పైరసీ.. పైరసీ.. పైరసీ.. దీని గురించి చాలామందికి తెలుసు. కానీ గత కొన్నిరోజుల నుంచి మాత్రం తెలుగు రాష్ట్రాల్లో ఇదే మెయిన్ టాపిక్ అయిపోయింది. దానికి కారణం 'ఐ బొమ్మ' రవి అరెస్ట్. అతడు చేసింది తప్పా ఒప్పా అనే సంగతి పక్కనబెడితే.. ఇంతకీ పైరసీ అంటే ఏంటి? ఏళ్లకు ఏళ్లుగా వైరస్‌లా పెరిగిపోతున్నా సరే దీన్ని పోలీసులు ఎందుకు అంతం చేయలేకపోతున్నారు? అసలు దీని పుట్టుపూర్వోత్తరాలు ఏంటి?
పైరసీ అనేది ఈ మధ్య కాలంలో వచ్చింది కాదు. వ్యక్తిగత కంప్యూటర్ల వాడకం అంటే 1990-2000ల కాలంలో ఇది మొదలైంది. మొదట్లో ఫ్లాపీ డిస్క్‌ల్లో సమాచారాన్ని కాపీ చేసుకునేవారు. తర్వాత వీసీడీలు, డీవీడీల ట్రెండ్ మొదలైంది. వీటిల్లో వినేందుకు పాటలు కాపీ చేసేవారు. థియేటర్ ప్రింట్ రూపంలో సినిమాలని కూడా కాపీ చేసి ఇళ్లలో చూసుకునేవారు. 2000 తర్వాత కాలంలో వీటి వాడకం ఎక్కువైంది. 2010 వచ్చేసరికి మెమొరీ కార్డ్స్ వచ్చాయి. 2020 వచ్చేసరికి స్మార్ట్ ఫోన్, పెన్ డ్రైవ్ ఇలా చాలా సదుపాయాలు వచ్చేశాయి. ప్రస్తుతానికైతే పైన చెప్పిన వాటి కంటే ఆన్‌లైన్‌లో ఉండే కొన్ని వెబ్‌సైట్స్‌లోకి వెళ్లి సినిమాని ఉచితంగా చూసేయొచ్చు. కావాల్సిందల్లా ఇంటర్నెట్ కనెక్షన్ మాత్రమే.
పైరసీ చూడటం కరెక్టేనా అంటే అస్సలు కాదు. మొబైల్‌లో ఉచితంగా చూపిస్తున్నాడు కదా అని వీటిని చాలామంది చూస్తున్నారు. కానీ తెలియకుండానే మీ వ్యక్తిగత వివరాలు వాడికి అప్పగించేస్తున్నారు! ఎలా అంటే? మీ స్మార్ట్‌ఫోన్‌లో సదరు పైరసీ సైట్‌ని ఓపెన్ చేసినప్పుడు, అప్పటికే మొబైల్‌లో మీ మొయిల్ ఐడీతో లాగిన్ అయ్యింటారు కదా. హ్యాకర్లు కావొచ్చు, సైట్ నిర్వహకులు కావొచ్చు.. మీ వివరాలని మీకు తెలియకుండానే స్టోర్ చేసుకుంటారు. మరి వాటితో ఏం చేస్తారు అంటే చాలా చేయొచ్చు. డార్క్ వెబ్‌లో మీ వివరాలని ఎవరికైనా అమ్మేస్తే.. దానితో వాళ్లు ఏమైనా చేయొచ్చు. అప్పుడప్పుడు మీకు తెలియని వ్యక్తుల నుంచి మీకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి. మీ పేరు సహా కొన్ని వివరాలని వాళ్లు చెబుతుంటారు. వాళ్లకు మీ గురించి ఎలా తెలిసిందో ఎప్పుడైనా ఆలోచించారా? ఒకవేళ ఆలోచిస్తే మీకు ఇప్పుడు చెప్పిన విషయం కచ్చితంగా అర్థమయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి పైరసీ సైట్లని గానీ, అనుమతి లేని లింక్స్ గానీ ఓపెన్ చేసేముందు తస్మాత్ జాగ్రత్త.
