breaking news
I Bomma
-
ఐ బొమ్మ రవికి మరోసారి పోలీసు కస్టడీ
సాక్షి హైదరాబాద్ : సినీ పైరసీకేసులో అరెస్టైన ఐబొమ్మ రవికి నాంపల్లి కోర్టు మరోసారి పోలీసు కస్టడీ విధించింది. రవిని మూడురోజుల పాటు కస్టడీలో విచారించాలని దానికి అనుమతివ్వాలని పోలీసులు కోరగా కోర్టు అనుమతులిచ్చింది. దీంతో రేపు పోలీసులు రవిని కస్టడీలోకి తీసుకోనున్నారు. మూడు కేసుల్లో రవిని పోలీసులు విచారించనున్నారు. అనంతరం సోమవారం బెయిల్ పై వాదనలు వింటామని కోర్టు తెలిపింది.కాగా గత కొన్ని సంవత్సరాలుగా పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన ఐబొమ్మ రవి అలియాస్ (ఇమ్మడి రవి) పోలీసులు గత నెలలో అరెస్టు చేశారు. తొలుత ఒక కేసులో రవిని అరెస్టు చేసి ఓ సారి కస్టడీకి తీసుకుని మరోసారి కస్టడీ పొడిగించుకున్నారు. అనంతరం మరో కేసులో అరెస్టు చేయడానికి అనుమతి కోరుతూ ప్రిజినర్స్ ట్రాన్సిట్ వారెంట్ వేస్తున్నారు. ఇలా ఇప్పటి వరకూ రెండు కేసుల్లో ఈ విధంగానే చేశారు.అనంతరం మిగిలిన మూడు కేసుల్లోనూ ఈ విధంగానే ప్రక్రియ పూర్తి చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరోసారి విచారణకు కోర్టు అనుమతిచ్చింది. కాగా ప్రస్తుతం ఐబొమ్మ రవి సినీ పైరసీలకు ఫుల్ స్టాప్ పెట్టాలని భావిస్తోన్నట్లు పోలీసులు తెలిపారు. హైదరాబాద్ లేదా విశాఖపట్నంలో రెస్టారెంట్ బిజినెస్ పెట్టే ఆలోచనలో రవి ఉన్నట్లు వారు పేర్కొన్నారు. -
ఐ బొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్ మెయిల్స్ లో కీలక ఆధారాలు
-
పైరసీ ఎప్పుడు మొదలైంది? ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు?
పైరసీ.. పైరసీ.. పైరసీ.. దీని గురించి చాలామందికి తెలుసు. కానీ గత కొన్నిరోజుల నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మెయిన్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం 'ఐ బొమ్మ' రవి అరెస్ట్. అతడు చేసింది తప్పా ఒప్పా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతకీ పైరసీ అంటే ఏంటి? ఏళ్లకు ఏళ్లుగా వైరస్‌లా పెరిగిపోతున్నా సరే దీన్ని పోలీసులు ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి?పైరసీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. వ్యక్తిగత కంప్యూటర్ల వాడకం అంటే 1990-2000ల కాలంలో ఇది మొదలైంది. మొదట్లో ఫ్లాపీ డిస్క్‌ల్లో సమాచారాన్ని కాపీ చేసుకునేవారు. తర్వాత వీసీడీలు, డీవీడీల ట్రెండ్ మొదలైంది. వీటిల్లో వినేందుకు పాటలు కాపీ చేసేవారు. థియేటర్ ప్రింట్ రూపంలో సినిమాలని కూడా కాపీ చేసి ఇళ్లలో చూసుకునేవారు. 2000 తర్వాత కాలంలో వీటి వాడకం ఎక్కువైంది. 2010 వచ్చేసరికి మెమొరీ కార్డ్స్ వచ్చాయి. 2020 వచ్చేసరికి స్మార్ట్ ఫోన్, పెన్ డ్రైవ్ ఇలా చాలా సదుపాయాలు వచ్చేశాయి. ప్రస్తుతానికైతే పైన చెప్పిన వాటి కంటే ఆన్లైన్లో ఉండే కొన్ని వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి సినిమాని ఉచితంగా చూసేయొచ్చు. కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే.