పాకిస్తాన్ దేశం పైపైన మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పటికీ.. అంతర్గతంగా ఎన్నో సమస్యలు.. ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటుంది. దేశంలో నిరుద్యోగిత రేటు ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా యువతలో నిరుద్యోగిత అధికంగా ఉండటం ఆ దేశ భవిష్యత్తుకు పెద్ద సవాలుగా మారింది. చదువు పూర్తయిన తర్వాత కూడా ఉద్యోగాలు లభించక, అనేక మంది యువకులు లేబర్‌గా, దినసరి కూలీలుగా మారుతున్నారు.
పాకిస్తాన్‌లో జనాభా వేగంగా పెరుగుతుండగా.. దానికి అనుగుణంగా ఉద్యోగ అవకాశాలు పెరగడం లేదు. పరిశ్రమలు మందగించడం, పెట్టుబడులు తగ్గడం, రాజకీయ అస్థిరత వంటి కారణాల వల్ల కొత్త ఉద్యోగాల సృష్టి ఆగిపోయింది. మరోవైపు విద్యా వ్యవస్థ కూడా ఉపాధి అవసరాలకు అనుగుణంగా లేకపోవడం కూడా నిరుద్యోగితకు ప్రధాన కారణంగా మారింది.
చదువుకున్న యువత కూడా నైపుణ్య లోపంతో ప్రైవేట్ రంగంలో అవకాశాలు పొందలేకపోతోంది. ఫలితంగా ఆ యువత నిర్మాణ రంగం, వ్యవసాయం, చిన్నచిన్న పనుల్లో తక్కువ జీతాలకు పని చేయాల్సిన దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఈ పరిస్థతి వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, వారి జీవన ప్రమాణాన్ని కూడా దిగజారుస్తోంది. ఓవరాల్‌గా చూస్తే.. పాకిస్తాన్‌లో పెరుగుతున్న నిరుద్యోగిత యువతను లేబర్‌గా మారుస్తోంది. ఇది వ్యక్తిగత సమస్యగా కాకుండా జాతీయ సమస్యగా మారింది. యువతకు సరైన ఉపాధి కల్పించకపోతే దేశ ఆర్థికాభివృద్ధి సాధ్యం కాదు. యువత శక్తిని సద్వినియోగం చేసుకోకుంటే పాకిస్తాన్‌కు భవిష్యత్తు ప్రశ్నార్థకమే.
పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం కేవలం 7 శాతం మాత్రమే యువత నిరుద్యోగులని తప్పుడు ప్రచారం చేస్తున్నప్పటికీ వాస్తవ గణాంకాలు భిన్నంగా ఉన్నాయి. ఆ దేశంలో మొత్తం నిరుద్యోగిత రేటు సుమారు 18 నుంచి 20 శాతం వరకు ఉందని వివిధ ఆర్థిక నివేదికలు సూచిస్తున్నాయి. 18 నుంచి 30 సంవత్సరాల వయసు గల యువతలో నిరుద్యోగిత రేటు 30 శాతం కంటే ఎక్కువగా ఉందని అంచనా. ప్రతి ఏడాది సుమారు 20 లక్షల మందికి పైగా యువత ఉద్యోగ మార్కెట్‌లోకి ప్రవేశిస్తున్నా, అందుకు సరిపడే ఉద్యోగాలు లేవు.
అయితే, ఆ దేశ జనాభాలో 64 శాతం యువత ఉండటం ఒకవైపు అవకాశంగా కనిపించినా, ఉపాధి కల్పన లేకపోవడంతో అదే జనాభా భారం గా మారుతోంది. పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగిత ఎక్కువగా ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక యువత నగరాల వైపు వలసలు వెళ్తున్నారు. ద్రవ్యోల్బణం 25–30 శాతం వరకు పెరగడం, రూపాయి విలువ పడిపోవడం, విదేశీ రుణాల భారం పెరగడం వంటి కారణాలు అక్కడి పరిశ్రమలను తీవ్రంగా ప్రభావితం చేశాయి. ఫలితంగా అనేక కర్మాగారాలు మూతపడగా, ఉద్యోగాల కోత జరిగింది. పరిశ్రమల రంగం జిడిపిలో సుమారు 20 శాతం మాత్రమే వాటా కలిగి ఉండటం, సేవా రంగం కూడా మందగించడం వల్ల కొత్త ఉద్యోగాలు పుట్టడం లేదు.
ఉద్యోగాలు లభించక యువత పెద్ద సంఖ్యలో దినసరి కూలీలు, అసంఘటిత రంగం కార్మికులుగా మారుతున్నారు. ఒక నివేదిక ప్రకారం పాకిస్తాన్‌లో 70 శాతం కంటే ఎక్కువ మంది కార్మికులు అసంఘటిత రంగంలోనే పనిచేస్తున్నారు. వీరికి కనీస వేతనం, సామాజిక భద్రత, ఉద్యోగ భద్రత ఏదీ ఉండదు. తక్కువ జీతాలు, ఎక్కువ పని గంటలు, అసురక్షిత పరిస్థితుల్లో పని చేయడం.. యువత ఆరోగ్యం.. వారి భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఇది వారి ప్రతిభను వృథా చేయడమే కాకుండా, దేశ భవిష్యత్తునూ అంధకారంలోకి నెడుతోంది.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది డిగ్రీలు, డిప్లొమాలు పొందుతున్నా, వారిలో చాలామందికి ఉద్యోగానికి అవసరమైన నైపుణ్యాలు లేవు. సాంకేతిక, వృత్తి విద్యకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడం వల్ల చదువుకున్న యువత కూడా చివరకు కూలీ పనులు, డ్రైవింగ్, డెలివరీ, నిర్మాణ రంగం వైపు వెళ్లాల్సి వస్తోంది. దాంతో ప్రస్తుత దేశ పరిస్థితుల్లో నిరుద్యోగ యువతలో నిరాశ, అసంతృప్తి పెరుగుతోంది. కొందరు యువకులు ఇతర దేశాలకు వలస వెళ్లేందుకు ప్రయత్నిస్తుండగా, మరికొందరు చట్ట వ్యతిరేక కార్యకలాపాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇది వారి కుటుంబాలపై, సమాజంపై.. చివరకు ఆ దేశ ఆర్థికాభివృద్ధిపై ప్రభావం చూపుతోంది.
ఈ సమస్యకు పరిష్కారం దొరకాలంటే అక్కడి ప్రభుత్వం తొలుత దేశంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాల్సిన ఆవశ్యకత ఉంది. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే విధానాలను అమలు చేయాలి. నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు, పరిశ్రమలకు ప్రోత్సాహం, స్టార్టప్‌లకు మద్దతు వంటి చర్యలు అవసరం. అప్పుడే యువత.. వారి విద్యకు తగిన ఉద్యోగాలు పొందగలుగుతారు.


