ఒకప్పటి సినీ నటి వాసుకి (పాకీజా) కొంత కాలంగా ఆంధ్రప్రదేశ్‌లోనే ఉంటున్నారు. తమిళనాడుకు చెందిన ఆమె మోహన్‌బాబు హిట్ సినిమా ‘అసెంబ్లీ రౌడీ’తో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. ఈ మూవీతో వచ్చిన గుర్తింపుతో ఆమెకు పెదరాయుడు, రౌడీ ఇన్‌స్పెక్టర్, మేజర్ చంద్రకాంత్, బ్రహ్మ ఇలా అనేక సినిమాలో ఛాన్స్ దక్కింది. దీంతో పేరు, డబ్బు సంపాదించింది. కానీ సంపాదించినదంతా పోగొట్టుకుని ఖాళీ చేతులతో, కడుపు మాడ్చుకుంటూ బతికేంత దుస్థితి చేరుకుంది.
అయితే, ఆమె దుర్భర జీవితం గడుపుతున్న విషయం సోషల్‌మీడియాలో కొంత కాలంగా వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీంతో ఆత్రేయపురంలోని శ్రీరామ వృద్ధాశ్రమం నిర్వాహకుడు జల్లి కేశవరావు ఆమెకు ఆశ్రయం కల్పించారు. ప్రస్తుతం ఆమె ఆయన నిర్వహిస్తున్న ఆశ్రమంలోనే పాకీజా ఉన్నారు.
డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంకలోని శ్రీరామ వృద్ధాశ్రమంలో పాకీజా కొంత కాలంగా ఆశ్రయం పొందుతున్నారు. ఇప్పటికే ఆమె ఆధార్ కార్డులో చిరునామా మార్పునకు కేశవరావు సహకరించారు. ఆమెకు ఏపీ ప్రభుత్వం నుంచి పింఛనుతోపాటు బియ్యం కార్డు మంజూరు చేస్తే ఆమెకు కాస్త ఆసరాగా ఉంటుందని ప్రభుత్వాన్ని కేశవరావు కోరారు. ఇప్పటికే తన వద్ద చాలామంది వృద్ధాశ్రమంలో ఆశ్రయం పొందుతున్నారని ఆయన పేర్కొన్నారు.
తనను తెలుగువారికి పరిచయం చేసిన మోహన్‌బాబు కుటుంబం రుణం తీర్చుకోలేనిదని పాకీజా అన్నారు. కొద్దిరోజుల క్రితం ఆయన కుమారుడు మంచు విష్ణు తన పరిస్థితిని చూసి చలించిపోయారని గుర్తుచేసుకున్నారు. తన కళ్లకు శస్త్రచికిత్స చేయించారని ఆమె తెలిపారు. పాకీజాకు ఇప్పటికే చిరంజీవి ఆర్థిక సాయం చేశారనే విషయం తెలిసిందే.