పైరసీ చూడటం కరెక్టేనా అంటే అస్సలు కాదు. మొబైల్లో ఉచితంగా చూపిస్తున్నాడు కదా అని వీటిని చాలామంది చూస్తున్నారు. కానీ తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలు వాడికి అప్పగించేస్తున్నారు! ఎలా అంటే? మీ స్మార్ట్‌ఫోన్‌లో సదరు పైరసీ సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు, అప్పటికే మొబైల్లో మీ మొయిల్ ఐడీతో లాగిన్ అయ్యింటారు కదా. హ్యాకర్లు కావొచ్చు, సైట్ నిర్వహకులు కావొచ్చు.. మీ వివరాలని మీకు తెలియకుండానే స్టోర్ చేసుకుంటారు. మరి వాటితో ఏం చేస్తారు అంటే చాలా చేయొచ్చు. డార్క్ వెబ్‌లో మీ వివరాలని ఎవరికైనా అమ్మేస్తే.. దానితో వాళ్లు ఏమైనా చేయొచ్చు. అప్పుడప్పుడు మీకు తెలియని వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీ పేరు సహా కొన్ని వివరాలని వాళ్లు చెబుతుంటారు. వాళ్లకు మీ గురించి ఎలా తెలిసిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచిస్తే మీకు ఇప్పుడు చెప్పిన విషయం కచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి పైరసీ సైట్లని గానీ, అనుమతి లేని లింక్స్ గానీ ఓపెన్ చేసేముందు తస్మాత్ జాగ్రత్త.పైరసీ అనేది రకరకాల పద్ధతుల్లో చేస్తారు. అప్పట్లో థియేటర్‌కి వెళ్లి రహస్యంగా మొబైల్ ఫోన్‌తో లేదంటే కెమెరాతో రికార్డ్ చేసేవారు. తర్వాత దాన్ని డీవీడీలు లేదా మెమొరీ కార్డ్‌లో కాపీ చేసి పైరసీ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఎంతలా అంటే సర్వర్లు హ్యాక్ చేసి హెచ్డీ ప్రింట్స్ డౌన్లోడ్ చేసేంతలా! 'ఐ బొమ్మ' రవి కేసునే తీసుకుందాం. సినిమా రిలీజ్‌కి ముందే వాటిని లోడ్ చేసి ఉంచిన సర్వర్లని హ్యాక్ చేసి మరీ సినిమాలని తస్కరించేవాడు. ముందే పైరసీ సైట్లలో పెడితే ఎక్కడ అనుమానం వస్తుందోనని.. సరిగ్గా సినిమా విడుదల రోజు.. సైట్లలో అప్లోడ్ చేసేవాడు. మన దగ్గరే ఉంటే దొరికిపోతాడు కాబట్టి నైజీరియన్ దేశాల్లో ఉంటూ ఇదంతా చేసేవాడు.నైజీరియన్ దేశాలతో పాటు చైనా, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ సైబర్ మాయగాళ్లు తిష్టవేసి.. పైరసీ సైట్లని నడుపుతున్నారు. పైరసీలో మనం సినిమా ఫ్రీగా చూస్తాం కదా వాడికి ఎలా డబ్బులొస్తాయి అని మీరు అనుకోవచ్చు. సినిమా ప్లే అవుతున్నప్పుడు పైనో దిగువనో ఆన్లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తుంటాయి. వాటి నిర్వహకులు సదరు పైరసీ చేసిన వాడికి డబ్బులిస్తుంటారు. కొందరు సినిమా చూసి వదిలేస్తారు. మరికొందరు మాత్రం బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.