పెర్త్ వేదికగా ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ మధ్య జరిగిన తొలి టెస్టు కేవలం రెండు రోజుల్లో ముగిసిన సంగతి తెలిసిందే. ట్రావిస్ హెడ్ విధ్వంసకర సెంచరీ ఫలితంగా ఇంగ్లండ్‌ను 8 వికెట్ల తేడాతో ఆసీస్ చిత్తు చేసింది. 205 పరుగుల లక్ష్యాన్ని ఆస్ట్రేలియా కేవలం 28.2 ఓవర్లలో ఊదిపడేసింది.
అయితే పెర్త్ కేవలం రెండు రోజుల్లోనే ముగియడంతో క్రికెట్ ఆస్ట్రేలియా (CA) భారీ నష్టం చవిచూసినట్లు తెలుస్తోంది. మూడు, నాలుగు రోజుల ఆటకు సంబంధించిన టిక్కెట్లు దాదాపుగా అమ్ముడైపోవడంతో క్రికెట్ ఆస్ట్రేలియాకు రూ. 17 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు సమాచారం. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిందరికి రిఫండ్ చేయనున్నారు.
ఈ యాషెస్ ఓపెనింగ్ టెస్టును వీక్షించేందుకు తొలి రెండు రోజుల్లో రికార్డు స్థాయిలో 1,01,514 మంది ప్రేక్షకులు హాజరయ్యారు. గతేడాది ఆఖరిలో ఇదే వేదికలో భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ టెస్టు మ్యాచ్‌కు కూడా ఇంత భారీ సంఖ్యలో ప్రేక్షకులు హాజరు కాలేదు. మొదటి నాలుగు రోజుల్లో మొత్తంగా 96,463 మంది స్టేడియంకు వచ్చారు.
పెర్త్‌లో జరిగిన యాషెస్ తొలి టెస్టును టీవీల్లో కూడా 245,000 మంది వీక్షించినట్లు ఛానల్ 7 ప్లస్ వెల్లడించింది. ఇక ఆదివారం కోసం టిక్కెట్లు బుక్ చేసుకున్న అభిమానులకు హెడ్ క్షమాపణలు చెప్పాడు. "మూడో రోజు కూడా స్టేడియం నిండిపోతుందని అనుకున్నాను. కానీ రెండో రోజుల్లోనే ఆట ముగిసిపోయింది. టిక్కెట్లు బుక్ చేసుకున్న వారిందరికి సారీ" ఓ ప్రకటనలో హెడ్ పేర్కొన్నాడు.
కాగా క్రికెట్ ఆస్ట్రేలియా రిఫండ్ పాలసీ ప్రకారం.. రద్దు చేయబడిన రోజులకు సింగిల్-డే టిక్కెట్లు ఉన్న అభిమానులు
పూర్తి రిఫండ్‌కు అర్హులు. కాబట్టి, డే 3, డే 4, డే 5 టిక్కెట్లు బుక్ చేసుకున్న వారికి బోర్డు తప్పనిసరిగా డబ్బును తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.


