సినిమాలను పైరసీ చేస్తూ పోలీసులతో పాటు చిత్రపరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంలో నెటిజన్లు మాత్రం రవి టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. ఈక్రమంలోనే నటుడు శివాజీ కూడా అతని నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేశాడు. కానీ , ఆయన తండ్రి అప్పారావు కుమారుడి గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.
తన కుమారుడు రవి తప్పు చేశాడని అప్పారావు అంగీకరించారు. రవి తనను కలిసి రెండేళ్లకు పైగానే అవుతుందన్నారు. చట్ట ప్రకారం రవిని శిక్షించాలని కూడా అప్పారావు చెప్పడం విశేషం. రవి తనకు కుమారుడు అయినప్పటికీ చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియని ఎలా తప్పుబడుతానని మీడియాతో చెబుతూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆపై సీపీ సజ్జనార్‌కు రిక్వెస్ట్‌గా ఇలా చెప్పాడు.
'సజ్జనార్ సార్ మా మీద దయతలచి స్టేషన్‌లో వాడిని ఇబ్బంది పెట్టకండి. కానీ, మీ బాధ్యతలను విస్మరించి వాడిని వదిలేయమని నేను కోరుకోవడం లేదు. వాడికి ఒక కూతురు ఉంది. ఇప్పుడు దానిని తలుకుంటే ఏమైపోతుందోనని నాకు ఏడుపు వస్తుంది. నా మనవరాలి కోసమైన రవికి తక్కువ శిక్ష పడేలా చూడండి. కోడలు కూడా నాతో మాట్లాడదు. కానీ, నా మనవరాలు చాలా తెలివైనది. ఇప్పుడు నా బాధ అంతా దాని గురించే. మా కన్నీళ్లు చూసి సజ్జనార్ సార్‌కు జాలీ కలిగినా సరే చట్టం అనేది ఉంది కాబట్టి ఆయన కూడా నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది. మా బాధను చూసి రవిని వదిలేయలేరు కదా.? అందుకు చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు. కానీ, కనీసం కొంచెం తక్కువ శిక్షపడేలా చూస్తే చాలు. 'అంటూ అప్పారావు కన్నీళ్లు పెట్టుకున్నారు.