పైరసీ వల్ల భారతీయ సినీ పరిశ్రమ 2023లో రూ.22,400 కోట్లు నష్టపోయింది. అందులో థియేటర్లు కోల్పోయింది రూ.13,700 కోట్లు కాగా ఓటీటీల వాటా రూ.8,700 కోట్లు. ఆ ఏడాది మీడియా, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆదాయంతో పోలిస్తే పైరసీ వల్ల కలిగిన నష్టం అందులో నాలుగో వంతుగా తేలింది. పైరసీ వల్ల గతేడాది ఒక్క టాలీవుడ్ రూ.3,700 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. గత పదేళ్లలో తీసుకుంటే ఆ నష్టం రూ.20 వేల కోట్లకు పైమాటే!ఇంతా జరుగుతున్నా పోలీసులు ఎందుకు పైరసీ సైట్లని ఆపలేకపోతున్నారు అని అనుకోవచ్చు. ఒకదాన్ని బ్లాక్ చేస్తే, రావణాసురుడి తలలా చాలా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కి పైగా వెబ్సైట్లు తెలుగు సినిమాలని అక్రమంగా చూసేందుకు అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో పోలీసులని.. సదరు పైరసీ చేస్తున్నవారిని పట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది. పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం పైరసీ చేశారని తేలితే.. మూడేళ్ల జైలుశిక్ష, మూడు లక్షల రూపాయల నుంచి నిర్మాణ వ్యయంలో అయిదు శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా సరే పైరసీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది. -
ఐ బొమ్మ క్లోజ్ కావడం మాకు కలిసొచ్చింది
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రోడక్షన్స్పై సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వర రావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ పెద్ద విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటిదాకా రూ. 7.28 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, కేవలం నైజాం నుంచే రూ. 5 కోట్ల 2లక్షలు వసూలయ్యాయి. ఏపీలో మొదటి రెండు రోజులు వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మూడో రోజు నుంచి పుంజుకున్నాయి. ఐ–బొమ్మ క్లోజ్ కావడం వల్ల మా సినిమా కలెక్షన్స్ పెరిగాయి.అలాగే టికెట్ ధర రూ. 99 పెట్టడం మాకు ప్లస్ అయ్యింది. ఈ రేటుకు మొదట్లో కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు 70 శాతం మంది ఈ రేటుకు అంగీకారానికి వచ్చారు’’ అని చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ చూస్తూ అమ్మాయిలు ఎమోషనల్‡అవుతున్నారు. మా పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్నిస్తుందని ఆశిస్తున్నాం. ఐ–బొమ్మలో పైరసీ మూవీస్‌ని ఎక్కువగా బీ, సీ సెంటర్స్ వాళ్లే చూస్తారు. ఇప్పుడా సైట్ క్లోజ్ కావడం వల్ల వాళ్లు థియేటర్స్‌కు రావడం పెరిగింది. టికెట్ రేట్ రూ.99 గా ఫిక్స్ చేసుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే.. పరిస్థితులు అలా మారాయి’’ అన్నారు. -
సజ్జనార్ సార్‌కు నా రిక్వెస్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న ఇమ్మడి రవి నాన్న
