర్లాండ్స్ ఉన్నాయి. ఫిబ్రవరి 7న నెదర్లాండ్స్‌తో జరిగే మ్యాచ్‌తో పాక్ తమ వరల్డ్‌కప్ ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. దాయాదుల సమరం ఫిబ్రవరి 15న కొలొంబో వేదికగా జరుగనుంది.


