స్వదేశంలో జరిగిన 2025-26 యాషెస్ సిరీస్‌ను ఆస్ట్రేలియా 4-1 తేడాతో కైసవం చేసుకుంది. సిడ్నీ వేదికగా ఇవాళ (జనవరి 8) ముగిసిన ఐదో టెస్ట్‌లో 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఇంగ్లండ్ నిర్దేశించిన 160 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని 5 వికెట్లు కోల్పోయి ఛేదించింది.
ఛేదనలో తొలుత తడబడినప్పటికీ అంతిమంగా గెలుపునందుకుంది. హెడ్ (29), వెదరాల్డ్ (34), లబూషేన్ (37), స్టీవ్ స్మిత్ (12), ఖ్వాజా (6) ఔట్ కాగా.. క్యారీ (16 నాటౌట్), గ్రీన్ (22 నాటౌట్) ఆసీస్‌ను విజయతీరాలకు చేర్చారు. ఇంగ్లండ్ బౌలర్లలో టంగ్ 3 వికెట్లు తీసి ఆసీస్‌పై ఒత్తిడి తెచ్చాడు. జాక్స్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకుముందు (ఐదో రోజే) ఇంగ్లండ్ ఓవర్‌నైట్ స్కోర్‌కు మరో 40 పరుగులు జోడించి 342 పరుగుల వద్ద రెండో ఇన్నింగ్స్‌ను ముగించింది. నాలుగో రోజే సెంచరీ చేసిన జేకబ్ బేతెల్ 150 పరుగులు పూర్తి కాగానే ఔటయ్యాడు. ఆసీస్ బౌలర్లలో స్టార్క్, వెబ్‌స్టర్ తలో 3 వికెట్లు తీసి ఇంగ్లండ్‌ను దెబ్బేశారు.
దీనికి ముందు ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 567 పరుగులు చేసింది. హెడ్ (163), స్మిత్ (138) సెంచరీలతో కదంతొక్కారు. ఆఖర్లో వెబ్‌స్టర్ (71 నాటౌట్) రాణించాడు. ఇంగ్లండ్ బౌలర్లలో కార్స్, టంగ్ తలో 3, స్టోక్స్ 2, జాక్స్, బేతెల్ చెరో వికెట్ తీశారు.
ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్.. జో రూట్ (160) సెంచరీతో సత్తా చాటడంతో తొలి ఇన్నింగ్స్‌లో 384 పరుగులు చేసింది. హ్యారీ బ్రూక్ (84) అర్ద సెంచరీతో రాణించాడు. ఆసీస్ బౌలర్లలో నెసర్ 4, స్టార్క్, బోలాండ్ తలో 2, గ్రీన్, లబూషేన్ చెరో వికెట్ తీశారు.
కాగా, ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ నాలుగో టెస్ట్ మాత్రమే గెలవగా.. ఆసీస్ మిగతా నాలుగు టెస్ట్‌లు గెలిచి సిరీస్ కైవసం చేసుకుంది.