సినిమాలను పైరసీ చేస్తూ పోలీసులతో పాటు చిత్రపరిశ్రమను ముప్పుతిప్పలు పెట్టిన ‘ఐబొమ్మ’ ఇమ్మడి రవిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ విషయంలో నెటిజన్లు మాత్రం రవి టాలెంట్‌ను మెచ్చుకుంటున్నారు. ఈక్రమంలోనే నటుడు శివాజీ కూడా అతని నైపుణ్యాన్ని ప్రశంసిస్తూ కామెంట్ చేశాడు. కానీ , ఆయన తండ్రి అప్పారావు కుమారుడి గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.తన కుమారుడు రవి తప్పు చేశాడని అప్పారావు అంగీకరించారు. రవి తనను కలిసి రెండేళ్లకు పైగానే అవుతుందన్నారు. చట్ట ప్రకారం రవిని శిక్షించాలని కూడా అప్పారావు చెప్పడం విశేషం. రవి తనకు కుమారుడు అయినప్పటికీ చట్టప్రకారం జరగాల్సిన ప్రక్రియని ఎలా తప్పుబడుతానని మీడియాతో చెబుతూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆపై సీపీ సజ్జనార్‌కు రిక్వెస్ట్‌గా ఇలా చెప్పాడు. 'సజ్జనార్ సార్ మా మీద దయతలచి స్టేషన్లో వాడిని ఇబ్బంది పెట్టకండి. కానీ, మీ బాధ్యతలను విస్మరించి వాడిని వదిలేయమని నేను కోరుకోవడం లేదు. వాడికి ఒక కూతురు ఉంది. ఇప్పుడు దానిని తలుకుంటే ఏమైపోతుందోనని నాకు ఏడుపు వస్తుంది. నా మనవరాలి కోసమైన రవికి తక్కువ శిక్ష పడేలా చూడండి. కోడలు కూడా నాతో మాట్లాడదు. కానీ, నా మనవరాలు చాలా తెలివైనది. ఇప్పుడు నా బాధ అంతా దాని గురించే. మా కన్నీళ్లు చూసి సజ్జనార్ సార్‌కు జాలీ కలిగినా సరే చట్టం అనేది ఉంది కాబట్టి ఆయన కూడా నిస్సహాయ స్థితిలో ఉండాల్సి వస్తుంది. మా బాధను చూసి రవిని వదిలేయలేరు కదా.? అందుకు చట్టం ఒప్పుకోదని నాకు తెలుసు. కానీ, కనీసం కొంచెం తక్కువ శిక్షపడేలా చూస్తే చాలు. 'అంటూ అప్పారావు కన్నీళ్లు పెట్టుకున్నారు. View this post on Instagram A post shared by iDream Telugu (@idreamtelugu) -
ప్రత్యక్షంగా పైరసీ.. పరోక్షంగా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్
సాక్షి, హైదరాబాద్: ‘ఓ వెబ్సైట్లో పైరసీ సినిమా చూస్తే ఏమవుతుంది ? తక్కువ రేటుకే అది అందుబాటులో ఉంది కదా! అని అనేక మంది భావిస్తున్నారు. ఐ బొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు తర్వాత ఇదే అంశాన్ని పలువురు లేవనె త్తారు. ఈ వ్యవహారంలో పైకి పైరసీ కని పిస్తున్నా, అంతర్గతంగా బెట్టింగ్ దందా, డేటా చోరీ ఉన్నాయి’అని హైదరాబాద్ పోలీసు కమిషనర్ వీసీ సజ్జనార్ చెప్పారు. ‘ఐ బొమ్మ’ కేసులకు సంబంధించి ఆయన సోమవారం విలేకరుల సమావేశంలో పూర్తి వివరాలు వెల్లడించారు. ఆ వివరాలు సజ్జనార్ మాటల్లోనే... 2019లో తొలి వెబ్సైట్ ఏర్పాటు: విశాఖపట్నానికి చెందిన ఇమ్మడి రవి ఎంబీఏ పూర్తి చేశాడు. హైదరాబాద్‌కు వలసవచ్చిన అతగాడు తొలినాళ్లల్లో వెబ్ సర్వీస్‌లు అందించే ఈఆర్ ఇన్ఫోటెక్ సంస్థను ఏర్పాటు చేశాడు. ఆపై పైరసీ దందాలోకి దిగి.. 