'జన నాయగన్'కు కమల్‌ సపోర్ట్‌.. సెన్సార్‌ మారాలి | Actor And MP Kamal Haasan support to vijay | Sakshi
Sakshi News home page

'జన నాయగన్'కు కమల్‌ సపోర్ట్‌.. సెన్సార్‌ మారాలి

Jan 10 2026 4:00 PM | Updated on Jan 10 2026 4:09 PM

Actor And MP Kamal Haasan support to vijay

కోలీవుడ్‌ ప్రముఖ నటుడు విజయ్‌  నటించిన ‘జన నాయగన్’ విడుదలకు పలు ఇబ్బందులు రావడంతో  ఆయన ఫ్యాన్స్‌ భగ్గుమంటున్నారు. దీంతో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలను సైతం తప్పుబడుతున్నారు. జనవరి 9న విడుదల కావాల్సిన ఈ మూవీ సెన్సార్‌బోర్డు నుంచి ధ్రువీకరణ పత్రం రాకపోవడంతో సినిమా వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తమిళనాడులోని ప్రముఖ హీరోలతో పాటు రాజకీయ నేతలు కూడా విజయ్‌కు మద్ధతుగా నిలిచారు. అయితే, తాజాగా విజయ్‌ కోసం ప్రముఖ నటులు, రాజ్యసభ సభ్యులు కమల్‌హాసన్‌ ఒక ట్వీట్‌ చేశారు.

కళకు, కళాకారులకు, రాజ్యాంగానికి మద్దతుగా అంటూ అధికారిక ప్రకటనను కమల్‌హాసన్‌ విడుదల చేశారు. కమల్ హాసన్ ప్రకటనలో పలు అంశాలను లేవనెత్తారు.  'భారతదేశ రాజ్యాంగం మనందరికీ భావ ప్రకటనా స్వేచ్ఛను కల్పించింది. కానీ, దానిని నేడు కొందరు అంధకారంలోకి నెట్టివేస్తున్నారు. ఇది ఒక్క సినిమాకు సంబంధించిన విషయం కాదు.., కళాకారులకు మన రాజ్యాంగ ప్రజాస్వామ్యంలో ఇచ్చే స్థానం గురించి కూడా ప్రతిబింబిస్తుంది. సినిమా అనేది కేవలం ఒక వ్యక్తి కృషి మాత్రమే కాదు.. ఇందులో రచయితలు, సాంకేతిక నిపుణులు, నటులు, చిన్న వ్యాపారాలు కూడా భాగస్వామ్యంగా కలిసి నిర్మించే సమిష్టి శ్రమ. వీరి జీవనాధారం ఇందులో భాగమై ఉంటుంది.

సమాజంలో ఇలాంటి అంశాల్లో  స్పష్టత లేకపోతే సృజనాత్మకత కుంటు పడుతుంది. ఆపై ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోతాయి. ప్రభుత్వ తీసుకునే నిర్ణయాల పట్ల ప్రజల నమ్మకం తగ్గుతుంది. తమిళనాడుతో పాటు భారతదేశం సినీ ప్రేమికులు కళల పట్ల  ఎంతో ప్రేమను, పరిపక్వతను చూపుతారు. వారికి పారదర్శకతతో పాటు గౌరవం  ఇవ్వండి.  సినిమా సర్టిఫికేషన్ ప్రక్రియను మరోసారి పునఃపరిశీలించాలి. ఒక సినిమాకు ఇవ్వాల్సిన అనుమతులకు నిర్దిష్ట సమయ పరిమితులు ఉండాలి. అందులో పారదర్శకంగా అధికారులు పనిచేయాలి. సినిమా నుంచి ఏదైనా సీన్‌కు అభ్యంతరం ఉంటే అందుకు సంబంధించిన మార్పులను వ్రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలి. సినిమా పరిశ్రమ మొత్తం ముందుకు రావాల్సిన సమయం వచ్చింది. ప్రభుత్వాలతో చర్చించాల్సిన సమయం ఇదే. ' అని విజయ్‌కు మద్ధతుగా కమల్‌ ట్వీట్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement