సిడ్నీ వేదికగా జరుగుతున్న యాషెస్ చివరి టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ యువ ఆటగాడు జేకబ్ బేతెల్ సెంచరీతో కదంతొక్కాడు. 22 ఏళ్ల బేతెల్‌కు టెస్ట్‌ల్లో ఇది తొలి శతకం. ఈ శతకంతో అతడు రికార్డుపుటల్లోకెక్కాడు.
ఆస్ట్రేలియాపై 22 ఏళ్లలోపు శతకం చేసిన తొమ్మిదో ఇంగ్లండ్ బ్యాటర్ అయ్యాడు. ఈ జాబితాలో జానీ బ్రిగ్స్, జాక్ హెర్న్, పటౌడి, కాలిన్ కౌడ్రే, డేవిడ్ గోవర్, మైక్ అథర్టన్, అలిస్టర్ కుక్, బెన్ స్టోక్స్ ఉన్నారు.
మ్యాచ్ విషయానికొస్తే.. బేతెల్ తన అద్భుత శతకంతో ఇంగ్లండ్‌ను ఆధిక్యం దిశగా నడిపించాడు. 99 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఏడు డాట్ బాల్స్ ఆడిన బేతెల్ వెబ్‌స్టర్ బౌలింగ్‌లో బౌండరీ కొట్టి సెంచరీ పూర్తి చేశాడు (162 బంతుల్లో). బేతెల్ సెంచరీ చేసిన అనంతరం అక్కడే మైదానంలో ఉన్న అతని కుటుంబ సభ్యులు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.
నాలుగో రోజు చివరి సెషన్ సమయానికి బేతెల్ 131 పరుగుల వద్ద ఇన్నింగ్స్ కొనసాగిస్తున్నాడు. అతనికి జతగా బ్రైడన్ కార్స్ (11) క్రీజ్‌లో ఉన్నాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసి పోరాడుతుంది. బేతెల్ పుణ్యమా అని ఆ జట్టు 107 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఈ ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌లో బేతెల్ మినహా ఎవరూ పెద్ద స్కోర్లు చేయలేదు. డకెట్, బ్రూక్ తలో 42 పరుగులు చేయగా.. జేమీ స్మిత్ 26, జాక్ క్రాలే 1, రూట్ 6, స్టోక్స్ 1, విల్ జాక్స్ డకౌటయ్యారు. ఆసీస్ బౌలర్లలో వెబ్‌స్టర్ 3 వికెట్లు పడగొట్టగా.. స్టార్క్, బోలాండ్, నెసర్ తలో వికెట్ తీశారు.
అంతకుముందు హెడ్ (163), స్టీవ్ స్మిత్ (138) సెంచరీలతో కదంతొక్కడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగుల భారీ స్కోర్ చేసింది. మిగతా బ్యాటరల్లో వెబ్‌స్టర్ 71 (నాటౌట్), వెదర్లాడ్ 21, లబూషేన్ 48, మైఖేల్ నెసర్ 24, కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆడుతున్న ఉస్మాన్ ఖ్వాజా 17, అలెక్స్ క్యారీ 16, గ్రీన్ 37 , స్టార్క్ 5, బోలాండ్ డకౌయ్యారు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, టంగ్ తలో 3, స్టోక్స్ 2, జాక్స్, బేతెల్ తలో వికెట్ తీశారు.
దీనికి ముందు జో రూట్ (160) సెంచరీతో సత్తా చాటడంతో ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు. కాగా,ఐదు మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను ఆసీస్ ఇదివరకే 3-1 తేడాతో కైవసం చేసుకున్న విషయం తెలిసిందే.


