ఇంజీనీరింగ్, వైద్య విద్య రెండు చాలా భిన్నమైన కోర్సులు. రెండింటిని చదవాలనుకోవడం అంటే రెండు పడవల మీద కాళ్లు పెట్టినట్లుగా.. దేనిలోనూ మంచి స్కిల్‌ని సాధించలేం, రాణించలేం. కానీ అమ్మాయి రెండింటిలోనూ సత్తా చాటి అందర్నీ విస్మయపర్చింది. ఇక్కడ ఈ మహిళ ఇంజనీరింగ్ కెరీర్‌ని ఎంచుకుని..మంచిగా జాబ్‌లో సెటిల్ అయ్యాక స్టెతస్కోప్ పట్టుకునెందుకు రెడీ అవ్వడం విశేషం. అలాంటి నిర్ణయం వినడానికి కాస్త హాస్యాస్పదంగా అనిపించినా..ఆసక్తి ఉంటే ఏదైనా సాధ్యమే అని చూపించి ప్రేరణగా నిలిచింది.
ఆ అమ్మాయే ఆకృతి గోయెల్. 2016లో ఇంజనీర్ గ్రాడ్యుయేట్‌గా బయటకు అడుగుపెట్టి మంచి కెరీర్‌ని నిర్మించుకుంది. వేగవంతమైన స్టార్టప్‌ల ప్రపంచంలో విజయవంతమైన ఇంజనీర్ అనిపించుకుంది. కార్పోరేట్ ప్రపంచంలోకి దూసుకుపోయి..అందివచ్చిన నిచ్చెనలన్నీ ఎక్కేసింది. టీమ్ లీడర్‌గా అందరూ అసూయపడే రేంజ్‌లో వేతనం అందుకుంది. తనకు ఎదురేలేదు అన్నట్లుగా విజయపరంపరతో దూసుకుపోతున్న ఆమెకు సడెన్‌గా ఇక చాలు ఇందులో ఈదింది అనిపించింది.
ఎంతో అలసిపోతున్నట్లుగా, అసంతృప్తిగా సాగుతోంది లైఫ్ అనిపించిందామెకు. రోజురోజుకి ఇది వద్దు అనిపిస్తోందామెకు. ఏదో తెలియని ఒత్తిడితో ఆమె ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. సరిగ్గా లాక్‌డౌన్ టైంలో ఉద్యోగానికి రాజీనామా చేయాలనే నిర్ణయం ధైర్యంగా తీసుకుంది. ఆ తర్వాత తగిన విరామం తీసుకుని, ఏం చేయాలనే దానిపై స్పష్టత వచ్చేవరకు వేచి ఉంది. తదుపరి యోగా టీచర్‌గా, న్యాయవాదిగా లేదా హెచ్‌ఆర్ కన్సల్టెంట్‌గా మారాలని అని ఆలోచిస్తూ ఉండేది.
సరిగ్గా అప్పుడే తన చిన్ననాటి కల గుర్తుకొచ్చింది. కానీ ఇప్పుడు డాక్టర్‌గా వైద్య విద్యను అభ్యసించడమే ఫన్నీనా అనుకుంది. వయోపరిమితి లేదు కదా అని సరదాగా నవ్వుకుంది. ఇంతలో సుప్రీంకోర్టు వైద్య ప్రవేశ పరీక్షలకు ఉన్నత వయో పరిమితిని తొలగించింది. అంటే ఈ రంగంలోకి పయనించు అనేందుకు ఇది గ్రీన్ సిగ్నల్ కాబోలు అనుకుని..ఎలాంటి ఆలోచన లేకుండా మళ్లీ కెరీర్‌ని మొదటి నుంచి ప్రారంభించింది. అలా క్లాస్‌రూమ్‌లో బయాలజీ పాఠాలపై మనసులగ్నం చేసింది. బహుళ మిలియన్ డాలర్ల ప్రాజెక్టులను నిర్వహించిన ఆ మహిళ పెన్నుతో తడబడింది.
ఉపాధ్యాయులను అడగడానికి ఇబ్బంది పడే ప్రశ్నలను సైతం అడిగేందుకు భయపడలేదు. పదేళ్ల తర్వాత తరగతికి రావడం అంత సులభం కాలేదామెకు. అయినా అన్ని సవాళ్లను ఎదుర్కొంటూ చదవుకోసాగింది. మరోవైపు స్నేహితులు, బంధువులు టైం వేస్ట్ చేసుకుంటుందంటూ విమర్శించడం ప్రారంభించారు. కానీ ఆకృతి ఇంజీరింగ్ కెరీర్‌లో సక్సెస్ అందుకున్నా.. ఇందులో కూడా గెలుపు నా సొంతం అవ్వాలన్న కసి మరింత పెంచుకుంది. అవిశ్రాంతంగా చదివింది.
దాదాపు వంద మాక్‌టెస్ట్‌లకు పైగా రాసింది. ఆందోళనకు గురైనప్పుడల్లా..కుటుంబ మద్దతు తీసుకుని మళ్లీ రీఛార్జ్ అవుతుండేది. అలా నీట్ యూజీ పరీక్షలో 676 స్కోరు తెచ్చుకుని డాక్టర్ కోర్సు అభ్యసించింది. 2026లో డాక్టర్‌గా బయటకు అడగుపెట్టనుంది. కార్పొరేట్ లీడర్ నుంచి వైద్య విద్యార్థిగా సాగిన ఆమె ప్రయాణం స్ఫూర్తిదాయకం, ప్రేరణ కూడా. ఏ నిర్ణయం తీసుకున్నా..దానిపై స్ట్రాంగ్‌గా నిలబడాలి, నిలదొక్కుకునేలా విజయ ఢంకా మోగించాలని ఆకృతి స్టోరీ చెబుతోంది కదూ..!.
(చదవండి: పర్యావరణ స్ఫూర్తి: క్లీన్ ఎనర్జీ స్టార్స్..!)


