– నిర్మాతలు–పంపిణీదారులు ‘బన్నీ’ వాసు, వంశీ నందిపాటి
అఖిల్ రాజ్, తేజస్విని జంటగా నటించిన చిత్రం ‘రాజు వెడ్స్ రాంబాయి’. ఈటీవీ విన్ ప్రోడక్షన్స్‌పై సాయిలు కంపాటి దర్శకత్వంలో డా. నాగేశ్వర రావు పూజారి సమర్పణలో వేణు ఊడుగుల, రాహుల్ మోపిదేవి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 21న విడుదలైంది. నిర్మాతలు బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ సినిమాను విడుదల చేశారు. సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ‘బన్నీ’ వాసు మాట్లాడుతూ– ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ పెద్ద విజయాన్ని సాధిస్తోంది. ఇప్పటిదాకా రూ. 7.28 కోట్ల రూపాయల వసూళ్లు రాగా, కేవలం నైజాం నుంచే రూ. 5 కోట్ల 2లక్షలు వసూలయ్యాయి. ఏపీలో మొదటి రెండు రోజులు వసూళ్లు కాస్త తక్కువగా ఉన్నప్పటికీ మూడో రోజు నుంచి పుంజుకున్నాయి. ఐ–బొమ్మ క్లోజ్ కావడం వల్ల మా సినిమా కలెక్షన్స్ పెరిగాయి.
అలాగే టికెట్ ధర రూ. 99 పెట్టడం మాకు ప్లస్ అయ్యింది. ఈ రేటుకు మొదట్లో కొంతమంది ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ ఒప్పుకోలేదు. కానీ ఇప్పుడు 70 శాతం మంది ఈ రేటుకు అంగీకారానికి వచ్చారు’’ అని చెప్పారు. వంశీ నందిపాటి మాట్లాడుతూ– ‘‘రాజు వెడ్స్ రాంబాయి’ చూస్తూ అమ్మాయిలు ఎమోషనల్‡అవుతున్నారు. మా పెట్టుబడికి నాలుగు రెట్ల లాభాన్నిస్తుందని ఆశిస్తున్నాం. ఐ–బొమ్మలో పైరసీ మూవీస్‌ని ఎక్కువగా బీ, సీ సెంటర్స్ వాళ్లే చూస్తారు. ఇప్పుడా సైట్ క్లోజ్ కావడం వల్ల వాళ్లు థియేటర్స్‌కు రావడం పెరిగింది. టికెట్ రేట్ రూ.99 గా ఫిక్స్ చేసుకోకుంటే సింగిల్ స్క్రీన్స్ క్లోజ్ చేసుకోవాల్సిందే.. పరిస్థితులు అలా మారాయి’’ అన్నారు.