2019లో ఐ బొమ్మ, 2022లో బప్పం టీవీ పేర్లతో వెబ్సైట్లు ఏర్పాటు చేశాడు. ఒక వెబ్‌సైట్‌ను బ్లాక్ చేస్తే మరోటి తెరుస్తూ మొత్తం 65 మిర్రర్ సైట్లు రూపొందించాడు. వీటిని హోస్ట్ సర్వర్లను స్విట్జర్లాండ్‌లో పెట్టాడు. కరేబియన్ దీవులతోపాటు నెదర్లాండ్స్, ఫ్రాన్స్, దుబాయ్‌ల్లోనూ సంచరిస్తూ ఆయా దేశాల్లో ఖరీదు చేసిన 110 డొమైన్స్ ద్వారా ఈ వెబ్సైట్లు హోస్ట్ చేశాడు. ఇతడి నుంచి స్వా«దీనం చేసుకున్న హార్డ్డిస్్కల్లో 21 వేల చిత్రాలు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. వీటిలో 1972 నాటి గాడ్‌ఫాదర్ నుంచి తాజా సినిమా ఓజీ వరకు ఉన్నాయి. రవి రెండేళ్ల క్రితం భారత పౌరసత్వం వదిలేసి కరేబియన్ దీవుల్లో ఒకటైన సెయింట్ కిట్స్ అండ్ నెవీస్ దేశ పౌరసత్వం పొందాడు. ఆంధ్రప్రదేశ్‌లో తీసుకున్న డ్రైవింగ్ లైసెన్స్ ఉన్నా, ఇతగాడు మహారాష్ట్రకు చెందిన ప్రహ్లాద్ కుమార్ వెల్లెల పేరుతో ఓ డ్రైవింగ్ లైసెన్స్ పొందాడు. బాధితుల్లో చిత్ర పరిశ్రమతో పాటు సామాన్యులూ... ఇమ్మడి రవి నిర్వహిస్తున్న పైరసీ వెబ్సైట్ల ద్వారా సినీ పరిశ్రమతోపాటు సామాన్యులూ నష్టపోయారు. ఈ వెబ్సైట్ల ద్వారా యాడ్స్ ప్రమోట్ చేయడానికి అనేక బెట్టింగ్, గేమింగ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాడు. ప్రధానంగా వన్ విన్, వన్ ఎక్స్ బెట్ సంస్థలు ఉన్నాయి. పైరసీ వెబ్సైట్లో సినిమా చూడటానికి క్లిక్ చేస్తే అది బెట్టింగ్ సైట్/యాప్‌కు రీడైరెక్ట్ చేస్తుంది. ఇలా అనేకమంది వాటికి బానిసలుగా మారి సర్వం కోల్పోయారు. ఆర్థికంగా నష్టపోయి ఆత్మహత్యలు చేసుకోవడంతో ఆయా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఇతడికి సంబంధించిన ఒక బ్యాంకు ఖాతా విశ్లేషణ ద్వారా రూ.20 కోట్లు ఆర్జించినట్టు తెలుస్తోంది. ఇలాంటి 32 బ్యాంకు ఖాతాలను విశ్లేíÙంచాల్సి ఉంది. ఇమ్మడి రవిపై సిటీ సైబర్ క్రైమ్ పోలీస్‌స్టేషన్‌లో ఐదు కేసులు నమోదై ఉన్నాయి. ఇతడి ఇద్దరు అనుచరులు శివాజీ, ప్రశాంత్‌లను గతంలో అరెస్టు చేశారు. ఇతడు తన వెబ్సైట్ వీక్షకుల ఫోన్లు, కంప్యూటర్లలోని ఏపీకే ఫైల్స్ పంపి డేటాను తస్కరించాడు. ఇలా దాదాపు 50 లక్షల మంది డేటా హార్డ్డిస్్కల్లో భద్రపరిచాడు. రవి వ్యవహారాలపై సీబీఐ, ఈడీలకు సమాచారం స్కీన్ రికార్డింగ్‌తోపాటు సీక్రెట్ కెమెరాలతో రికార్డింగ్ ద్వారా రవి పైరసీ చేస్తున్నాడు. కొన్ని టెలిగ్రాం గ్రూపుల నుంచి కొన్ని చిత్రాలను ఖరీదు చేశాడు. ఇతగాడికి లండన్ సహా విదేశాల్లో కొందరు అనుచరులు ఉన్నట్టు తెలుస్తోంది. పైరసీ దందాతోపాటు బెట్టింగ్ యాడ్స్ ద్వారా వచ్చిన మొత్తంతో మనీ లాండరింగ్‌కు పాల్పడినట్టు అనుమానాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఇతడి అంశాన్ని సీబీఐ, ఈడీల దృష్టికి తీసుకువెళ్లడంతోపాటు సమాచారం అందించనున్నారు. రెండు నెలల క్రితం కొందరు అరెస్టు అయినప్పుడు నన్ను పట్టుకోండి అంటూ తోపులా సవాల్ చేశాడు. ఇప్పుడు జైలులో ఉన్నాడు. రవి అరెస్టు తర్వాత పోలీసులకు వ్యతిరేకంగా అనేకమంది మీమ్స్ చేశారు. వీరి పైనా చర్యలకు రంగం సిద్ధం చేశాం. సైబర్ నేరాలతోపాటు సినీ పైరసీపై సమాచారం ఉంటే తక్షణం 1930కు కాల్ చేసి తెలియజేయాలి. -
ఐ బొమ్మ రవి కేసులో బిగ్ ట్విస్ట్.. వచ్చింది విడాకుల కోసం కాదు!
