ఓటీటీ కారణంగా జనాలు థియేటర్స్ రావడం తగ్గించారు. దానికి తోడు సినిమా టికెట్ల రేట్లు కూడా భారీగా ఉండడంతో సామాన్యుడు థియేటర్స్‌కి దూరం అయ్యాడు. సినిమాకి సూపర్ హిట్ టాక్ వస్తే తప్ప..ప్రేక్షకులు థియేటర్స్‌కి రావడం లేదు. ఈ క్రమంలో కొంతమంది టాలీవుడ్ నిర్మాతలు కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. టికెట్ ధరలను రూ. 99కే తగ్గించి, ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేందుకు ప్రయత్నిస్తున్నాడు. రాజు వెడ్స్ రాంబాయి' సినిమాతో మొదలైన ఈ ట్రెండ్, ఇప్పుడు 'మోగ్లీ 2025'తో మరింత బలపడుతోంది.
రాంబాయికి కలిసొచ్చిన 99
నవంబర్ 20న విడుదలైన రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి తొలి రోజు నుంచే టికెట్ ధరలను రూ. 99కి తగ్గించారు. మల్టీఫెక్స్‌లలోనూ రూ. 105కే సినిమాను ప్రదర్శించారు. దీంతో సినిమాకు మంచి కలెక్షన్స్ వచ్చాయి. మొత్తంగా రూ. 20 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. సినిమాకు యావరేజ్ టాక్ వచ్చినా..టికెట్ ధర తగ్గడంతో చాలా మంది సినిమా చూసేందుకు థియేటర్స్‌కి వెళ్లారు. ఫలితంగా సినిమాకు భారీ కలెక్షన్స్ వచ్చాయి.
రాంబాయి బాటలో మోగ్లీ..
రాజు వెడ్స్ రాంబాయి చిత్రానికి టికెట్ల రేట్లు తగ్గించడంతో మంచి ఫలితం వచ్చింది. దీంతో మోగ్లీ చిత్ర నిర్మాతలు కూడా అదే ఫాలో అయ్యారు. సుమ కనకాల కొడుకు రోషన్ హీరోగా నటించిన ఈ చిత్రం ఈ రోజు (డిసెంబర్ 13) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలలోని సింగిల్ స్క్రీన్లలో టికెట్ ధరలను 99 రూపాయలుగా నిర్ణయించారు. పేరుకు చిన్న సినిమానే కానీ బాగానే ఖర్చు చేశారు. అయినా కూడా టికెట్ రేట్‌ని 99 రూపాయలకే నిర్ణయించడం శుభపరిణామం. ఓ రకంగా చెప్పాలంటే టాలీవుడ్ సినిమాలకు ఇది ఓ కేస్ స్టడీ లాంటింది. పెద్ద సినిమాలకు ఎలాగో టికెట్ల రేట్లను భారీగా పెంచేస్తున్నారు.. కనీసం చిన్న సినిమాలకు అయినా తగ్గిస్తే..సామాన్యుడు థియేటర్‌కి వచ్చే అవకాశం ఉంటుంది.
అందుకే పైరసీపై ఆసక్తి!
కోవిడ్ తర్వాత ఓటీటీ వాడకం బాగా పెరిగిపోయింది. ఇంట్లోనే కూర్చొని సినిమా చూసేందుకు జనాలు అలవాటు పడ్డారు. డిజిటల్ సబ్‌స్క్రిప్షన్ రూ. 300-500 మధ్య ఉంటుంది. అందులో అనేక సినిమాలు, వెబ్ సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి. అయినా కూడా ప్రేక్షకులు కొత్త సినిమాలను థియేటర్స్‌లో చూడాలని కోరుకుంటారు. కానీ ధరలు భారీగా పెంచడంతో థియేటర్స్‌కి వచ్చే ప్రేక్షకుల సంఖ్య రోజు రోజుకి తగ్గిపోతుంది. సినిమా టికెట్ ధర మల్టీప్లెక్స్‌లలో రూ. 200-500 ఉంటుంది. ఫ్యామిలీతో ఒక్క సినిమాకు వెళ్తే రూ. 1000-2000 ఖర్చు అవుతుంది. ఇది సామ్యాడికి భారమే. అందుకే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. సీపీఐ నారాయణ చెప్పినట్లు టికెట్ల రేట్లు తగ్గించకపోతే ఐబొమ్మ రవిలాంటి వాళ్లు పుడుతూనే ఉంటారు.
అప్పుడు విమర్శించి..ఇప్పుడు ఫాలో అవుతున్నారు
అందుబాటు ధరలకే టికెట్లను అందిస్తే.. సామాన్యులు కూడా థియేటర్స్‌కి వస్తారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోనే వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో టికెట్ల రేట్లను తగ్గించారు. మల్టీప్లెక్స్‌లలో గరిష్టం రూ. 250, సింగిల్ స్క్రీన్లలో రూ. 20-100 మధ్య ఉండేలా ధరలను ఖరారు చేశారు. సినిమా బడ్జెట్ రూ. 100 కోట్లు దాటితే రూ. 50, రూ. 150 కోట్లు దాటితే రూ. 100 పెంచుకునేందుకు గతంలో జగన్ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అప్పుడు కొంతమంది నిర్మాతలు జగన్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఇండస్ట్రీని నష్టం కగించే నిర్ణయం అంటూ ఆయనపై విమర్శలు చేశారు. కానీ ఇప్పుడు మళ్లీ వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయాలనే అప్లై చేస్తున్నారు. ఇటీవల కర్ణాటక ప్రభుత్వం కూడా టికెట్ల రేట్లను తగ్గించే ప్రయత్నం చేసింది. టికెట్ ధరలు రూ. 200కి మాత్రమే పరిమితం చేయాలంటూ సెప్టెంబర్‌లో ఆదేశాలు జారీ చేస్తే.. మల్టీప్లెక్స్ అసోసియేషన్లు కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నాయి.