పైరసీ అనేది రకరకాల పద్ధతుల్లో చేస్తారు. అప్పట్లో థియేటర్‌కి వెళ్లి రహస్యంగా మొబైల్ ఫోన్‌తో లేదంటే కెమెరాతో రికార్డ్ చేసేవారు. తర్వాత దాన్ని డీవీడీలు లేదా మెమొరీ కార్డ్‌లో కాపీ చేసి పైరసీ చేసేవారు. కానీ ఇప్పుడు టెక్నాలజీ చాలా మారిపోయింది. ఎంతలా అంటే సర్వర్లు హ్యాక్ చేసి హెచ్‌డీ ప్రింట్స్ డౌన్‌లోడ్ చేసేంతలా! 'ఐ బొమ్మ' రవి కేసునే తీసుకుందాం. సినిమా రిలీజ్‌కి ముందే వాటిని లోడ్ చేసి ఉంచిన సర్వర్లని హ్యాక్ చేసి మరీ సినిమాలని తస్కరించేవాడు. ముందే పైరసీ సైట్లలో పెడితే ఎక్కడ అనుమానం వస్తుందోనని.. సరిగ్గా సినిమా విడుదల రోజు.. సైట్లలో అప్‌లోడ్ చేసేవాడు. మన దగ్గరే ఉంటే దొరికిపోతాడు కాబట్టి నైజీరియన్ దేశాల్లో ఉంటూ ఇదంతా చేసేవాడు.
నైజీరియన్ దేశాలతో పాటు చైనా, సింగపూర్, మలేసియా తదితర దేశాల్లోనూ సైబర్ మాయగాళ్లు తిష్టవేసి.. పైరసీ సైట్లని నడుపుతున్నారు. పైరసీలో మనం సినిమా ఫ్రీగా చూస్తాం కదా వాడికి ఎలా డబ్బులొస్తాయి అని మీరు అనుకోవచ్చు. సినిమా ప్లే అవుతున్నప్పుడు పైనో దిగువనో ఆన్‌లైన్ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ యాడ్స్ వస్తుంటాయి. వాటి నిర్వహకులు సదరు పైరసీ చేసిన వాడికి డబ్బులిస్తుంటారు. కొందరు సినిమా చూసి వదిలేస్తారు. మరికొందరు మాత్రం బెట్టింగ్ యాప్స్ ఉచ్చులో పడి ప్రాణాలు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి.
పైరసీ వల్ల భారతీయ సినీ పరిశ్రమ 2023లో రూ.22,400 కోట్లు నష్టపోయింది. అందులో థియేటర్లు కోల్పోయింది రూ.13,700 కోట్లు కాగా ఓటీటీల వాటా రూ.8,700 కోట్లు. ఆ ఏడాది మీడియా, సినిమా ఇండస్ట్రీ మొత్తం ఆదాయంతో పోలిస్తే పైరసీ వల్ల కలిగిన నష్టం అందులో నాలుగో వంతుగా తేలింది. పైరసీ వల్ల గతేడాది ఒక్క టాలీవుడ్ రూ.3,700 కోట్ల మేర నష్టపోయినట్లు అంచనా. గత పదేళ్లలో తీసుకుంటే ఆ నష్టం రూ.20 వేల కోట్లకు పైమాటే!
ఇంతా జరుగుతున్నా పోలీసులు ఎందుకు పైరసీ సైట్లని ఆపలేకపోతున్నారు అని అనుకోవచ్చు. ఒకదాన్ని బ్లాక్ చేస్తే, రావణాసురుడి తలలా చాలా వస్తున్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 200కి పైగా వెబ్‌సైట్లు తెలుగు సినిమాలని అక్రమంగా చూసేందుకు అందుబాటులో ఉంచుతున్నాయి. దీంతో పోలీసులని.. సదరు పైరసీ చేస్తున్నవారిని పట్టుకోవడం పెద్ద సవాలుగా మారింది. పైరసీని అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం.. రెండేళ్ల క్రితం సినిమాటోగ్రఫీ చట్టాన్ని సవరించింది. దాని ప్రకారం పైరసీ చేశారని తేలితే.. మూడేళ్ల జైలుశిక్ష, మూడు లక్షల రూపాయల నుంచి నిర్మాణ వ్యయంలో అయిదు శాతం మేర జరిమానా విధించే అవకాశం ఉంది. అయినా సరే పైరసీ ఎప్పటికప్పుడు జరుగుతూనే ఉంది.