ఐ బొమ్మ రవి అరెస్ట్ తర్వాత ట్విస్ట్‌ల మీద ట్విస్ట్‌లు బయటికొస్తున్నాయి. విదేశాల నుంచి ఇండియాకు వస్తున్న రవిని పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇది కాస్తా తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. రవి అరెస్ట్‌తో సినీ ఇండస్ట్రీతో పాటు పలువురు హర్షం వ్యక్తం చేశారు. అయితే తన భార్యతో విడాకుల కేసు కోసమే ఇండియాకు వస్తుండగా రవి అదుపులోకి తీసుకున్నారని వార్తలొచ్చాయి. అందరూ అదే నిజమనుకున్నారు.కానీ తీరా చూస్తే ఈ విషయంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. అసలు రవి విడాకుల కోసం ఇండియాకు రాలేదని తెలుస్తోంది. హైదరాబాద్, విశాఖపట్నంలో ఉన్న ఆస్తుల విక్రయానికి వచ్చినట్లు సమాచారం. ఇప్పటికే ఆయన ప్రైవేట్ రియల్ ఎస్టేట్ కంపెనీతో ఒప్పందం చేసుకున్నారని టాక్. అంతేకాకుండా అతను 2022లోనే ఓ ముస్లిం యువతిని పెళ్లి చేసుకున్నారని కూడా టాక్ వినిపిస్తోంది. భారత పౌరసత్వాన్ని వదులుకొని రూ.80 లక్షలు చెల్లించి కరేబియన్ సిటిజన్‌షిప్ తీసుకున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. కాగా.. 2022 నుంచి కరేబియన్ దీవుల్లోనే నివాముంటున్నారు. అయితే టెక్నాలజీని వాడుకోవడంలో కింగ్ అయిన ఇమ్మడి రవి.. పైరసీ సైట్ ఐ బొమ్మను స్థాపించాడు. దాదాపు కొన్ని వేల సినిమాలను ఐ బొమ్మ ద్వారా అందుబాటులో ఉంచాడు. ఓటీటీ కంటెంట్‌ను డీఆర్ఎం టెక్నాలజీ ద్వారా హ్యాక్ చేసి అప్లోడ్ చేసినట్లు తెలుస్తోంది. మూవీరూల్జ్ ద్వారా కంటెంట్ తీసుకుని హెచ్డీ ఫార్మాట్లోకి మార్చి ఐబొమ్మ సైట్లో అప్లోడ్ చేశాడని పోలీసుల విచారణలో వెల్లడైంది. -
'ఐ బొమ్మ' క్లోజ్.. మరి మిగతా వాటి సంగతి?
సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న అతి పెద్ద సమస్యల్లో పైరసీ ఒకటి. థియేటర్లలో కొత్త మూవీ ఇలా రిలీజైన వెంటనే అలా పైరసీ సైట్లలోకి వచ్చేంత టెక్నాలజీ పెరిగిపోయింది. దీంతో ప్రతిసారి హీరోలు, నిర్మాతలు, దర్శకులు లబోదిబోమంటూనే ఉన్నారు. చాలా ఏళ్లుగా ఉన్న ఈ సమస్యకు ఇప్పుడు చిన్న ఉపశమనం లభించింది. అదే 'ఐ బొమ్మ' సైట్‌ని క్లోజ్ చేయడం. తెలుగు ప్రేక్షకులకు బాగా తెలిసిన ఈ సైట్ ప్రధాన సుత్రధారిని ఈ మధ్యే పట్టుకున్న పోలీసులు.. అతడితోనే దగ్గరుండి మరీ సైట్ పూర్తి క్లోజ్ చేయించారు. ఇక్కడితో సమస్య తీరిపోయిందా అంటే అస్సలు కాదు.