భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదంటూ బంగ్లాదేశ్ మరోసారి ఓవరాక్షన్ చేసింది. టీ20 ప్రపంచకప్-2026 ఆడేందుకు తమ క్రికెట్ జట్టును అక్కడికి పంపలేమని పేర్కొంది. అయితే, అదే సమయంలో తాము మాత్రం టోర్నమెంట్‌ను వైదొలిగేందుకు సిద్ధంగా లేమంటూ తమ ద్వంద్వ వైఖరిని బయటపెట్టింది.
భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదు
ఈ విషయం గురించి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (BCB) అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం, ప్రభుత్వ సలహాదారు ఆసిఫ్ నజ్రుల్ బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా.. ‘‘భారత్‌లో మ్యాచ్‌లు ఆడే పరిస్థితి లేదని మేము ఇప్పటికే ఐసీసీకి అర్థమయ్యేలా చెప్పాము.
మరింత స్పష్టంగా ఈరోజు రాత్రికో.. రేపు ఉదయమో మరోసారి ఇదే విషయాన్ని వారికి చెబుతాము. బంగ్లాదేశ్ భద్రత, గౌరవం, మర్యాద విషయంలో మేము ఎంతమాత్రము రాజీపడబోము. అయితే, మేము కచ్చితంగా టీ20 ప్రపంచకప్ టోర్నీలో పాల్గొంటాము’’ అని నజ్రుల్ పేర్కొన్నాడు.
మరోవైపు.. అమినుల్ పాకిస్తాన్ పేరును ప్రస్తావిస్తూ తమకు కూడా అలాంటి వెసలుబాటు కావాలని డిమాండ్ చేశాడు. ‘‘చాంపియన్స్ ట్రోఫీ ఆడేందుకు టీమిండియా పాకిస్తాన్‌కు వెళ్లలేదు. అలాగే గత వరల్డ్‌కప్ ఆడేందుకు పాకిస్తాన్ భారత్‌కు రాలేదు.
పాకిస్తాన్ మాదిరే మేము కూడా
కాబట్టి మా విషయంలోనూ పాక్ మాదిరే ఐసీసీ నిర్ణయం తీసుకుంటుందని ఆశిస్తున్నాం. ప్రపంచకప్ టోర్నీల్లో హైబ్రిడ్ మోడల్ కొనసాగుతున్న విషయం అందరికీ తెలుసు. ఇందుకు భద్రతే ప్రధాన కారణం. కాబట్టి మాకు సానుకూల స్పందన లభిస్తుందని ఆశిస్తున్నాం’’ అని అమినుల్ అన్నాడు.
కాగా బంగ్లాదేశ్‌లో మైనారిటీలైన హిందువులపై హత్యాకాండ నేపథ్యంలో.. ఐపీఎల్ నుంచి ఆ దేశ ఆటగాళ్లను బహిష్కరించాలనే డిమాండ్లు పెరిగాయి. అందుకు అనుగుణంగానే బీసీసీఐ.. ముస్తాఫిజుర్ రహమాన్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి తొలగించేలా ఆదేశాలు ఇచ్చింది.
ఐసీసీ తిరస్కరించే అవకాశం?
ఈ క్రమంలో భద్రత అనే కారణం చూపుతూ టీ20 ప్రపంచకప్-2026 టోర్నీ కోసం తాము భారత్‌కు రాలేమని బంగ్లాదేశ్ పేర్కొంది. అయితే, టోర్నీ ఆరంభానికి నెలరోజుల సమయమే ఉన్నందున ఈ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించే అవకాశం ఉంది.
బంగ్లాదేశ్ కోరినట్లు శ్రీలంకలో వారి మ్యాచ్‌లు నిర్వహించడం కుదరకపోవచ్చు. ఈ నేపథ్యంలో తొలుత తాము టోర్నీ నుంచి తప్పుకొంటామని బెదిరింపు ధోరణి కనబరిచిన బంగ్లా.. తాజాగా ఇలా మాట్లాడటం గమనార్హం.
చదవండి: IND vs NZ: టీమిండియాకు శుభవార్త


