ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ విజయాల జోరు కొనసాగించింది. 2025లో హిందీ సినిమాలు ఆధిపత్యం కొనసాగించాయి. కరోనా తర్వాత బాలీవుడ్ నుంచి విడుదలైన సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్స్‌గానే మిగిలాయి. అయితే, ఈ ఏడాది కాస్త పర్వాలేదు. చాలా సినిమాలు మినిమమ్ రూ. 100 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించినవే ఉన్నాయి. ఏడాది ప్రారంభంలోనే ఛావా వంటి సినిమాతో ఏకంగా రూ. 800 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. ఆపై సైయారా కూడా రూ. 600 కోట్ల మార్క్‌ను దాటేసింది. గతంలో అక్కడ టాలీవుడ్ సినిమాలు కల్కి, పుష్ప-2 వంటి సినిమాలు సత్తా చాటాయి. అయితే, ఈసారి మన సినిమాలు పెద్దగా ప్రభావం చూపించలేదు.
డిసెంబర్ నెలలో కూడా బాలీవుడ్ చిత్రాలు మెప్పిస్తున్నాయి. రణ్‌వీర్ సింగ్ నటించిన మూవీ ధురంధర్ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ జోరు కొనసాగిస్తుంది. ఇప్పటికే రూ. 300 కోట్ల మేరకు రాబట్టినట్లు ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. ధనుష్, కృతి సనన్ జంటగా నటించిన చిత్రం తేరే ఇష్క్ మే మంచి కలెక్షన్స్‌తో దూసుకుపోతుంది. ఆనంద్ ఎల్.రాయ్ రూపొందించిన ఈ మూవీ అంచనాలను మించి వసూళ్లు రాబట్టింది. ఇప్పటిదాకా ఈ చిత్రం దాదాపు రూ.180 కోట్ల దాకా వసూళ్లు రాబట్టినట్లు సమాచారం. కేవలం డిసెంబర్‌లోనే రూ. 200 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇప్పటికే రెండు ఉంటే.. మరోకటి భారీ అంచనాలతో రానుంది.
క్రిస్మస్ వీకెండ్‌లో డిసెంబర్ 31న ‘తూ మేరీ మై తేరా మై తేరా తూ మేరీ’ మూవీ విడుదల కానుంది. అనన్య పాండే, కార్తిక్ ఆర్యన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రంపై బాలీవుడ్ భారీ అంచనాలు పెట్టుకుంది. ఇందులో రూమిగా అనన్య, రే పాత్రలో కార్తిక్ కనిపించనున్నారు. కరణ్ జోహార్, అపూర్వ మెహతా సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీంతో హిందీ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. 2025లో బాలీవుడ్‌లో తెలుగు సినిమాలు పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ, సౌత్ నుంచి కాంతార-2 మాత్రమే బాలీవుడ్‌లో సత్తా చాటింది. 2025లో సౌత్ సినిమాలను వెనక్కి నెట్టిసి తన పట్టును హిందీ సినిమా నిలిబెట్టుకుంది.