పైరసీ అనేది బలమైన వేళ్లతో భూమిలో గట్టిగా పాతుకుపోయిన మహావృక్షం లాంటిది. దీనిలో 'ఐ బొమ్మ' అనేది కేవలం ఓ కొమ్మ మాత్రమే. ఈ సైట్ రన్ చేస్తూ తప్పించుకు తిరుగుతున్న రవిని పోలీసులు పట్టుకోవడం మెచ్చుకోదగ్గ విషయమే. కానీ ఈ ఒక్క సైట్ మూసేసినంత మాత్రాన పైరసీ ఆగుతుందా అంటే చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే ఇలాంటివి బయట వందల్లో ఉన్నాయి. దీనిలానే వాటిని కూడా ఒక్కొక్కటిగా క్లోజ్ చేసుకుంటూ రావాలి. దేశంలోని పోలీస్ వ్యవస్థ, ప్రభుత్వం తలుచుకుంటే ఇదేమంత పెద్ద విషయం కాదు. కానీ 'ఐ బొమ్మ'పై పెట్టినంత దృష్టి మిగతా వాటిపైనా రాబోయే రోజుల్లో ఏ మేరకు పెడతారో చూడాలి.ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 16 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్పైరసీ సైట్స్ అనే కాదు గూగుల్ లాంటి వెబ్ సైట్లలో ప్లే స్టోర్స్‌లో దొరకని, వందల సంఖ్యలో ధ్రువీకరించని యాప్స్ APK ఫైల్స్ పేరిట జనాలకు అందుబాటులో ఉన్నాయి. కాస్తోకూస్తో చదువుకున్నోళ్లకు వీటి గురించి తెలుసు. చెప్పాలంటే చదువుకోని వాడు.. తనకు తెలిసిన ఒకటో రెండో సైట్లలో మాత్రమే పైరసీ సినిమాల్ని చూస్తాడు. చదువుకున్నోళ్లు మాత్రం విచ్చలవిడిగా ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయా వెబ్సైట్లని దగ్గరుండి నడిపించేవాళ్లు మన దేశస్థులు కావొచ్చు, కాకపోవచ్చు. ఒకవేళ మన పోలీసులు ప్రయత్నించినా సరే దొరుకుతారో లేదో కూడా తెలియని పరిస్థితి.కాబట్టి పైరసీ సమస్యతో పాటు ఇండస్ట్రీలోని మిగతా సమస్యలపై కూడా సినీ పెద్దలు కచ్చితంగా దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. టికెట్ రేట్లు అందుబాటులోకి తీసుకురావడం, రొటీన్ సినిమాలు కాకుండా కాస్త కంటెంట్ ఉండే సినిమాలని తీసుకురావడం లాంటివి చేస్తే.. రాబోయే రోజుల్లో ప్రేక్షకుడే పైరసీ వద్దనుకుని థియేటర్‌కి వస్తాడు. లేదంటే మాత్రం కథ మళ్లీ మొదటికే వస్తుంది!(ఇదీ చదవండి: మా కుటుంబంలో ఒకరు డిజిటల్ అరెస్ట్ అయ్యారు: నాగార్జున) -
'సినిమాలో సూపర్ హిట్ సీన్'.. ఐ బొమ్మ రవి అరెస్ట్‌పై రాజమౌళి
కేవలం సినీ ఇండస్ట్రీ మాత్రమే కాదు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో అదే ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. టాలీవుడ్‌కు కోట్ల రూపాయలు నష్టం తెచ్చిపెట్టిన ఐ బొమ్మ రవి ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. విదేశాల నుంచి వస్తుండగా ఎయిర్‌పోర్ట్‌లనే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఇప్పుడు టాలీవుడ్‌తో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో అతని గురించే చర్చ నడుస్తోంది.ఈ నేపథ్యంలో దర్శకధీరుడు రాజమౌళి ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐ బొమ్మ రవి గురించి ఆయన మాట్లాడారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం సినిమాలో సూపర్ హిట్ సీన్లా ఉందన్నారు. విలన్ ఛాలెంజ్ చేస్తే హీరో తీసుకెళ్లి కటాకటాల వెనక్కి పంపినట్లు ఉందని తెలిపారు. తనకు తానే భస్మాసుర హస్తంలాగా బయట పెట్టుకున్నాడు.. పోలీసులతో ఎవరూ కూడా ఛాలెంజ్ చేయవద్దని అన్నారు. ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేసిన పోలీసులకు, సీపీ సజ్జనార్‌కు రాజమౌళి ధన్యవాదాలు తెలిపారు. అంతకుముందే రాజమౌళితో పాటు మెగాస్టార్, నాగార్జున కలిసి సీపీ సజ్జనార్‌ను కలిసి ధన్యవాదాలు చెప్పారు.ఇదొక పెద్ద అచీవ్మెంట్.. మెగాస్టార్ఐ బొమ్మ రవిని అరెస్ట్ చేయడం పెద్ద అచీవ్మెంట్ అని మెగాస్టార్ పోలీసులపై ప్రశంసలు కురిపించారు. ఇలాంటి పైరసీ వల్ల గేమ్ ఛేంజర్, ఓజీ, కింగ్డమ్ లాంటి పెద్ద సినిమాలు చాలా నష్టపోయాయని తెలిపారు. రాజమౌళి పెద్ద సినిమా చేస్తున్నారని..మన తెలుగు సినిమా ఖండాంతరాలు దాటుతున్న సమయంలో పైరసీ అనేది ఇండస్ట్రీకి చాలా బాధ కలిగిస్తుందని చిరంజీవి అన్నారు. -
'అతని టాలెంట్‌ను వాడుకోండి'.. ఐ బొమ్మ రవిపై టాలీవుడ్ నటుడు షాకింగ్ కామెంట్స్
ఇప్పుడు ఎక్కడ చూసినా అతని పేరే వినిపిస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో మార్మోగిపోతోంది. అతనే ఇన్ని రోజులు సినీ ఇండస్ట్రీకి కోట్ల రూపాయలు నష్టం కలిగించిన వ్యక్తి. ఇటీవలే విదేశాల నుంచి ఇండియాకు వస్తూ పోలీసులకు దొరికిపోయాడు. అతను ఐ బొమ్మ ఇమ్మడి రవి. తెలుగు సినీ ఇండస్ట్రీ ఆదాయానికి కొన్నేళ్లుగా గండి కొడుతూ విదేశాల్లో తప్పించుకు తిరుగుతున్నారు. కానీ చివరికీ పోలీసుల నుంచి తప్పించుకోలేకపోయాడు. సవాల్ విసిరిన రవి.. చాలా ఈజీగానే దొరికేశాడు.అతని గురించి అంతా నెగెటివ్ జరుగుతున్న వేళ.. టాలీవుడ్ నటుడు శివాజీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఐ బొమ్మ రవి టాలెంటెడ్‌గా కనిపిస్తున్నారు. అతని హ్యాకింగ్ తెలివిని దేశ భద్రతకు పనికొచ్చేలా ఉపయోగించుకోవాలని సూచించారు. వాడిలో ఉన్న కసిని మంచి పనికి వినియోగించి ఉంటే బాగుండేదని అన్నారు. అతను చేసింది చాలా దుర్మార్గమైన పనే.. కానీ అతని టాలెంట్ మనదేశ భద్రత కోసం ఉపయోగించుకుంటే బాగుంటుందని నా అభిప్రాయమని తెలిపారు. చాలా మందిని ఇబ్బందిపెట్టిన రవి.. ఇకనుంచైనా మారాలని కోరుకుంటున్నాని శివాజీ వెల్లడించారు. ఈ ప్రపంచంలో అన్నింటికన్నా చీప్‌గా దొరికేది ఒక్క సినిమా మాత్రమేనన్నారు. ఏదైనా సినిమా బాగుంటే జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని శివాజీ వెల్లడించారు. ఓ సినిమా ఈవెంట్‌కు హాజరైన ఐ బొమ్మ రివి గురించి మాట్లాడారు. ఆ అబ్బాయి టాలెంటెడ్ అని విన్నాను.. అతని హ్యాకింగ్ టాలెంట్ దేశానికి ఉపయోగపడితే బాగుంటుంది.Actor Shivaji about #IBommaRavi pic.twitter.com/ue2LNMjwNf— Rajesh Manne (@rajeshmanne1) November 17, 2025


